శ్రీదేవి కూతురిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న అందాల భామ జాన్వీ కపూర్ (Janhvi Kapoor). ‘దఢక్’ (Dhadak) సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు. ‘గుంజన్ సక్సేనా: ది గర్గిల్ గర్ల్’, ‘రూహీ’ చిత్రాల్లో నటనతో మెప్పించారు. జూన్ 26న తన సోదరుడు అర్జున్ కపూర్ (Arjun Kapoor) పుట్టిన రోజు జరుపుకొంటున్నారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ జాన్వీ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. తన సోదరుడితో కలసి తీసుకున్న ఫొటోను ఇన్స్టాగ్రామ్ వేదికగా షేర్ చేశారు. ‘‘ప్రతి ఒక్కరి ముఖాలపై నవ్వులను పూయించే అత్యంత తెలివైన, అల్లరి, చలాకీగా ఉండే నా సోదరుడికి జన్మదిన శుభాకాంక్షలు. నువ్వు నా సోదరుడివి అన్న ప్రతిసారి అర్జున్ సంతోషిస్తారు. ఈ ఏడాది నీదే. నువ్వు చాలా కష్టపడి పనిచేశావు. ప్రతి అడ్డంకిని అధిగమించి జీవితంలో ఎదిగావు. ఎల్లప్పుడు సహృదయంతో వ్యవహరించావు. నేను నీ నుంచి అన్ని సమయాల్లో నేర్చుకుంటాను. నాకు ఎప్పుడు సలహా కావాల్సిన నీకే ఫోన్ చేస్తాను. నాకు అండగా ఉన్నందుకు థ్యాంక్ యూ. ఐ లవ్ యూ’’ అని జాన్వీ కపూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టారు.
బోనీ కపూర్ (Boney Kapoor) మొదటి భార్య మోనా శౌరీ కుమారుడే అర్జున్ కపూర్. బోనీ రెండో భార్య శ్రీదేవి కుమార్తెనే జాన్వీ కపూర్. అర్జున్ తన పుట్టిన రోజు వేడుకలను గర్ల్ ఫ్రెండ్ మలైకా అరోరాతో కలసి పారిస్‌లో సెలబ్రేట్ చేసుకున్నారు. తాజాగా జాన్వీ ‘గుడ్ లక్ జెర్రీ’ (Good Luck Jerry)సినిమాలో నటించారు. సిద్దార్థ్ సేన్‌గుప్తా (Sidharth Sengupta) దర్శకత్వం వహించారు. సుబాస్కరన్, ఆనంద్ ఎల్.రాయ్ (Aanand L. Rai) సంయుక్తంగా నిర్మించారు. దీపక్ దోబ్రియాల్, మితా వశిష్ట్, నీరజ్ సూద్, సుశాంత్ సింగ్ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా ఓటీటీ ప్లాట్‌ఫాం డిస్నీ+హాట్‌స్టార్‌లో జులై 29నుంచి స్ట్రీమింగ్ కానుంది.