Bullet trainలో చంద్రునిపై షికారు!

ABN , First Publish Date - 2022-07-17T17:51:45+05:30 IST

చంద్ర (Moon), అంగారక (Mars) గ్రహాలకు బుల్లెట్ రైలు (Bullet train) సదుపాయం

Bullet trainలో చంద్రునిపై షికారు!

న్యూఢిల్లీ : చంద్ర (Moon), అంగారక (Mars) గ్రహాలకు బుల్లెట్ రైలు (Bullet train) సదుపాయం కల్పించేందుకు జపాన్ ప్రణాళికలను సిద్దం చేసింది. భూమి గురుత్వాకర్షణ శక్తి, వాతావరణం, స్థలాకృతులను పోలి ఉండే ఓ గాజు నిర్మాణాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తోంది. ఈ నిర్మాణంలో ఉన్న మానవులకు తాము తమ ఇంట్లో ఉన్నామనే భావన కలిగే విధంగా చేయాలని ఆలోచిస్తోంది. ఈ ప్రణాళిక విజయవంతమైతే అంతరిక్ష యానం (Space Travel) ఓ పెద్ద కుదుపునకు గురవుతుంది. 


జపాన్‌లోని క్యోటో విశ్వవిద్యాలయం (Kyoto University) పరిశోధకులు ఇటీవల మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తాము కజిమా కన్‌స్ట్రక్షన్‌తో కలిసి ఓ ప్రణాళిక అమలు కోసం కృషి చేస్తున్నామన తెలిపారు. చంద్ర, అంగారక గ్రహాలపైకి మానవులు రాకపోకలు సాగించేందుకు అనువైన ఓ రవాణా సాధనాన్ని రూపొందించేందుకు కృషి చేస్తున్నామన్నారు. 


జపనీస్ పరిశోధకులు ఈ అంతర్‌గ్రహ రవాణా వ్యవస్థకు హెక్సాట్రాక్ (Hexatrack) అని పేరు పెట్టారు. ఎక్కువ దూరం ప్రయాణం చేసేటపుడు ఈ హెక్సాట్రాక్ 1జీ గ్రావిటీని మెయింటెయిన్ చేస్తుందని, దీనివల్ల తక్కువ గురుత్వాకర్షణ శక్తికి గురికావడం వల్ల కలిగే ప్రభావాలను తగ్గించవచ్చునని  పరిశోధకులు వెల్లడించారు.


రైళ్ళలో షడ్భుజి (ఆరు భుజాలు) ఆకారంలో క్యాప్సూల్స్ ఉంటాయని, వీటిని హెక్సాక్యాప్సూల్స్ అంటారని తెలిపారు. ఈ క్యాప్సూల్ మధ్యలో కదిలే పరికరం ఉంటుందన్నారు. భూమి-చంద్రుడు మధ్య అనుసంధానానికి 15 మీటర్ల వ్యాసార్థంగల మినీ క్యాప్సూల్‌ను తయారు చేస్తామన్నారు.అదేవిధంగా చంద్రుడు-అంగారకుడు మధ్య అనుసంధానానికి 30 మీటర్ల వ్యాసార్థంగల క్యాప్సుల్‌ను తయారు చేస్తామన్నారు.  జర్మనీ, చైనాలలో మాగ్లెవ్ రైళ్ళ కోసం ఉపయోగించే ఎలక్ట్రోమ్యాగ్నెటిక్ టెక్నాలజీ తరహా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తామని చెప్పారు. 


చంద్రునిపై రైల్వే స్టేషన్‌ను లూనార్ స్టేషన్ (Lunar Station) అని పిలుస్తామని, దీనికి గేట్‌వే శాటిలైట్‌ను ఉపయోగిస్తామని చెప్పారు. అంగారకునిపై రైల్వే స్టేషన్‌ను మార్స్ స్టేషన్ (Mars Station) అని పిలుస్తామని, ఇది మార్షియన్ శాటిలైట్ ఫోబోస్‌పై ఉంటుందని తెలిపారు. 


హ్యూమన్ స్పేసియాలజీ సెంటర్ వెల్లడించిన వివరాల ప్రకారం, ఎర్త్ స్టేషన్‌ను టెర్రా స్టేషన్ అంటారు. అంతర్జాతీయ రోదసీ స్టేషన్ (ఐఎస్ఎస్) తర్వాత ఇది రాబోతున్నట్లు తెలుస్తోంది. రోదసీ రైలు స్పేస్ ఎక్స్‌ప్రెస్ స్టాండర్డ్ గేజ్ ట్రాక్‌పై నడుస్తుంది. 


షాంపేన్ ఫ్లూట్ ఆకారంలో...

భూమిపైగల సదుపాయాలను పునఃసృష్టి చేయాలని క్యోటో విశ్వవిద్యాలయం పరిశోధకులు ప్రయత్నిస్తున్నారు. షాంపేన్ ఫ్లూట్ ఆకారంలో ఓ నిర్మాణాన్ని నిర్మించాలని ప్రణాళిక రచించారు. దీనిలో కృత్రిమ గురుత్వాకర్షణ శక్తి, పచ్చదనం, నీటి చెలమలు, ప్రజా రవాణా వ్యవస్థ వంటివి ఉండేలా చూడాలని ప్రయత్నిస్తున్నారు. ఈ నిర్మాణాన్ని ‘ది గ్లాస్’ అని పిలవాలని నిర్ణయించారు. 


2050నాటికి నమూనా

ఈ ప్రయోగాలు విజయవంతమై, ప్రజలకు అందుబాటులోకి రావడానికి మరో వందేళ్లు పట్టవచ్చునని తెలుస్తోంది. అయితే మార్స్‌గ్లాస్, లూనార్‌గ్లాస్‌ల సరళీకృత నమూనాలను 2050నాటికి నిర్మించాలని పరిశోధకులు లక్ష్యంగా పెట్టుకున్నారు. భవిష్యత్తులో అంతరిక్షంలో మానవుల గ్రామాలు రావడానికి జపాన్ పరిశోధకుల పరిశోధనలు చాలా కీలకంగా మారుతాయని చెప్తున్నారు. 


Updated Date - 2022-07-17T17:51:45+05:30 IST