3జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌

ABN , First Publish Date - 2020-03-23T09:28:16+05:30 IST

రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఆస్పత్రులకు అనుమానితుల తాకిడి కూడా పెరుగుతోంది. రోజూ 5 -10 మంది అనుమానితులు ఆస్ప్రతులకు వస్తున్నారు.

3జిల్లాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌

పరిస్థితి తీవ్రత దృష్ట్యా ప్రకాశం, కృష్ణా, విశాఖ బంద్‌కు కేంద్రం నిర్ణయం

ఈ జిల్లాల్లో 31వ తేదీ వరకు ‘కర్ఫ్యూ’


అమరావతి/న్యూఢిల్లీ, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతుండడంతో ఆస్పత్రులకు అనుమానితుల తాకిడి కూడా పెరుగుతోంది. రోజూ 5 -10 మంది అనుమానితులు ఆస్ప్రతులకు వస్తున్నారు. ఇప్పటి వరకూ రాష్ట్రంలో 6పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దేశవ్యాప్తంగా పాజిటివ్‌ కేసులు రానురాను అధికమవుతుండడంతో కేంద్రం దేశవ్యాప్తంగా 80 ప్రభావిత జిల్లాల్లో లాక్‌డౌన్‌ ప్రకటించింది. అత్యధిక అప్రమత్తత ప్రకటించింది. ఇందులో ప్రకాశం, కృష్ణా, విశాఖ జిల్లాలు కూడా ఉన్నాయి. ఈ నెల 31వరకు ఈ జిల్లాల్లో ‘జనతా కర్ఫ్యూ’లా పాటించాలని కలెక్టర్లను కేంద్రం ఆదేశించింది. విశాఖ, కృష్ణా, ప్రకాశంలో కొంచెం ప్రమాదకర పరిస్థితులున్నాయని కేంద్రం గుర్తించింది. విశాఖ, కృష్ణా జిల్లాల్లో ప్రధాన నగరాలున్నాయి. నగరాల్లో వైరస్‌ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. మరోవైపు పాజిటివ్‌ కేసులుగా నమోదైన వాళ్లు ఇప్పటికే నగరాల్లో తిరిగివచ్చారు. విశాఖలో మొదటి పాజిటివ్‌గా నమోదైన వ్యక్తి ఈనెల 9న మదీనా నుంచి హైదరాబాద్‌కు వచ్చారు. అక్కడ నుంచి రైల్లో 12న విశాఖ చేరుకున్నారు. 17న చెస్ట్‌ ఆస్పత్రిలో చేరారు. 18న కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. ఇప్పుడు విశాఖలో మరో పాజిటివ్‌ కేసు నమోదైంది. కృష్ణాజిల్లా విజయవాడ నగరంలో ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణైంది. ఫ్రాన్స్‌ నుంచి వచ్చిన అతడు.. 15వ తేదీన ఢిల్లీకి, 17వ తేదీన హైదరాబాద్‌కు విమానంలో వచ్చారు. అదే రోజు హైదరాబాద్‌ నుంచి విజయవాడకు కారులో వచ్చారు. 20వ తేదీన కరోనా లక్షణాలు కనిపించడంతో విజయవాడ ఆస్పత్రిలో చేరారు. శనివారం అతడికి పాజిటివ్‌ నిర్ధారణయింది. ప్రకాశం జిల్లాలో పాజిటివ్‌ కేసుగా నమోదైన వ్యక్తి 10న లండన్‌ నుంచి బయలుదేరి 11న ఢిల్లీకి చేరుకున్నారు. అదేరోజు హైదరాబాద్‌ వచ్చారు. 14న ఉదయం బస్సులో ఒంగోలు చేరారు. 15 ఉదయం ప్రభుత్వాస్పత్రిలో చేరారు. 16న పాజిటివ్‌ నిర్ధారణయింది. ఈ మూడు కేసుల ట్రావెల్‌ హిస్టరీ ఆధారంగా కేంద్రం ఈ మూడు జిల్లాల్లో లాక్‌ డౌన్‌ పాటించాలని నిర్దేశించింది. నెల్లూరులో పాజిటివ్‌ వచ్చిన వ్యక్తి ఆరోగ్యం మెరుగ్గా ఉంది. మరో మూడు రోజుల్లో అతడిని డిశ్చార్జ్‌ చేసే అవకాశముంది. ఈ 75 ప్రభావిత జిల్లాల్లో తెలంగాణకు చెందిన 5 జిల్లాలు.. భద్రాద్రి కొత్తగూడెం, హైదరాబాద్‌, రంగారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్‌ కూడా ఉన్నాయి.


Updated Date - 2020-03-23T09:28:16+05:30 IST