జపనీస్‌ ‘కథల దేవుడు’

ABN , First Publish Date - 2021-02-08T06:25:26+05:30 IST

రచన చేయడం షిగా దృష్టిలో ఒక నిర్మలీకరణ సాధన. కథ రాయడం తనకు పూర్తి వ్యక్తిగత వ్యాసంగం. ఎందుకంటే షిగా దృష్టిలో కథా రచనకు ప్రేరణ, ప్రయోజనం కూడా రచయితే...

జపనీస్‌ ‘కథల దేవుడు’

రచన చేయడం షిగా దృష్టిలో ఒక నిర్మలీకరణ సాధన. కథ రాయడం తనకు పూర్తి వ్యక్తిగత వ్యాసంగం. ఎందుకంటే షిగా దృష్టిలో కథా రచనకు ప్రేరణ, ప్రయోజనం కూడా రచయితే. ఆ కథా ప్రయోజనం పాఠకుడికి అందటం యాదృచ్ఛికం. మరి కథా వస్తువు? ‘‘నిజాయితీ ఉన్న కథ చెప్పాలంటే రచయిత తన కథే చెప్పాలి, అదే చెప్పగలడు’’ అంటాడు షిగా. 


1860-1890ల మధ్య జపాన్‌లో ఏర్పడిన రాజకీయ పరిస్థితి- ఆ దేశ యువతకు అటు యూరప్‌ అమెరికాల ప్రభావం నుంచీ, ఇటు దేశంలో తీవ్ర మౌతున్న జాతీయవాదం నుంచీ కూడా తమ వ్యక్తి స్వేచ్ఛనూ అభివ్యక్తి స్వేచ్ఛనూ నిలిపి, దృఢతరం చేసుకోవలసిన అనివార్యతను తీసుకువచ్చింది, ముఖ్యంగా సాహిత్యంలో. అందుకు నవలా ప్రక్రియ ప్రతిభావంతంగా పనికి వస్తుందని, అప్పటికి పాశ్చాత్య ప్రపంచంలో చెలామణీ అవుతూ ఉండిన యూరోపియన్‌ నవలను వారు తమ అభిరుచులకు, ప్రాముఖ్యతలకు సరిపోయే ‘‘Shi shosetsu’’ (I-novel)గా పునర్నిర్మించుకున్నారు. 


‘I-novel’ అంటే ‘‘నేను’’ ప్రధానపాత్రగా సాగే నవల. యూరోపియన్‌ నవలకు ముఖ్య గుణమైన కాల్పనికతకు ముందు ఉద్వాసన పలికిన జాపనీయ రచయిత, ఉత్తమ పురుషలో తన కథను తనదే ఐన ప్రత్యేక శైలిలో చెపుతూ, దానినే I-novel విధాన ముఖ్య లక్షణం చేసాడు. ఈ శైలిని ఫ్రెంచి నాచురలిస్ట్‌ నవల, యూరోపియన్‌ వ్యక్తి ప్రాధాన్య భావుకత, జాపనీయ ఆలోచనా స్రవంతి వ్యాస శైలుల మిశ్రమం అనుకోవచ్చు. 


ఉట్టి ఆత్మకథ అనలేని ఈ I-novel యే ఒక కుతూహలమైన విరోధాభాస: ‘‘ఐ’’ను కల్పించటం ద్రోహం, I-novelలో ‘‘నిజాని’’కి తావుండదు. కానీ జపాను ఈ రెండూ కలిపిన సామును అపూర్వంగా చేసి ఈ ప్రక్రియలో గొప్ప నవలలు, కథలు సృష్టించింది. Shi shosetsu రచయితల ఈ సాహసాన్ని జీర్ణం చేసుకోలేని పాశ్చాత్య సాహితీలోకం ‘‘వీళ్ళది narrative of rhetoric (సొంత గోడు) మాత్రమే, ఇది నవల కాద’’న్నది, మళ్ళీ తనే ‘‘మసిపూయకుండా నిజాయితీగా చక్కగా చెప్పిన ఆత్మకథలు’’ అనీ అన్నది. నిజానికి ఇవి, కేవలం వాస్తవ సంఘటనలను ముచ్చటించిన ఆత్మకథలు కూడా కావు. 


I-novel రచయితల్లో నవోయ షిగాకు విశేషమైన పేరున్నది. వందకు పైచిలుకు చిన్న కథలు, మూడు నవలికలు, ఒక పెద్ద నవల, గొప్ప సంఖ్యలో వ్యాసాలు రాసిన ఈయనను కథల దేవుడని, Shi shosetsu ప్రక్రియను ప్రతిభావంతంగా వాడుకున్నవాడని, ‘A Dark Night's Passing’ అనే ఈయన నవలను ‘Divine novel’ అనీ అంటారు జపాన్‌లో. తన సమకాలీన రచయితలైన అకుతగవ, సొసేకి, జునిచిరోల పైన ఇతని ప్రభావం గాఢంగా ఉంది. కానీ వారికి ప్రపంచ సాహిత్య లోకంలో దక్కిన గుర్తింపు ఇతనికి దొరక లేదు. షిగా కథలకు వేరే భాషల్లో అనువాదాలు ఆయన చివరి రోజుల (1970) దాకా రాకపోవటానికీ, పాశ్చాత్య సాహిత్య సమీక్షకులు ఆయనపై శీతకన్ను వేయడానికీ- షిగా యూరప్‌ నవలా రూపానికి ఆయువుపట్టైన కథనాన్ని, శిల్పాన్ని నిష్పూచిగా తోసిపుచ్చి ‘‘షిషోసెట్సు’’లో కథలు చెప్పడం ఒక కారణమైతే, క్రమంగా షిగా తన తర్వాతి కథల్లో షిషోసెట్సు నియమాలు కూడా నెట్టి పారేసాడు, I-novelలో కల్పనను జోడించాడు అన్నారు. వాస్తవంలో వారికి అతను అందలేదు. 


అతని భాషలో లయ, కవితాత్మక వచనం అనువాదాలకు లొంగలేదు. ఈ కారణంగానే ఆధునిక జాపనీయ సాహిత్యంపై గొప్ప ప్రభావం చూపించి, తన దేశంలో చాలామంది అనుసరణీయులను, పండిత పాఠకులను సంపాదించుకున్న అతనికి బయట ప్రపంచంలో గుర్తింపు దూరం అయింది.  

తన సమురాయ్‌ వంశ కుటుంబం చాలా చిన్న చూపు చూసే కథా రచనను వృత్తిగా ఎంచుకుని దాని నుంచి ఎటువంటి ప్రతిఫలం, చివరికి ఆర్థికం అయినా, ఆశించకుండా, కనీసం పాఠకులను ఉద్ధరించగలననే భ్రమ కూడా లేకుండా ఇన్ని కథలు, నవలలు రాయడంలో షిగా ఉద్దేశ కారణాలు కూడా తన నవలా రూపం లాగే చాలా కొత్తవి, ఎక్కడా విననివి. రచన చేయడం షిగా దృష్టిలో ఒక నిర్మలీకరణ సాధన. కథ రాయడం తనకు పూర్తి వ్యక్తిగత వ్యాసంగం. ఎందుకంటే షిగా దృష్టిలో కథా రచనకు ప్రేరణ, ప్రయోజనం కూడా రచయితే. ఆ కథా ప్రయోజనం పాఠకుడికి అందటం యాదృచ్ఛికం. 


మరి కథా వస్తువు? ‘‘నిజాయితీ ఉన్న కథ చెప్పాలంటే రచయిత తన కథే చెప్పాలి, అదే చెప్పగలడు’’ అంటాడు షిగా. అలా అని పగలు పిచ్చాపాటి ముచ్చట్లలో చెప్పవలసిన దినసరి సంగతులో, రాత్రుళ్ళు డైరీలో ఎక్కించాల్సిన సంఘటనల వివరాల పట్టికో కాదు కథలో చూపవలసినవి. ఇట్లాంటి విషయాలు పేరు తెచ్చిపెట్టగల ఒక నవలకు సామగ్రి కావచ్చు కానీ, ‘‘ఏ ఒక విషయం అయితే మామూలు సంభాషణలలో చెప్పడానికి కుదరదో అదే గొప్ప కథావస్తువు కాగలదు’’ అంటాడు షిగా. 


ఆ ‘‘ఒక విషయం’’, దాని సౌందర్యం ఏమిటనేది నేరుగా చెప్పడు కానీ, తన దృష్టిలో సాహిత్య సిద్ధాంతం, ప్రయోజనాలు యివై ఉండాలి అని చెప్పే సందర్భంలో అది వెల్లడవుతుంది. షిగాకు అత్యంత సౌందర్యమూ, ముఖ్యంగా కథ అవదగిన లక్షణమూ-మనిషి తన సహజ ప్రవృత్తికి అనుగుణంగా స్పందించే క్షణంలో, దానికి తగినట్లుగా నడుచుకునే సందర్భంలో కనిపిస్తుంది. 

ఆధునిక మానవుడు తనకు సహజాతంగా వచ్చిన మానవ ప్రవృత్తిని మరిచి పోయి బతుకుతూ, మానవ స్వాభావికమైన ఆత్మరక్షణ లక్షణాన్ని పోగొట్టుకుని అటు భౌతిక ఉపద్రవాలకు, ఇటు మానసిక దుర్బలత్వానికి, దుఃఖాలకు ఇష్టంగా లోబడుతున్నాడు-లోకంలో, కావ్యంలో కూడా. కథా రచన క్రియ రచయితను, తన పాఠకుణ్ణి కూడా మానవ సహజ ప్రవృత్తి(basic instinct)కి మేలు కొల్పాలి. సహజ ప్రవృత్తి అంటే పశు ప్రవృత్తి కాదు. అది మనిషికి మాత్రమే ప్రకృతి సిద్ధంగా సంక్రమించిన వివేకం. అది మేధస్సు కాదు, జీవి ప్రాథమిక లక్షణం అయిన విచక్షణ. ఆ విచక్షణే వాస్తవ ప్రపంచాన్ని సరిగ్గా చూసేందుకు, దానికి స్పందించేందుకు, అందులో వ్యవహరించేందుకు మనిషికి సాయపడుతుంది. షిగా కథల వస్తువు కేవలం ఆ చూడటం, స్పందించడమే. ‘‘పరిశీలన’’- అది తననుగాని, ప్రపంచాన్నిగాని. తన సంఘర్షణ పరిష్కరించేందుకైనా, ప్రపంచాన్ని అర్థం చేసుకునేందుకైనా పరిశీలన చేయడం, ఆ పరిశీలన క్రియను అక్షరీకరణ చేయడమే షిగా చేసింది. అందుకే ఏ మాత్రమూ గొప్పతనం ఆపాదించలేని మామూలు మనుషులు, సంఘటనలు షిగా దృష్టితో అపూర్వమైన దృశ్య కథనాలయినాయి. 


షిగా ఎంచుకున్న కథా వస్తువులు అతని రైలు ప్రయాణాల్లో తోటి ప్రయాణికులో, ఓ షాపులో పనిచేసే చిన్నపిల్లవాడో, ఒక ఆక్సిడెంట్‌ నుంచి బయట పడి తేరుకోవడానికి తను వెళ్ళిన చోట ఎదురైన కందిరీగో, ఇంకొకచోట పిల్లివాత పడ్డ కోడిపిల్లల తల్లో, తను స్నేహితులతో వెళ్లిన ఒక చిన్న పిక్నిక్కో.... షిగాకు గొప్పతనం వస్తువుల్లో ఉండదు, అది పర్వతమైనా ఎలుకైనా ఒకటే. ఈ రెండూ అతనికి వేరు వేరు కథల్లో కథావస్తువులు. గొప్ప సాహిత్యం గొప్ప విషయంతో రాదు, విషయాన్ని చూచిన విధం, ఆ ప్రభావం, అందులో తెలియ వచ్చిన ‘‘ఎఱుక’’... ఇవీ షిగా కథాంశాలు. నవలల్లోని స్త్రీ పురుషులు మానవ సహజమైన వివేచనతో ప్రతికూల పరిస్థితులను అధిగమించడంలోను, ఆ అనుభవ సాయంతో మరింత పరిణతి పొందే గమనంలోనూ గొప్ప సౌందర్యం కనపడుతుంది, అదే సాహిత్యానికి ఉండవలసిన నిజమైన ప్రయోజనం అంటాడు షిగా. అదే తన సాహిత్య సిద్ధాంతం. అందుకే తన కథలలో విఫల ప్రేమలు, విషాదంలో ఆనందం వెతుక్కునే మానసిక దుర్బలులు, ఆత్మహత్యలు చేసుకునే ఉద్రేక స్వభావులూ ఉండరు. మనిషికి బలహీనతలతో పాటు విచక్షణా జ్ఞానమూ పుట్టుకతోటే వస్తుంది. అంతర్గతంగా ఉన్న ఆ వివేచనకు పాఠకులను ప్రచోదనం చేయడమే మంచి సాహిత్య ప్రయోజనం షిగా దృష్టిలో. 


ఇక్కడ, షిగామీద పద్దెనిమిదో శతాబ్దపు జాపనీయ సాహితీ సిద్ధాంతకారుడు, తత్వవేత్త నోరినాగ ప్రభావం ఉందనుకోవచ్చు. ‘‘ఏ కళ ఐనా ప్రేక్షకుడికైనా, పాఠకుడి కైనా ఒక మెలకువ తెప్పించేదిగా ఉండాలి. జన్మతః మానవుడిగా తనకు ప్రకృతి ద్వారా సంక్రమించినా, పెరిగే క్రమంలో సిద్ధాంతాల ముసుగులు వేసుకోవడంలో మనిషి పోగొట్టుకున్న తన మూల ప్రకృతి (‘‘Nature’’)పట్ల స్పృహ కలిగించాలి’’ అనీ, అటువంటి స్పందనను ‘‘మోనో నో అవేర్‌’’ (Mono no aware) అనీ అంటాడు నోరినాగ. ప్రేక్షకుడిని స్పందింప చేసి, సహజ ప్రకృతికి జాగరూకుణ్ణి చేయగలిగినదే గొప్ప కళ అనే నోరినాగ సిద్ధాంతమే అంతస్సూత్రంగా షిగా రచనల్లో కనపడుతుంది.   


షిగా కథల్లో అల్లి చెప్పడం ఉండదు. అప్పుడు, అక్కడ ఉన్న వాస్తవాన్ని ఎట్లా చూడాలో చూపించే కథలు ఆయన రాసినవి. ‘‘వాస్తవాని’’కి సరిగా స్పందించడం ఎలాగో పాఠకుడికి తెలిసివచ్చేట్టు చేసే కథలు. Man’s first responsibility is to be able to respond. Shiga records his responses in ‘Shi shosetsu’, the genre best suited for his chosen subject and style. మనిషి వివిధ అస్తిత్వ పోరాటాలే జీవితంలోనూ, సాహిత్యంలోను సదా కావ్య వస్తువు. షిగా జీవితంలో కూడా తండ్రి తోటి మనస్పర్థ అతను ఎదుర్కోవలసి వచ్చిన పెద్ద కష్టం. నాయనకు ఇష్టం లేని తన రచనా వ్యాసంగం, ఒక పిల్ల తల్లైన వితంతువుతో వివాహం, తనను తండ్రికీ, కుటుంబ వారసత్వానికి తాత్కాలికంగా దూరం చేసాయి. ‘The Reconciliation’ అనే నవలికలో పూర్తిగా, ‘A darknight's Passing’ నవలకు కొద్దిగా, ఆ ఘర్షణే నేపథ్యం. కథలో ఆ సంఘర్షణ తాలూకు వివరాలుండవు. తండ్రి తోటి సంఘర్షణ సమసిపోవటానికి తనతో తను చేసిన పోరాటం, ఆ సాధనలో అనుభవాలే కథ మొత్తం. షిగా ‘‘నా కథ’’ అంటూ చెప్తున్న ఈ I-novelలో షిగా ఎక్కడా కనిపించడు, తన పోరాట ప్రయాణం మాత్రమే కనిపిస్తుంది. రచయిత కనిపించని ఆత్మకథ ఇది. తండ్రితో సఖ్యత కుదిరాక ఇక తనకు పరిష్కరించవలసిన పోట్లాటలు లేవు, ప్రపంచం పట్ల ఫిర్యాదులూ లేవు. అసమానతల ప్రపంచాన్ని అర్థం చేసుకోవడం అంటే దానికి తగులుకోకుండా, కొంచెం తొలగి నిల్చుని దానిని ఒక దోషిలాగాక దయతో దానిలోని సౌందర్యం చూడగలగటమే మనిషి చేయవలసినది అనే సత్యం షిగా తెలుసుకున్నాక, ఇక రాయవలసిన కథలు లేవు అనుకుని, రచనలు చేయడం క్రమంగా తగ్గిస్తూ, చివరకు పూర్తిగా మానేసి నలభై యేళ్ళు విశ్రాంత రచయితగా జీవించాడు షిగా. బహుశా అన్నేళ్ళు నిరుద్యోగిగా ఉన్న నవలాకారుడు ప్రపంచంలో ఈయన ఒకడే. ఇది అందరికీ కొరుకుడు పడే ప్రొఫెషనల్‌ ఫిలాసఫీ కానక్కరలేదు. 


సాహిత్య ప్రయోజనం విషయంలో ఇతని సిద్ధాంతం కొంత didacticగా కనిపించినా శైలి సంగతికి వస్తే ఈయనది ఒక gentle guide లాంటిది, ఒక పీఠంపైన కూచుని బోధలు చేయడు. తను కథను నడిపిన తీరులోనే పాఠకుడికి రచన నుంచి చేరవలసిన మాట చేరుతుంది. ఈయన వచనం లయబద్ధమైన కవితలా సాగిపోతుంది అంటారు మూలభాషలో కథలు చదివిన వారు. ‘‘కథ అసంకల్పితంగా స్వేచ్ఛగా రచయిత అంతరంగం నుంచి రావాలి, వ్యాకరణంకానీ లయకానీ భాషకు సంబంధించినవి కావు. 


రచయిత ఆలోచనా శక్తికి అనుగుణంగా నడుచుకుంటూ వచ్చిన వాక్యంలో సహజంగానే చక్కటి వాక్యనిర్మాణం, లయ ఉంటాయి. అప్పుడు ప్రయత్నపూర్వకంగా కథనానికి ప్రాముఖ్యత ఇవ్వకపోయినా స్వతఃసిద్ధంగా కథలో శిల్పం ఏర్పడుతుంది.’’ షిగా చెప్పడమే కాక, అనన్య సామాన్యంగా సాధించిన కథా లక్షణం ఇది. ‘‘ప్రకృతి’’ని పదేపదే ప్రస్తావించే షిగా దృష్టిలో ప్రకృతి అంటే నదులూ కొండలూ, పూవులూ పచ్చిక బయళ్ళూ, పొలాలు సెలయేళ్ళూ కాదు; వాటి వర్ణన ఉండదు అతని రచనల్లో. బయటి, లోపలి ప్రకృతులకు రెంటికీ మూలమైనది తను మాట్లాడే ప్రకృతి.  


నవోయ షిగా కథలన్నీ గొప్ప అనుభవాన్ని ఇచ్చేవే, మరీ ముఖ్యంగా ‘At Kinosaki’ (కొద్దిలో మృత్యువును తప్పించుకున్నప్పుడు తనకు వచ్చిన ఆలోచనలు ప్రేరణగా, మృత్యువు వస్తువుగా వ్రాసిన గొప్ప తాత్విక కథ), ‘The Reconciliation', 'The Shopboy's God'. 'Manazuru,’ Han's Crime' ఇంకా మరికొన్ని ప్రపంచ సాహిత్యంలో గొప్పగా ఎన్నదగిన కథలు. పైన ఒక సందర్భంలో మనిషి ప్రాథమిక నైజం (basic instinct) గురించి చెప్పుకుంటూ ఇది పశుప్రవృత్తి కాదు అన్న గ్రహింపుకు చిన్న కొనసాగింపు: మరు నిమిషంలో చావు తప్పించుకోలేని పరిస్థితిలో ఉండీ ఆ సంగతి ఎంత తెలుసో తెలియదో కానీ బతికి బయటపడడానికి చివరి నిమిషం వరకూ ప్రయాసపడిన ఎలుక పోరాటానికి ‘At Kinosaki’లో, అటువంటి పరిస్థితి లోనే తనూ ఉన్నప్పుడు సరైన సమయంలో చికిత్స అందే విధంగా తను చేసుకున్న ప్రయత్నానికీ పోలిక చూడగలిగాడు షిగా. అలాగే కోడి పిల్లల తల్లి అచ్చం ఒక మనుష్య స్త్రీ తన పిల్లలను కాచుకున్నట్లే కాచుకోవడం ‘Dwelling by the Moat’లో ఉంటుంది. అందులో హృద్యమైన అందం ఉంది. అదే, మనిషి వివేకం కోల్పోయి పశుస్థాయికి జారితే ఏహ్యంగా ఉంటుంది. అంతకన్నా అధమం అసలు స్పందనను నిరాకరించడం. అందుకే మనిషిని అనుభూతులకు, సహజ స్పందనలకూ దూరంగా ఉండమనీ, మానవ జీవితం బుద్బుద ప్రాయ మని మాటలు చెప్పే బౌద్ధ, కనఫ్యూషియన్‌ బోధనలను నోరినాగ, షిగా ఇద్దరూ ఖండిస్తారు. స్పందించలేనివాడు యోగి కాలేడు సరికదా, పశువైనా కాలేడు అంటారు. 

‘A darknight's Passing’ నవల రాసేటప్పుడు షిగా, ‘‘నేను ఈ సంవత్సరం సంపూర్ణమైన రచయితగా జీవించదలుచుకున్నాను, ఉద్వేగాలకు లోనవను, ఎవరితోటీ ఘర్షణలకు దిగను, బాహ్యాంతర కాలుష్యాలకు దూరంగా ఉంటాను, భార్యాపిల్లలపట్ల వ్యామోహం లేని ప్రేమ చూపిస్తాను, ఆడంబర జీవితానికి దూరంగా ఉంటాను, ప్రశాంతంగా కాలం గడపాలనుకుంటున్నాను అచ్చమైన మనిషిగా,’’ అన్న మాట మనకు వద్దనుకున్నా తలపుకు తెచ్చే మరో మాట ‘‘నానృషిః కురుతే కావ్యం’’! మంచి సాహిత్య రచనతో మెరుగైన నడవడి, మంచి నడవడికతో చక్కటి సాహిత్యం సాధించగలరు అనే షిగా మాట అన్ని వేళలా, అందరికీ అనువు కాకపోవచ్చు. కానీ షిగా కథలన్నీ తను పరిపూర్ణ మానవుడయేందుకు చేసిన ప్రయాణాన్ని అక్షరీకరించడమే. దాని ప్రయోజనం అంతవరకే. అందుకే తన దృక్పథంలో ఎంత గొప్ప సాహిత్యం అయినా, అది జీవితం కంటే గొప్పది కాదు.

పద్మజ సూరపరాజు

99403 44406

Updated Date - 2021-02-08T06:25:26+05:30 IST