జన్‌ధన్‌ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు

ABN , First Publish Date - 2020-04-03T07:34:23+05:30 IST

ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద కేంద్రం ప్రకటించిన కరోనా ప్యాకేజీకి సంబంధించిన నిధులు గురువారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రధానమంత్రి...

జన్‌ధన్‌ లబ్ధిదారుల ఖాతాల్లో డబ్బులు

నేటి నుంచి 9వ తేదీ వరకు పంపిణీ


హైదరాబాద్‌, ఏప్రిల్‌ 2(ఆంధ్రజ్యోతి): ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకం కింద కేంద్రం ప్రకటించిన కరోనా ప్యాకేజీకి సంబంధించిన నిధులు గురువారం లబ్ధిదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. ప్రధానమంత్రి జన్‌ధన్‌ యోజన బ్యాంకు ఖాతాలు కలిగిన మహిళలకు నెలకు రూ. 500 చొప్పున ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు 3 నెలలు నగదు పంపిణీ చేయాలని కేంద్రం నిర్ణయించిన విషయం విదితమే! ఈక్రమంలోనే మొదటి విడతగా రూ. 271.22 కోట్ల నిధులు రాష్ట్రానికి విడుదల చేశారు. ఈ నెల 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు డబ్బులను డ్రా చేసుకోవచ్చు. రాష్ట్రవ్యాప్తంగా జన్‌ధన్‌ యోజన పథకం కింద జీరో బ్యాలెన్స్‌తో తీసుకున్న ఉచిత బ్యాంకు ఖాతాలు 97,86,337 ఉన్నాయి. వీటిలో మహిళల ఖాతాలు 54,24,458 ఉన్నాయి. గరీబ్‌ కల్యాణ్‌ యోజన పథకంలో మహిళలకు మాత్రమే నెలకు రూ. 500 చొప్పున 3 నెలల పాటు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ‘రూపే’ కార్డులు ఉన్నవారు ఏటీఎంలకు వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కార్డులు లేని ఖాతాదారులు బ్యాంకు బ్రాంచిలో గానీ, బ్యాంకు మిత్ర వద్దగానీ, వినియోగదారుల సేవా కేంద్రంలోనూ డబ్బులు డ్రా చేసుకోవచ్చని ఎస్‌ఎల్‌బీసీ సూచించింది. లబ్ధిదారులు గుంపులుగా బ్యాంకుకు వెళ్లవద్దని, మాస్కులు ధరించి నియంత్రణ పాటించాలని ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్‌ యూఎన్‌ఎన్‌ మయ్యా ఆదేశాలు జారీ చేశారు. డబ్బులు డ్రా చేసుకోవటానికి బ్యాంకు ఖాతా నెంబర్లో చివరి అంకెను ఆధారంగా తేదీలు ప్రకటించారు. ఉదాహరణకు చివరి అంకెలు సున్న(0), ఒకటి(1) ఉన్న లబ్ధిదారులు ఈ నెల 3న(శుక్రవారం) బ్యాంకులకు వెళ్లి నగదు విడిపించుకోవచ్చు. 

Updated Date - 2020-04-03T07:34:23+05:30 IST