జనతా కర్ఫ్యూని విజయవంతం చేద్దాం!

ABN , First Publish Date - 2020-03-22T06:02:30+05:30 IST

ప్రధాని నరేంద్రమోదీ పిలుపునకు సినిమా తారలు స్పందించారు. జనతా కర్ఫ్యూకి మద్దతు ప్రకటించారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకూ ఇంటి నుండి బయటకు రాకుండా...

జనతా కర్ఫ్యూని విజయవంతం చేద్దాం!

ప్రధాని నరేంద్రమోదీ పిలుపునకు సినిమా తారలు స్పందించారు. జనతా కర్ఫ్యూకి మద్దతు ప్రకటించారు. ఆదివారం ఉదయం ఏడు గంటల నుండి తొమ్మిది గంటల వరకూ ఇంటి నుండి బయటకు రాకుండా జనతా కర్ఫ్యూని విజయవంతం చేద్దామని అభిమానులతో పాటు ప్రేక్షకులు, ప్రజలను కోరారు. రజనీకాంత్‌ మాట్లాడుతూ ‘‘ఇటలీలో కరోనా మూడో దశను నివారించడానికి ఇదే విధంగా కర్ఫ్యూ విధించడానికి ప్రయత్నించారు. కానీ, ప్రజల నుండి మద్దతు లేకపోవడం వల్ల ఆ ప్రయత్నాలు విఫలమైయ్యాయి. ఫలితంగా వేలాదిమంది కరోనా బారిన పడ్డారు. అటువంటి సంక్షోభ పరిస్థితులు మనకు వద్దు. అందుకని, జనతా కర్ఫ్యూలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని నేను అభ్యర్ధిస్తున్నా. సామాజిక దూరం పాటించండి. ఇళ్లలో ఉండండి’’ అన్నారు. ‘‘సమైక్యంగా ఇళ్లలో ఉండడం ద్వారా మనకు పొంచి ఉన్న పెను విపత్తు నుండి మనం సురక్షితంగా ఉండొచ్చు’’ అని కమల్‌ హాసన్‌ అన్నారు. చిరంజీవి మాట్లాడుతూ ‘‘కరోనా వైరస్‌ నియంత్రించడానికి క్షేత్ర స్థాయిలో అహర్నిశలూ పని చేస్తున్న వైద్యులు, నర్సులు, ఇతర వైద్య ఆరోగ్య బృందానికి... స్వచ్ఛ కార్మికులు, పోలీస్‌ శాఖకు, ప్రభుత్వాలకి హర్షాతిరేకం ప్రకటిస్తూ ప్రశంసించాల్సిన సమయమిది. అది మన ధర్మం. ప్రధాని పిలుపునకు స్పందిస్తూ... ఇళ్లకు పరిమితం అవుదాం. భారతీయులుగా మనమంతా ఐకమత్యంతో నిలబడి ఈ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొందాం. సామాజిక సంఘీభావం పలుకుదాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం’’ అన్నారు. సామాజిక దూరం ఒక్కటే కరోనాపై పోరాటానికి ఏకైక ఆయుధమని నాగార్జున అన్నారు. ‘‘ప్రధాని మాట పాటిద్దాం. కరోనా విముక్త భారతాన్ని సాధిద్దాం’’ అని శుక్రవారమే పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ‘‘కరోనాపై యుద్ధానికి సామాజిక దూరం, స్వీయ నిర్బంధం అత్యుత్తమ ఆయుధాలు. కోవిడ్‌-19ని జయించాలంటే మనవంతు కృషి చేయాలి. జనతా కర్ఫ్యూని విజయవంతం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం’’ అని జూనియర్‌ ఎన్టీఆర్‌ అన్నారు. అగ్ర హీరో వెంకటేశ్‌, దర్శకుడు రాజమౌళి, పలువురు నటీనటులు, సినీ ప్రముఖులు సైతం జనతా కర్ఫ్యూకి మద్దతు తెలిపారు. ఇటీవల జార్జియా నుండి చిత్రీకరణ ముగించుకుని దేశానికి తిరిగొచ్చిన ప్రభాస్‌ స్వీయ నిర్బంధంలో ఉన్నట్టు తెలిపారు.

Updated Date - 2020-03-22T06:02:30+05:30 IST