జనవరి 26 మెరుపులూ మరకలూ

ABN , First Publish Date - 2021-01-26T06:44:08+05:30 IST

భారత రిపబ్లిక్ నేడు 72 ఏట అడుగుపెట్టనున్నది. మనం ఆత్మశోధన చేసుకోవల్సిన శుభసందర్భమిది. విభిన్న భాషలూ, మతాలూ, సంప్రదాయాల...

జనవరి 26 మెరుపులూ మరకలూ

ఈరోజు కేవలం పండుగ చేసుకోవడం కన్నా మన లక్ష్యాలకు పునరంకితం 

కావడంపై శ్రద్ధ చూపాలి. కర్షకులు, 

శ్రామికులు, ఆలోచనాపరులు స్వేచ్ఛగా, సంతోషంగా ఉండేలా చేసే గొప్ప లక్ష్యానికి 

కట్టుబడి ఉందాం.

బాబూ రాజేంద్రప్రసాద్ 

1950, జనవరి 26


భారత రిపబ్లిక్ నేడు 72 ఏట అడుగుపెట్టనున్నది. మనం ఆత్మశోధన చేసుకోవల్సిన శుభసందర్భమిది. విభిన్న భాషలూ, మతాలూ, సంప్రదాయాల సంగమమైన విశాల భారతాన్ని దృష్టిలో పెట్టుకుని మన రాజ్యాంగాన్ని రూపొందించారు. ప్రపంచ చరిత్రలోనే ఇదొక అద్వితీయమైన విషయం. రెండో ప్రపంచయుద్ధం తరువాత వలసపాలన నుంచి విముక్తిపొంది, రిపబ్లిక్‌గా అవతరించడంతో పాటు ప్రజాస్వామ్యం, సార్వత్రిక వయోజన ఓటుహక్కు, చట్టబద్ధపాలన, రాజ్యాంగబద్ధ వ్యవస్థ, లౌకికవాదం, పీడితులకు రక్షణ వంటి విశిష్టతలతో ముందడుగు వేసిన మొట్టమొదటి గొప్పదేశం ఇండియానే. మానవతకు, స్వేచ్ఛకు, వివేకానికి ప్రతీక అయిన గణతంత్ర దినోత్సవాన్ని ప్రతి ఏటా జనవరి 26న మనం ఎంతో ఆనందోత్సాహాలతో పండగ చేసుకోవాలనడంలో సందేహం లేదు. న్యూఢిల్లీలోని ఇర్విన్ స్టేడియం (ప్రస్తుత మేజర్ ధ్యాన్‌చాంద్ స్టేడియం)లో 1950 జనవరి 26 ఉదయం 10.30 గంటలకు భారత తొలి రాష్ట్రపతి బాబూ రాజేంద్రప్రసాద్ మువ్వన్నెల జాతీయ పతాకం ఆవిష్కరించడంతో భారత్ గణతంత్ర రాజ్యంగా ఆవిర్భవించింది.


అమెరికా రాజ్యాంగం తొలి లిఖిత రాజ్యాంగంగా చరిత్రకెక్కింది. కానీ ఆ దేశంలో స్వాతంత్ర్య ప్రకటన సమయంలోను, రాజ్యాంగ నిర్మాణ సందర్భంగానూ ఇచ్చిన హామీలు నెరవేరడానికి 180 ఏళ్ళు పట్టింది. అమెరికా రాజ్యాంగం అమలులోకి వచ్చిన 140 సంవత్సరాల అనంతరం 1920లలో మహిళలకు ఓటుహక్కు లభించింది. దరిమిలా వంద సంవత్సరాల తరువాతే ఒక మహిళ తొలిసారి ఆ దేశ ఉపాధ్యక్ష పదవికి ఎన్నికయింది. నల్లజాతి పురుషులకు ఓటువేసే హక్కును అంతర్యుద్ధం తరువాతే కల్పించినప్పటికీ, 1960లలో పౌరహక్కుల ఉద్యమంలో మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ స్ఫూర్తిదాయక నాయకత్వం అనంతరమే దక్షిణాది రాష్ట్రాలలోని ఆఫ్రో-అమెరికన్ జనాభాకు ఆ హక్కు సాకారమైంది. చాలా నిదానంగా చోటుచేసుకున్న పరిణామ క్రమమిది. దాంతో పోలిస్తే భారత రాజ్యాంగం ఎంతో విప్లవాత్మకమైంది. మహిళలు, దళితులు సహా పౌరులందరికీ ఒక్కసారిగా ఇది ఓటు హక్కు ప్రసాదించింది. మన స్వాతంత్ర్యయోధులు గొప్ప ఆదర్శవాదాన్ని, మన ప్రజానీకం పట్ల అపార విశ్వాసాన్ని ప్రదర్శించి వయోజన ఓటుహక్కు కల్పించారు. రిపబ్లిక్ సూత్రాలను అనుసరించారు. రాజ్యాంగపత్రం ప్రజలకు ఎవరో ఇచ్చిన బహుమతి కాదు. ‘మేము, ప్రజలము’ - అంటూ రాజ్యాంగ పీఠిక నిర్ద్వంద్వంగా ప్రకటించడాన్ని బట్టే రాజ్యాంగం మనదని స్పష్టమవుతోంది. రాజ్యాంగసభ, గొప్ప దార్శనికుడైన బాబా సాహెబ్ అంబేడ్కర్ అధ్యక్షతన ఏర్పాటైన రాజ్యాంగ రచనా సంఘం మనకు స్వయంపాలనకు సంబంధించి విశిష్టమైన డాక్యుమెంటును అందజేశాయి. అయితే గణతంత్రవ్యవస్థ ఆవిర్భావం నాటికే మనదేశం ఎన్నో ఆటుపోట్లను చవిచూసింది. అయితే మనం రూపొందించుకున్న రాజ్యాంగం స్ఫూర్తితో ఎన్నో విజయాలు సాధించాం. 


71 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానంలో భారత గణతంత్ర రాజ్యం సాధించిన అతిగొప్ప విజయం పంచాయతీరాజ్ వ్యవస్థ. ఢిల్లీ పాలనను గ్రామస్థాయి వరకు తీసుకెళ్లేందుకు మహాత్ముడు కలలు గన్న గ్రామస్వరాజ్యం లక్ష్యంతో మొదలైన ఆ వ్యవస్థ చాలావరకు ఉద్దేశిత లక్ష్యాలను చేరుకుంది. 73వ రాజ్యాంగ సవరణ ద్వారా ఆ వ్యవస్థ అమల్లోకి వచ్చింది. గ్రామస్థాయి పాలనలో మహిళలు, ఎస్సీ, ఎస్టీలకు తగిన ప్రాతినిధ్యం కల్పించేందుకు ఈ చట్టం ఉపయోగపడింది. తమ సమస్యలను తామే గుర్తించి వాటి పరిష్కారాలను కూడా తామే నిర్ణయించుకునే అధికారం పంచాయతీ ప్రతినిధులకు దక్కింది. తద్వారా నిధుల వినియోగం, పాలనలో పారదర్శకత ఏర్పడింది. ఈ సవరణ పంచాయతీలకు కొత్త అధికారాలు కల్పించడమే కాక దాని స్వభావాన్ని కూడా మార్చివేసింది. అంతకుముందు పంచాయతీలు రాజ్యాంగసంస్థలు కావు. కేవలం అమలు కమిటీలుగానే ఉండేవి. వాటిలో రాజకీయ పార్టీలకు ఎలాంటి సంబంధమూ లేదు. వాటి ఎన్నికల్లో ప్రజలు వ్యక్తిగతంగానే పోటీ చేసేవారు. 73వ రాజ్యాంగ సవరణతో పంచాయతీల్లో రాజకీయ పార్టీలు ప్రవేశించాయి. వాటికి స్వయంనిర్ణయాధికారం లభించింది. ఆ వ్యవస్థలో బలహీనవర్గాలకు, మహిళలకు రిజర్వేషన్లు వచ్చాయి. దేశమంతటా రెండు, మూడు అంచెల పంచాయతీ వ్యవస్థ ఏర్పడింది. నాగాలాండ్, మేఘాలయ, మిజోరం మినహా దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఆ వ్యవస్థ ఉంది. దేశంలో పంచాయతీ వ్యవస్థను అమలులోకి తెచ్చిన మొదటి రాష్ట్రం రాజస్థాన్. తర్వాత ఆంధ్రప్రదేశ్ అమలు చేసింది. గుజరాత్ నాయకుడు బల్వంత్‌రాయ్ మెహతా (1900-–65)ను ‘పంచాయతీరాజ్ వ్యవస్థ పితామహుడు’ గా పేర్కొంటారు. ఆయన నేతృత్వంలోని కమిటీ సిఫారసు మేరకే ఆ వ్యవస్థను ప్రవేశపెట్టారు. 


మన ప్రజాస్వామ్యంలో, రాజకీయాల్లో అనేక లోపాలు లేకపోలేదు. అత్యంత కీలకమైన రాజకీయ, అధికార స్థానాల్లో ఆర్థిక నేరగాళ్లు, అత్యాశపరులు కుదురుకుని దేశసంపదను కొల్లగొడుతున్న ప్రస్తుత దుస్థితి ప్రజాజీవనంలో నైతిక విలువల పతనానికే అద్దం పడుతుంది. అవినీతి, నేరగ్రస్తత మన రాజకీయాలను మహమ్మారిలా పట్టిపీడిస్తున్నాయి. శక్తిసామర్ధ్యాలను రుజువు చేసుకునే అవకాశాలు లభించక పేదలు, అణగారినవర్గాల వారు మరింతగా కుంగిపోతున్నారు. ప్రజాస్వామిక ప్రక్రియకు చట్టబద్ధత క్షీణిస్తుండడంతో తరచు హింసాకాండ తలెత్తుతోంది. ధనిక-–పేదల మధ్య అంతరాలు మరింతగా పెరిగిపోతున్నాయి. న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం మూలస్తంభాలుగా ఆవిర్భవించిన రాజ్యాంగ ఆదర్శాలను పౌరులందరికీ మేలు చేకూర్చేలా అమలుచేయడంలో పాలకులు ఘోరంగా విఫలమయ్యారు. రాజ్యాంగంలోని ఆదేశికసూత్రాల స్ఫూర్తికి పట్టం కట్టాల్సిన ప్రభుత్వాలు ఏడు దశాబ్దాలుగా నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే మానవాభివృద్ధి సూచీల్లో భారత్ ఇప్పటికీ అట్టడుగుస్థానాల్లో మగ్గుతోంది. సాగు గిట్టుబాటు కాక, నానాటికీ రుణాల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మౌలిక సదుపాయాలు ఇప్పటికీ అంతంతమాత్రమే. ఇప్పటికీ నాణ్యమైన విద్య, వైద్యం అత్యధికులకు అందుబాటులో లేదు. ఫలితంగా పేదరికమే కోట్లాది కుటుంబాలకు శాశ్వత చిరునామాగా మారింది. అందుకే మన రాజకీయాల్లో, పాలనా వ్యవస్థలో మౌలికమైన సంస్కరణలు తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. మహోన్నతమైన, మానవతా విలువలు కలిగిన రాజ్యాంగం మనకు ఉన్నదని, అది సంతృప్తికరంగా పనిచేస్తోందని మనం గుర్తించాలి. సంక్షోభాన్ని తిప్పికొట్టే సామర్థ్యం గల ప్రజాస్వామిక వ్యవస్థ మనకు ఉంది. కావాల్సిందల్లా ముందుచూపు కలిగిన నాయకత్వం. అదే సమయంలో మనకు సార్వభౌమత్వాన్ని, మన రిపబ్లిక్‌ను పునరుత్తేజం చేసే అవకాశాన్ని కల్పిస్తున్న మన రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని మరింత పరిపుష్టం చేసుకోవాలి. స్వాతంత్య్ర దినోత్సవం స్వరాజ్య సాధనకు ప్రతీకగా నిలిస్తే, గణతంత్ర వేడుక సురాజ్య స్థాపనకు స్ఫూర్తిపతాకగా భాసిల్లాలి. అప్పుడే గణతంత్ర దినోత్సవం నిజమైన సంబరమవుతుంది.

కూసంపూడి శ్రీనివాస్

జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి

Updated Date - 2021-01-26T06:44:08+05:30 IST