సిమ్లా: రాజకీయాల్లో ప్రతీసారీ సీరియస్ ఇష్యూలే ఉండవు. అప్పడప్పుడు చమక్కులు కూడా చోటుచేసుకుంటుంటాయి. అటువంటిదే హిమాచల్ రాజకీయాల్లో చోటుచేసుకుంది. తాజాగా ట్విట్టర్లో ‘జావో రామ్’ అనే పదం పరిచయమయ్యింది. ఇంతవరకూ ఆయా రామ్, గయా రామ్ అనే పదాలు రాజకీయాల్లో తరచూ వినిపించేవి. ఇప్పుడు ‘జావో రామ్‘ అనే పదం హిమాచల్ ముఖ్యమంత్రి జయరామ్ ఠాకూర్‌ను ఉద్దేశించి వచ్చిందని పలువురు నేతలు అంటున్నారు.
జయరామ్ ఠాకూర్ ప్రభుత్వంలోని పబ్లిక్ రిలేషన్ డిపార్ట్మెంట్ తరపున వచ్చిన ఒక ట్వీట్లో ముఖ్యమంత్రి పేరు ‘జావో రామ్’ అని తప్పుగా వచ్చింది. ఈ తప్పును గుర్తించిన వెంటనే అధికారులు దానిని తొలగించారు. రాష్ట్రప్రభుత్వంలో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్న ప్రస్తుత తరుణంలో ఈ ట్వీట్ కలకలం రేపుతోంది. గుజరాత్, హిమాచల్ ప్రదేశ్లలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.