Advertisement
Advertisement
Latest Telugu News
Advertisement

జనవేదన పలికిన జీవనాడులు

twitter-iconwatsapp-iconfb-icon
జనవేదన పలికిన జీవనాడులు

ఈ దేశం పరోపకారులకు, సాహసులకు, త్యాగ ధనులకు గొడ్డుపోలేదు. అటువంటి విశిష్ట, ప్రత్యేక సమూహంలోనుంచి ఒక పది మందిని లేదా ఇరవై మందిని మాత్రం నమూనాగా తీసుకుని భారత ప్రజల ప్రజాస్వామిక స్పందనలను రాజ్యం పరిశీలిస్తున్నది. ఇదొక రకం నెగిటివ్‌ క్లినికల్‌ ట్రయల్‌. రాడికల్‌ శక్తుల మీద మాత్రమే అస్త్రాలు గురిపెట్టి ఉన్నాయనుకుంటే అది భ్రమ. ప్రజలు, హేతువు, కష్టజీవులు, సంక్షేమం, సమానత్వం, హక్కులు, ప్రాంతీయ న్యాయం వంటి మాటలను ఉపయోగించే వాళ్లంతా వరుసలో నిలబడవలసిందే. వంతు తమ దాకా రాకూడదంటే, భారత ప్రజాస్వామ్య విశిష్టతకు సంకేతంగా, రక్షణగా మొదటి వరుస కుడ్యంగా నిలబడ్డ వరవరరావు వంటి వారిని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్య వ్యతిరేకుల ప్రయత్నాలు ఓడిపోవాలి. 


రెండేళ్ల కిందట చెక్కుచెదరని ధైర్యంతో పోలీసుల వెంట నడిచి వెళ్లిపోయిన వరవరరావును తిరిగి అట్లాగే చూడగలమా? స్వేచ్ఛదొరికి, సేదదీరితే మళ్లీ ఆయనని ఆయనలో ప్రతిష్ఠించుకోగలమనే కదా, ఆత్మీయుల ఆశ!


వరవరరావు ఆరోగ్యం గురించిన ఆందోళనా, ఆయనను విడుదల చేయాలన్న ఆకాంక్షా తెలుగు సమాజాల్లోనే కాదు, దేశంలోనూ దేశదేశాల్లోనూ బలపడుతోంది. ప్రతిఘటనకు, నిరసనకు, ప్రజాస్వామ్య విలువలకు ప్రతినిధులుగా వినిపించే పేర్లన్నీ ఆయన కోసం రూపొందుతున్న ప్రకటనల్లో, అభ్యర్థనల్లో కనిపిస్తున్నాయి. కొన్ని ఆలోచనల విషయంలో, ఆ ఆలోచనల సాధకుల విషయంలో తాము కఠినంగా, దృఢంగా ఉండదలచుకున్నామని భారతరాజ్యాన్ని నిర్వహిస్తున్న రాజకీయ నాయకత్వం భావిస్తూ ఉండవచ్చును కానీ, ఆ వైఖరి అన్ని అవధులను దాటి, కర్కశత్వంగా, అమానుషత్వంగా వ్యక్తం అవుతున్నది. అందుకే, ఇతర సందర్భాలలో ఇటువంటి నిర్బంధాలపై మాట్లాడని వ్యక్తులు కూడా గొంతు విప్పుతున్నారు. ఈ నిర్బంధం ఇరవై రెండు నెలల నుంచి సాగుతున్నా, ఇక దీని గురించి మాట్లాడకపోతే మనస్సాక్షి ఒప్పుకోని స్థితిని మరికొందరు ఇప్పుడిప్పుడే గుర్తిస్తున్నారు. ఇనుములు కూడా కరుగుతున్నాయి. ‘ఊపా’ను ఉద్ధరించి, కొత్త తొడుగులు తొడిగిన చిదంబరమే, వరవరరావు విడుదలను కోరుతున్నారు. 


నిర్బంధం అన్యాయమని, అక్రమమని నిరసన తెలపడం దగ్గర నుంచి, అనారోగ్యాన్నీ వృద్ధాప్యాన్నీ చూసి అయినా స్పందించమని అడిగే దాకా పౌరసమాజాలు వచ్చాయి. బండరాయి ప్రభుత్వాల స్పందనారాహిత్యాన్నీ, న్యాయాన్ని రక్షించవలసిన వ్యవస్థల వైఫల్యాన్నీ, ప్రజాఉద్యమాల నిస్సహాయతనీ ఈ అవరోహణ తెలియజేస్తుంది. ప్రజాస్వామ్య విలువలు, సహజన్యాయం వంటి నాగరిక అంశాలేవీ చెలామణీ కానప్పుడు, కనీస మానవత్వం ప్రాతిపదిక మీదనే అర్థించవలసి వస్తుంది. అక్కడ కూడా తలుపులు మూసి ఉన్నప్పుడు, శిలాసదృశ మౌనం ఎదురయినప్పుడు వ్యవస్థ మీద అవిశ్వాసం మరింత పెరుగుతుంది. 90 శాతం వికలాంగుడు సాయిబాబాను, వ్యవస్థకు అత్యంత ప్రమాదకారి అంటూ ఏకాంత కారాగారంలో బంధించినప్పుడు, వ్యవస్థ విచక్షణా వైకల్యం బోనులో నిలబడుతుంది. ఏవగింపు, ఛీత్కరింపు ఎంత కాలానికి ఒక స్పష్టమైన రాజకీయ నిరాకరణగా మారతాయో, ఎప్పుడు ఆచరణగా పరిణమిస్తాయో చెప్పలేము కానీ, పర్యవసానాలు మాత్రం ఉంటాయి. అవిశ్వాసాలను, అసమ్మతులను, అవిధేయతలను, ఆచరణలను అన్నిటితోనూ నిర్బంధం ద్వారానే వ్యవహరించగలమని పాలకులు అనుకుంటే, జరగబోయే చరిత్రను కుతూహలంగా, కలవరంతో పరిశీలించవలసిందే. 


రానున్న రోజులు ఏమంత ఆశావహంగా లేవు. ప్రజలు తామున్న ప్రమాదాన్ని, తాము పెంచి పోషిస్తున్న ఉపద్రవాన్ని తెలుసుకునే స్థితిలో లేరు. వారి తెలివిడిని, స్పందనలను, ఉద్వేగాలను ప్రోగ్రామింగ్‌ చేసి, నడిపించే శక్తులు బలంగా ఉన్నాయి, ఇంకా బలపడుతున్నాయి. వారు తమకు ఉన్న దీర్ఘకాలిక ప్రణాళిక ప్రకారం ఒక్కొక్క అడుగూ వేస్తున్నారు. శతాబ్ది కాలంగా, వలసవాద వ్యతిరేక జాతీయోద్యమం దగ్గర నుంచి, అనేక సామాజికోద్యమాలనుంచి, రాజకీయ ఉద్యమాల నుంచి, పోరాటాల నుంచి ఈ దేశం సమకూర్చుకున్న ఆదర్శాలను, నూతన విలువలను, మానవీయతను– అన్నిటినీ ధ్వంసం చేసే ప్రక్రియ కొనసాగుతున్నది. ప్రజాస్వామిక మౌలిక సూత్రాలను, సామూహిక సద్వర్తనకు, పరివర్తనకు ఏర్పడిన ప్రాతిపదికలను తుడిచిపెడితే తప్ప, తలకిందులు చేస్తే తప్ప, ఈ దేశంలో వారనుకునే తరహా సమాజం, రాజ్యం ఏర్పడదు. అందుకోసం ఒక ప్రక్షాళన అవసరం. వేరు వేరు స్థాయిలలో, వేరు వేరు దశలలో రకరకాల తుడిచివేతలు అవసరం. ఈ క్రమం కనిపిస్తూనే ఉన్నది. కొందరే చూడగలుగుతున్నారు. 


పరిస్థితి ఇంతగా దిగజారడానికి వామపక్ష, ప్రజాస్వామ్య రాజకీయాల బాధ్యత కూడా ఉన్నది. వరవరరావు ప్రాతినిధ్యం వహించే రాజకీయాల పాలు కూడా తక్కువేమీ కాదు. మితవాద రాజకీయాలు తీవ్రజాతీయవాద, నియంతృత్వ రాజకీయాలుగా పరిణమించడం ప్రగతిశీల రాజకీయాల వైఫల్యం. భారతదేశ నిర్దిష్ట పరిస్థితులను అర్థం చేసుకోవడంలో, సిద్ధాంతాలకు అన్వయించడంలో, ఆచరణలో పెట్టడంలో పెద్ద పెద్ద పొరపాట్లే జరిగాయి. గుర్తించిన తరువాత దిద్దుబాటు ఆలస్యం అయింది. చూస్తూ ఉండగానే, భయపడినంతా జరిగింది. ప్రగతిశీలతను అంటు దగ్గర నుంచి తుడిచిపెట్టే యజ్ఞం మొదలయ్యింది. వరవరరావు వంటి వారి నిర్బంధమే కాదు, ఈ నిర్బంధ పరిస్థితులకు సమాజంలో లభిస్తున్న మౌన, క్రియాశీల ఆమోదాలు కూడా క్షేత్రస్థాయిలో ప్రజానుకూల రాజకీయాల క్షీణతకు సంకేతాలే. మతోన్మాదాన్ని పెంచే ఉద్వేగ కార్యక్రమాలతో పాటు, లౌకిక, ఉదార భావాలపై తీవ్రయుద్ధం కూడా కొనసాగుతోంది. అందులో భాగమే వరవరరావుపై నిర్దాక్షిణ్య నిర్బంధం. 


కశ్మీర్‌ వంటి అంశాలలో ఏమి చేయడానికి అయినా జాతీయవాదం ఆయుధంగానూ, కవచంగానూ పనికివస్తుంది. పౌరసత్వ చట్టాన్ని వ్యతిరేకించేవారి మీద వరుసకేసులు పెట్టడానికి మెజారిటీవాదం గొడుగు పడుతుంది. ముందే సృష్టించి ఉంచిన బూచీల విషయంలో ఉన్న యథేచ్ఛ, సమాజంలోని అట్టడుగు శ్రేణుల క్షేమం కోసం పనిచేసే, ఉద్యమకారుల హక్కుల కోసం పోరాడే ప్రజాస్వామ్యవాదుల విషయంలో ఉండదు. మెజారిటేరియన్‌ ఉద్వేగాలతో వారిపై వ్యతిరేకతను విస్తృతప్రాతిపదికపై సృష్టించడం ఇంకా సాధ్యపడడం లేదు. ఈ ప్రజాస్వామిక కార్యకర్తల స్వార్థరాహిత్యం, వ్యక్తిగత నైతికత, నిబద్ధత, ప్రజాపునాది వారికి రక్షగా ఉంటున్నాయి. నిర్బంధ వాతావరణ నేపథ్యంలో, కఠిన చట్టాల కర్కశ అమలు ద్వారా మాత్రమే, ప్రజాస్వామిక వాదులను బంధించి ఉంచగలరు. దానికి ప్రజల స్పందన, పౌరసమాజ స్పందన ఎట్లా ఉంటుందన్న సందేహం ప్రభుత్వాలకు ఉంటుంది. 


ఈ దేశం పరోపకారులకు, సాహసులకు, త్యాగధనులకు గొడ్డుపోలేదు. అటువంటి విశిష్ట, ప్రత్యేక సమూహంలోనుంచి ఒక పది మందిని లేదా ఇరవై మందిని మాత్రం నమూనాగా తీసుకుని భారత ప్రజల ప్రజాస్వామిక స్పందనలను రాజ్యం పరిశీలిస్తున్నది. ఇదొక రకం నెగిటివ్‌ క్లినికల్‌ ట్రయల్‌. స్పందనలు లేవా, మందకొడిగా ఉన్నాయా, ఆపరేషన్‌ సక్సెస్‌. నిర్బంధాలకు మలివరుసను సిద్ధం చేసుకోవచ్చు. ఇప్పుడు వరవరరావు, ఆనంద్‌ తేల్‌తుంబ్డే, సుధా భరధ్వాజ్‌, షోమా సేన్‌, అఖిల్‌ గొగోయ్‌, గౌతమ్‌ నవలఖ వంటి వారే తొలివరస పరీక్షలో ఉండవచ్చు. మరి కొన్ని రోజులకు సీతారాం ఏచూరి, బృందా కరత్‌, సురవరం సుధాకరరెడ్డి, కంకణాల నారాయణ, చివరకు ఫెడరలిజం గురించి మాట్లాడే కెసిఆర్‌, ఇంకా పాత వాసనలు మిగిలి ఉండే కాంగ్రెస్‌ యోధులు– అందరూ లైన్‌లో నిలబడవలసిందే. నెహ్రూనే మళ్లీ చంపుతున్నవాడికి, రాహుల్‌గాంధీ ఒక లెక్కనా? బోనాలు తలకెత్తుకున్నా, కలకత్తా కాళికి మొక్కినా, నరేంద్ర మోదీకి జేజేలు కొట్టినా ఫలితం ఏమీ ఉండదు. సర్వ ధర్మాలు పరిత్యజించి, వారే దిక్కని శరణు వేడుకోవాలి. రాడికల్‌ శక్తుల మీద మాత్రమే అస్త్రాలు గురిపెట్టి ఉన్నాయనుకుంటే అది భ్రమ. ప్రజలు, హేతువు, కష్టజీవులు, సంక్షేమం, సమానత్వం, హక్కులు, ప్రాంతీయ న్యాయం వంటి మాటలను ఉపయోగించే వాళ్లంతా వరుసలో నిలబడవలసిందే. వంతు తమ దాకా రాకూడదంటే, భారత ప్రజాస్వామ్య విశిష్టతకు సంకేతంగా, రక్షణగా మొదటి వరుస కుడ్యంగా నిలబడ్డ వరవరరావు వంటి వారిని కాపాడుకోవాలి. ప్రజాస్వామ్య వ్యతిరేకుల ప్రయత్నాలు ఓడిపోవాలి. 


వరవరరావు నిర్బంధాన్ని కొనసాగిస్తూ, నైతికతను కోల్పోయిన స్థితిలోకి జారిపోయింది ప్రభుత్వం. ఈ అనైతికత కేవలం దుర్బల స్థితిలో ఉన్న వ్యక్తిని నిర్బంధించడం వల్ల ఏర్పడినది మాత్రమే కాదు. వరవరరావు అనే ఒక వ్యక్తి యాభై ఏళ్ల క్రియాశీల ప్రజాజీవితం ఈ సందర్భంగా చర్చకు వస్తున్నది. సమకాలంలో ఆయనను వ్యతిరేకించిన, ఆయనతో ఘర్షించిన వారు సైతం ఆయనది గొప్ప ప్రజావ్యక్తిత్వమని గుర్తిస్తున్నారు. కవి మాత్రుడు కాదు. కవిగా శిఖరుడు, వ్యక్తిగా అసాధ్యుడు, అసాధారణుడు. తెలంగాణను ఉద్యమ సమాజమని అనుకుంటే, దాని చేత వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుని, తిరిగి దాన్ని తీర్చిదిద్దినవాడు. ప్రత్యేక రాష్ట్రంగా సంగమించిన తెలంగాణ ఉద్యమ ప్రవాహాల్లో అతనొక జలపాతం. ఆయన రాజకీయవిశ్వాసాలను ఎంతైనా విమర్శించవచ్చు. ఆయన స్వప్నాన్ని పంచుకోకుండా ఉండలేము. 


విస్మృతి ఒక వ్యాధి. వయోభారం దానికి కారణం కావచ్చు. సామూహికతలో మునిగి తేలే మనిషి ఒంటరి అయినప్పుడు, కుంగుబాటు తోడవుతుంది. విస్మృతికి ప్రేరణ అవుతుంది. తను చదివిన, తెలుసుకున్న, భాగమైన, రచించిన చరిత్రను వరవరరావు మరచిపోగలడని ఎవరమైనా అనుకున్నామా? మాట స్పష్టంగా, పొందికగా లేని వరవరరావును ఎవరైనా ఊహించగలరా? ఎంత దెబ్బతీశారు! రెండేళ్ల కిందట చెక్కుచెదరని ధైర్యంతో పోలీసుల వెంట నడిచి వెళ్లిపోయిన వరవరరావును తిరిగి అట్లాగే చూడగలమా?


స్వేచ్ఛదొరికి, సేదదీరితే మళ్లీ ఆయనని ఆయనలో ప్రతిష్ఠించుకోగలమనే కదా, ఆత్మీయుల ఆశ!

జనవేదన పలికిన జీవనాడులు

కె. శ్రీనివాస్

Advertisement
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Advertisement
OpinionPoll
Advertisement

ప్రత్యేకంLatest News in Telugu మరిన్ని...

Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.