Abn logo
Mar 19 2020 @ 03:11AM

వివిధ సమస్యలపై జనవాక్యం

ఆరు శాతం వడ్డీ రాయితీ

తెలంగాణ స్టేట్ కో–ఆపరేటివ్ బ్యాంకులలో రైతులు సకాలంలో చెల్లించిన ‘లాంగ్ టర్మ్’ రుణాలకు సంబంధించిన 6 శాతం వడ్డీ రాయితీని ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలి. తెలంగాణ ఏర్పాటైనప్పటి నుండి కూడా రైతులకు ఇచ్చిన లాంగ్ టర్మ్ ఋణాలకు ఆరు శాతం వడ్డీ రాయితీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఇంతవరకు ఇవ్వడంలేదు. తీసుకున్న మొత్తం కడితేనే రాయితీ ఇస్తామని చెప్పిన ప్రభుత్వం మొత్తం కట్టిన తరవాత కూడా రాయితీ బకాయిలు విడుదల చేయకపోవడం శోచనీయం. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ బ్యాంకులలో కొన్ని కోట్ల రూపాయల వడ్డీ రాయితీ బకాయి అలాగే ఉంది. అధికారులు నివేదికలను సిద్ధం చేసినా.. నిధులు విడుదల చేయడం లేదు.. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వం అని చెప్పుకుంటున్న తరుణంలో ఈ వడ్డీ రాయితీని వెంటనే విడుదల చేయాలి. లేదా ఇస్తారో ఇయ్యరో కూడా స్పష్టం చేయాలి. ఎంతో మంది రైతులు ఈ వడ్డీ రాయితీ కొరకు ఎదురుచూస్తూ నిరాశ చెందుతున్నారు. కావున ప్రభుత్వం స్పందించి వెంటనే వడ్డీ రాయితీ నిధులను విడుదల చేయాలి.

వి.రాజశేఖర శర్మ, నాగర్‌కర్నూల్ జిల్లా


అనాథలకు ఉద్యోగ రిజర్వేషన్లు

అనాథ శరణాలయాల్లో పెరుగుతున్న పిల్లల కులం తెలియదు. మతం అసలే తెలియదు. కడు దయనీయంగా శరణాలయాల్లో తలదాచుకుంటున్న ఈ పిల్లలకు 18 ఏళ్ల వయస్సు రాగానే బయటికి పంపించేస్తున్నారు. దానితో వారు బతుకు దెరువుకు ఆసరా లేకుండా పోతున్నారు. ఇలాంటి వారికి ప్రభుత్వాలు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించడం సముచితంగా ఉంటుంది. వీరికి కనీసం 5 శాతం రిజర్వేషన్లు కల్పించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రం కూడా ఈ విషయంపై దృష్టి పెట్టి అనాథలను ఆదుకునేందు ముందుకు రావాలి.

యెలిశెట్టి శంకర రావు, మియాపూర్‌


నిరుద్యోగ తెలంగాణ!

తెలంగాణ ప్రత్యేక రాష్ట్రోద్యమంలో యువత అధిక సంఖ్యలో పాల్గొనడానికి ఉద్యోగాలు వస్తాయనే (నియామకాల) అంశమే కీలకం. కానీ, తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగ కల్పనలో విఫలమైందని చెప్పాలి. రాష్ట్రంలోని ప్రభుత్వ శాఖలలో 1.07లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం కేసీఆర్ 2016 మార్చి 13న అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఈ కొలువులను రెండేళ్లలో భర్తీ చేస్తామని హామీ కూడా ఇచ్చారు. ఈ హామీకి నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది. ఇప్పటివరకు ఉద్యోగాల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఎటువంటి ముందడుగు వేయకపోవడం గమనార్హం. 36 వేల పైచిలుకు ఉద్యోగ నియామకాలు చేపట్టింది. అవి భర్తీ చేయడానికి కూడా ఆరు సంవత్సరాలు పట్టిన విషయం తెలిసిందే. యువతీయువకులు రాష్ట్ర సాధనలో ప్రాణాలను సైతం త్యాగం చేశారు. తాజా అసెంబ్లీ సమావేశాలలో సీఎం కేసీఆర్‌ ఉద్యోగ నియామక అంశాన్ని అసహనంతో దాటివేసే ప్రయత్నం చేశారు. పోలీసు ఉద్యోగాలు భర్తీ చేస్తే మొత్తం తెలంగాణలో ఉద్యోగాలు పూర్తి అయిపోయాయి అనే విధంగా మాట్లాడారు. అక్కడితో ఆగకుండా గత ప్రభుత్వాలు ఎంత మందికి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చాయి అంటూ ఇష్యూను డైవర్ట్ చెయ్యడానికి ప్రయత్నించారు. గత ప్రభుత్వాలు ఉద్యోగాలు కల్పించడం విషయంలో వివక్షను చూపిస్తున్నాయనే కదా ప్రత్యేక తెలంగాణ సాధించుకుని టీఆర్‌ఎస్‌కు అధికారం కట్టబెట్టింది. ఇప్పుడు నిర్లక్ష్యంగా మాట్లాడటం ముఖ్యమంత్రికి తగనిది. ఇంటికో ఉద్యోగం అనే అంశం పక్కన పెడితే వివిధ శాఖలలో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసినా తెలంగాణ యువత ఆశలు తీరుతాయి. కోచింగ్ సెంటర్లలో వేలకు వేలు ఫీజులు కట్టి అటు కుటుంబాన్ని, ఇటు వయసును త్యాగం చేస్తూ ఆకలి కడుపులతో హైదరాబాదులో నిరుద్యోగులు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారో తెలియని విషయం కాదు. తెలంగాణ ఏర్పాటు వరంగా భావించాల్సిన సమయంలో నిరుద్యోగులు అది తమ పాలిల పాపంగా భావించడం వల్ల ఇది తెలంగాణకు శాపంగా మారే అవకాశం ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనకు కృషి చేస్తే సాధించుకున్న తెలంగాణకు న్యాయం జరుగుతుంది.

వెంకట్ నాయక్, లా విద్యార్థి, ఉస్మానియా యూనివర్సిటీ


ఇదేం మెలిక?

గ్రామ సచివాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు ఉన్నత ఉద్యోగానికి వెళ్లాలనుకుంటే అప్పటివరకు ప్రభుత్వం నుండి తీసుకున్న జీతాన్ని వెనక్కి ఇచ్చేయాలన్న నిబంధన పెట్టడం భావ్యం కాదు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిబంధనలు సచివాలయ ఉద్యోగులకు గుదిబండగా మారాయి. ఉన్న ఉద్యోగం వదల్లేక కొత్త కొలువులు చేరలేక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. గ్రామ సచివాలయాల ఉద్యోగుల పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి ప్రదర్శించాలి. ప్రస్తుత సచివాలయంలో పనిచేస్తున్న అనేకమంది ఉద్యోగులు ఉపాధ్యాయ, గ్రూప్ 2, గ్రూప్ 3 స్థాయి ఉద్యోగాలకు ఎంపికైనారు. వారంతా కొత్త కొలువుల్లో చేరాలంటే ఇప్పటివరకు సచివాలయం ద్వారా అందుకున్న జీతం మొత్తాన్ని ప్రభుత్వానికి తిరిగి జమ చేయాలని నిబంధన విధించారు. లేదంటే వారు సాధించుకున్న ఉన్నతోద్యోగాన్ని వదులుకోవాల్సి ఉంటుంది. ఇది న్యాయబద్ధం కాదు. దీనిపై ప్రభుత్వం మానవతా దృక్పథంతో ఆలోచించాలి. జీతభత్యాలు తిరిగి చెల్లించాలన్న నిబంధనను రద్దు చేయాలి. ఉన్నత ఉద్యోగంలో చేరాలనుకునే వారికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చర్యలు తీసుకోవాలి.

ఉప్పలపు శేషునాథ్, పి. నైనవరం


కుల ప్రస్తావన క్షేమదాయకం కాదు

కులాలకు, మతాలకు, బంధుప్రీతికి అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా పరిపాలన చేస్తానని రాజ్యాంగం మీద ప్రమాణం చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన జగన్ మోహన్ రెడ్డి నిరంతరం కులాల ప్రస్తావన తేవడం రాజ్యాంగ విరుద్ధం. ఏపీ క్యాబినెట్ మంత్రులు కూడా ఏదో ఒక రూపంలో కులాల ప్రస్తావన తెస్తున్నారు, ఇది కూడా రాజ్యాంగ విరుద్ధమే. పాలనలో గానీ, సమ సమాజానికి వ్యతిరేకంగా గానీ ఎవరైనా చట్ట విరుద్ధమైన పనులు చేసి ఉంటే వారిమీద వ్యక్తిగతంగా ప్రభుత్వ పరిధిలో చర్యలు తీసుకోవచ్చు. అంతేగానీ, కులాల పేరుతో ప్రస్తావించడం చాలా విచారకరం. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి వ్యక్తులు పదేపదే కుల ప్రస్తావన తేవడం సమాజానికి మంచిది కాదు. రాజ్యాంగబద్ధంగా పరిపాలన చేసే వ్యక్తి కుల ప్రస్తావన తేవడం వలన ఆ సామాజిక వర్గానికి చెందినవారు ప్రభుత్వం మీద నమ్మకం కోల్పోయే అవకాశం ఉంటుంది. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్న ఎన్నికల ముఖ్య అధికారిని ఆయన కులం ఆధారంగా విమర్శలు చేయడం సహేతుకం కాదు. వెంటనే న్యాయస్థానాలు సుమోటోగా స్వీకరించి జగన్ మోహన్ రెడ్డిని సంజాయిషీ కోరాలి. అప్పుడే రాజ్యాంగబద్ధ సంస్థల విలువలు సమాజానికి తెలియ వస్తాయి. గవర్నర్, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి స్పందించి ఇలాంటి పరిస్థితులు సరిదిద్దాలి. ఉన్నత పదవుల్లో ఉన్న వారు ఇలా మాట్లాడుతూ ఉంటే మిగతా వారు దీనిని ఆదర్శంగా తీసుకునే అవకాశం కూడా ఉంటుంది. కనుక తక్షణమే కులాల ప్రస్తావన తేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించాలి.

తరిగోపుల నారాయణస్వామి


అధికారులు చట్టాలను గౌరవించాలి

రాష్ట్రంలో గత తొమ్మిది నెలల  కాలంలో అధికారుల వ్యవహారశైలిపైనా, విడుదలవుతున్న జీఓలపైనా రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఇస్తున్న తీర్పులు ప్రతి ఒక్కరినీ ఆలోచనలో పడవేస్తున్నాయి. రాష్ట్ర డిజిపి కూడా న్యాయస్థానంలో సంజాయిషీ ఇచ్చుకోవలసిన పరిస్థితి రాష్ట్రంలో న్యాయబద్ధ, చట్టబద్ధ పాలన లేదన్నదాన్ని తెలుపుతోంది. అలాగే రాష్ట్ర రాజధాని అమరావతిలో కూడా పోలీసుల అత్యుత్సాహాన్ని న్యాయస్థానం తప్పుపట్టటం గమనార్హం. ఇంకా చెప్పాలంటే పాలకుల మౌఖిక ఆదేశాలతో ఎస్.సి.,ఎస్.టి. చట్టం కూడా పూర్తిగా దుర్వినియోగం అవుతున్నది. ఇది సమాజంలో మరిన్ని సమస్యలకు తావిస్తున్నదని అధికారులు విస్మరించరాదు. పాలన ప్రజాస్వామ్య బద్ధంగా, ప్రజారంజకంగా జరగాలి. ఇందుకు అధికార వ్యవస్థ కొంత సంయమనంతో, చట్టపరిధిలో పనిచెయ్యాలి. ఎటువంటి రాజకీయ ఒత్తిళ్ళకు తలొగ్గరాదు. లేదంటే జీవితకాలం న్యాయస్థానాల చుట్టూ తిరగవలసిందే! న్యాయస్థానం వ్యాఖ్యానించినట్లు, ప్రభుత్వాలు శాశ్వతం కాదు, పాలనా వ్యవస్థ శాశ్వతం. చట్టబద్ధంగా వ్యవహరించవలసిన గురుతర బాధ్యతను అధికారులు పాటించాలి.

గరిమెళ్ళ రామకృష్ణ, ఏలూరు

Advertisement
Advertisement