సంచార జాతులకు న్యాయం చేయండి

ABN , First Publish Date - 2021-05-08T05:50:07+05:30 IST

తెలంగాణలో సంచార జాతులకు సరైన న్యాయం జరగలేదు. ఎన్నో సంవత్సరాలుగా సంచారజాతుల సంఘాలు ఆయా కులాల గుర్తింపు కోసం కష్టపడినా ఫలితం దక్కలేదు. సారోల్లు, అర్థ కోమటి, తోలు బొమ్మలాట....

సంచార జాతులకు న్యాయం చేయండి

తెలంగాణలో సంచార జాతులకు సరైన న్యాయం జరగలేదు. ఎన్నో సంవత్సరాలుగా సంచారజాతుల సంఘాలు ఆయా కులాల గుర్తింపు కోసం కష్టపడినా ఫలితం దక్కలేదు. సారోల్లు, అర్థ కోమటి, తోలు బొమ్మలాట, కుల్ల కడిగి, బైల్‌ కమ్మర, అహిర్‌ గోవిలి, బాగోతుల, బొప్పాల, గంజి కూటి, శ్రీక్షత్రియ రామజోగి, ఇనుంటి, గుర్రపువారు, అడ్డాపువారు, సారగాని, కడారి తిడారొళ్ళు, ఓడ్‌, పాఠంవారు, సాధనా శూరులు, రుంజా, పనాస, పెక్కర, పాండవులవారు, గొడజెట్టి, ఆది, కొడుకులు, తెరచీరల, కాకిపడగల, మంద హెచ్చుల, పప్పాల, సన్నాయిలు, బత్తిన కులాలకు చెందిన సంచార జాతులను బీసీ కులాల జాబితాలోకి చేర్చాల్సి ఉంది. అలాగే వారికి సరైన అవగాహన కల్పించి, కుల ధృవీకరణ పత్రాలు ఇప్పించి విద్యాపరంగా, కులవృత్తి పరంగా సహాయ సహకారాలందించి ఆదుకోవచ్చు. కానీ ఆ విధంగా ఎలాంటి ప్రయత్నాలు జరగలేదు.


ఇప్పటికీ తెలంగాణ సంచార జాతుల వారు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా అభివృద్ధికి ఆమాడ దూరంలో ఉండి కష్టతరంగా జీవనం కొనసాగిస్తున్నారు. కొన్ని కులాలకు కార్పొరేషన్లు ఏర్పాటు చేసినా, అరకొర నిధులను మాత్రమే కేటాయించారు. అలాగే అత్యంత వెనుకబడిన తరగతుల కోసం ఏర్పాటు చేసిన ఎంబీసీ కార్పొరేషన ద్వారా వెయ్యి కోట్ల రూపాయల బడ్జెట్‌ కేటాయించి కేవలం 50 కోట్ల నిధులు మంజూరు చేసినా, అందులో పదిహేను శాతం మాత్రమే సబ్సిడీ పరంగా ఇచ్చారు. అధికారుల్ని అడిగితే పొంతనలేని సమాధానం ఇస్తున్నారు. ఈ కరోనా కష్టకాలంలో పరిస్థితులు మరీ అధ్వాన్నంగా మారాయి. రోజువారి కూలీల సైతం పనులు లేక సొంత ఊర్లకు ఆకలి దప్పులతో ప్రాణాల్ని అరచేతిలో పెట్టుకొని ప్రయాణిస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సంచారజాతి కులాలవారి  సమస్యలను గ్రహించి, వారికి ఆర్థిక పరమైన భరోసానిచ్చి అన్ని కులాలవారికి సమానమైన న్యాయం జరిగే దిశగా అడుగులు వేయాలి.


పగిడిపల్లి సురేందర్‌ పూసల 

Updated Date - 2021-05-08T05:50:07+05:30 IST