ఘనంగా ప్రారంభమైన జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు

ABN , First Publish Date - 2022-01-28T04:59:44+05:30 IST

మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ సైదులు దర్గా ఉర్సు ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి.

ఘనంగా ప్రారంభమైన జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు
సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ దర్గాలో ప్రార్థనలు చేస్తున్న పూజారి జానీబాబా

మతసామరస్యానికి ప్రతీకగా ఉత్సవాలు

నేడు ప్రధాన ఘట్టం గంధం ఊరేగింపు 

పాలకవీడు, జనవరి 27 : మతసామరస్యానికి ప్రతీకగా నిలిచే సూర్యాపేట జిల్లా పాలకవీడు మండలం జాన్‌పహాడ్‌ సైదులు దర్గా ఉర్సు ఉత్సవాలు గురువారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉండటంతో తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలు కూడా ఈ ఉత్సవాల్లో పెద్దసంఖ్యలో పాల్గొంటారు. దర్గాను ఎక్కువసంఖ్యలో హిందువులే దర్శిస్తుంటారు. ఉర్సు ఉత్సవంలో మొదటి రోజు సాంప్రదాయబద్దంగా పూజారి ఇంటి నుంచి గంధం, ఫాయితా, పూలు, దట్టీలు తీసుకొని ముదావర్లు దర్గాకు చేరుకున్నారు. అక్కడ ఖవ్వాలి నిర్వహించిన అనంతరం సైదులుబాబా సమాధులను కొత్త వస్త్రాలతో అలంకరించారు. భక్తులు తీసుకువచ్చిన పూలు, గంధం, స్వీట్లు, ఫలహారాలను బాబా సమాధుల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మల్లెపూల అల్లిన దండలను బాబా సమాధులపై కప్పారు. దర్గాలో జ్యోతిని వెలిగించిన అనంతరం బాబా సమాధుల చుట్టూ కొవ్వొత్తులతో దీపాలు వెలిగించారు. గంధం ఎత్తుకొని పూజారి జానీబాబా సమాధులపైకి ఎక్కించారు. అక్కడికి వచ్చిన భక్తులతో బాబాకు గంధాన్ని అలంకరించారు. దర్గా పక్కనే ఉన్న నాగేంద్రుని పుట్ట వద్ద భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ నెల 28న నిర్వహించే ఉర్సు ఉత్సవంలో ప్రధాన ఘట్టమైన గంధం ఊరేగింపులో పాల్గొనేందుకు భక్తుల రాక మొదలైంది. 

పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత :  ఎస్పీ రాజేంద్ర ప్రసాద్‌

జాన్‌పహాడ్‌ దర్గా ఉర్సు ఉత్సవానికి డీఎస్పీ, నలుగురు సీఐలు, 22 మంది ఎస్‌ఐలు, 350మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్‌ తెలిపారు. జాన్‌పహాడ్‌ దర్గాలోని జేపీఎస్‌ ఫంక్షన్‌హాల్‌లో పోలీసు సిబ్బందితో గురువారం ఆయన సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎలాంటి ఆటంకం కలుగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. 




Updated Date - 2022-01-28T04:59:44+05:30 IST