కృష్ణాష్టమి సందడి

ABN , First Publish Date - 2022-08-19T06:02:55+05:30 IST

శ్రీకృష్ణజయంతి వేడుకలు ఒక రోజు ముందుగానే మొదలయ్యాయి.

కృష్ణాష్టమి సందడి
విద్యుద్దీపాలంకరణలో ఇస్కాన్‌ దేవాలయం

తిరుపతి (కల్చరల్‌), ఆగస్టు 18: శ్రీకృష్ణజయంతి వేడుకలు ఒక రోజు ముందుగానే మొదలయ్యాయి.తిరుపతిలోని ఇస్కాన్‌ ఆలయంలో గురువారం ఉదయం నాలుగంటలకే ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా తులసిపూజ, నరసింహకీర్తన, జపం వంటివి నిర్వహించారు.సాయంత్రం 6 గంటలకు ఆదివాసీ ఉత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అనంతరం ఇస్కాన్‌ సమీపంలోని టీటీడీ క్రీడా మైదానంలో జరిగిన  సంగీత, నృత్య ప్రదర్శనలు ఆహూతులను ఆకట్టుకున్నాయి. కృష్ణాష్టమి సందర్భంగా ఇస్కాన్‌ ఆలయాన్ని విద్యుద్దీపాలతో అందంగా అలంకరించారు.ఇంకా వివిధ ఆలయాలలో కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టారు. కాగా గురువారం నగరంలోని వివిధ పాఠశాలల్లో కూడా కృష్ణాష్టమి వేడుకలు నిర్వహించారు. చిన్నారులకు కృష్ణుని వేషధారణ పోటీలు నిర్వహించారు.కృష్ణాష్టమి సందర్భంగా నేడు శుక్రవారం ఇస్కాన్‌ ఆలయంలో ఉదయం 4.30 గంటలనుంచే పూజాదికాలు మొదలౌతాయి. భక్తులకు ఉదయం 8 గంటల నుండి రాత్రి 12 గంటల వరకూ దర్శనం, ప్రసాద వితరణ ఉంటుంది. సాయంత్రం 6 గంటలనుంచి సాంస్కృతిక కార్యక్రమాలుంటాయి.అలిపిరి వద్ద టీటీడీ ఇటీవలే ప్రారంభించిన గో పూజా వేదిక వద్ద కృష్ణాష్టమి ప్రత్యేక పూజలు ఉదయం 6 గంటలనుంచీ జరుగుతాయి. శ్రీకృష్ణుడికి అభిషేకం, గోమాతకు మేత దానం ఉంటాయి. భక్తుల సౌకర్యం కోసం టీటీడీ గోవులకు కావలసిన ఆహారం అందుబాటులో ఉంచింది. భక్తులు కొని గోమాతలకు పెట్టవచ్చు. తుమ్మలగుంట సమీపంలోని టీటీడీ డెయిరీ ఫాంలో కూడా ఉదయం నుంచీ శ్రీకృష్ణ మూర్తికి అభిషేకం, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 





Updated Date - 2022-08-19T06:02:55+05:30 IST