Advertisement
Advertisement
Abn logo
Advertisement

నగర సమరానికి సేన సన్నద్ధం

జిల్లా నేతలతో పవన్‌ సమావేశం

అభ్యర్థుల జాబితా సిద్ధం చేయాలన్న నాదెండ్ల 

ఎన్నికల కోసం ప్రత్యేక కమిటీ


నెల్లూరు(స్టోన్‌హౌస్‌పేట), అక్టోబరు 25: నెల్లూరు కార్పొరేషన్‌ ఎన్నికలకు జనసేన పార్టీ సన్నద్ధమవుతోంది. నగరంలో 54 డివిజన్లు ఉండగా అన్నింటా పోటీ చేసేలా చర్యలు చేపట్టాలని, బలమైన అభ్యర్థుల జాబితాను సిద్ధం చేయాలని పార్టీ అధినేత పవన్‌కల్యాణ్‌, రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌ సూచించారు. వారు హైదరాబాదులోని పార్టీ కార్యాలయంలో జిల్లా నాయకులతో ఆది, సోమవారాల్లో సమావేశాలు నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి, నగర నాయకుడు కేతంరెడ్డి వినోద్‌రెడ్డితో సమావేశమయ్యారు. కార్పొరేషన్‌ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని, సత్తా చాటేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించినట్లు సమాచారం. అభ్యర్థుల జాబితాను మనుక్రాంత్‌రెడ్డి, వినోద్‌ రెడ్డి కలిసి రూపొందించాలని సూచించినట్లు తెలిసింది. ఈ క్రమంలో నేడో రేపో అభ్యర్థుల జాబితా సిద్ధమయ్యేలా కనిపిస్తోంది. జిల్లా నాయకులు సిద్ధం చేసిన జాబితాను ఎన్నికల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయనున్న ఐదుగురు సభ్యుల కమిటీ పరిశీలిస్తుంది. అనంతరం తుది జాబితాను ప్రకటిస్తారు. ఈ మొత్తం తంతు త్వరలోనే పూర్తి కానున్నట్లు సమాచారం. ఏదేమైనా నెల్లూరు నగర పాలిక ఎన్నికల్లో బీజేపీతో పొత్తు లేకుండా జనసేన పోటీలోకి దిగుతోందని ఈ సమావేశంతో స్పష్టమవుతోంది.ప్రచారం ప్రారంభం

భారీగా తరలి వచ్చిన అభిమానులు

జనసేన పార్టీ నగరంలో ఎన్నికల ప్రచారాన్ని సోమవారం 16వ డివిజన్‌లో శివాలయం నుంచి లాంఛనంగా ప్రారంభించింది. పార్టీ నగర నాయకులు, పవన్‌ కల్యాణ్‌ అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా జనసేన జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్‌ గునుకుల, నగర నాయకుడు సుజయ్‌బాబు  మాట్లాడుతూ నగర అభివృద్ధే ధ్యేయంగా, సమస్యల పరిష్కారమే లక్ష్యంగా జనసేన పార్టీ రానున్న ఎన్నికల్లో పోటీకి దిగుతోందని చెప్పారు. ప్రజలకు అందుబాటులో ఉండే జనసైనికులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని, ఇప్పటి వరకు ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేసిన జన సైనికులు ప్రజలకు మరింత అండగా నిలిచేందుకు స్థానిక నాయకత్వాన్ని కోరుకుంటున్నారన్నారు. ప్రజలందరూ మద్దతివ్వా లని కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యక్రమాల నిర్వహణ కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు ఎస్‌కే సాయిబాబా, భరత్‌ తదితరులు పాల్గొన్నారు.

ప్రచారంలో పాల్గొన్న జనసేన నాయకులు

450 పోలింగ్‌ స్టేషన్లు

నెల్లూరు (సిటీ), అక్టోబరు 25 : నెల్లూరు నగర పాలిక ఎన్నికల నిర్వహణ కోసం నగరంలోని 54 మున్సిపల్‌ డివిజన్లకు 450 పోలింగ్‌ స్టేషన్లను అధికారులు తుది జాబితాలో సిద్ధం చేశారు. వాటన్నింటిలో పోలింగ్‌ సమాయానికి అన్ని మౌలిక సదుపాయాలు సమకూర్చుతామని కమిషనర్‌ దినేష్‌కుమార్‌ తెలిపారు. ఆయన సోమవారం ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు, ఏఆర్వోలతో కార్పొరేషన్‌ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. పోలింగ్‌ స్టేషన్ల వారీగా సమస్యలు తెలుసుకుని, వాటిని తగు రీతిలో పరిష్కరించాలని సూచించారు. ఎన్నికల విధులను సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. 

Advertisement
Advertisement