మాట్లాడుతున్న బోనబోయిన, గాదె తదితరులు
వైసీపీ ప్రభుత్వ పరిపాలనపై జనసేన ఫైర్
గుంటూరు, జనవరి 28: నిన్ను నమ్మి ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు ప్రజలకు ఇంత నరకం చూపిస్తావా? అంటూ ప్రభుత్వ పాలనపై జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బోనబోయిన శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు గాదె వెంకటేశ్వరరావు ధ్వజమెత్తారు. శుక్రవారం పార్టీ జిల్లా కార్యాలయంలో జరిగిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. వైసీపీ అధికారం చేపట్టిన క్షణం నుంచి రాష్ట్రంలో అరాచకం పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా వేదికను కూల్చివేత నుంచే రాష్ట్ర పతనాన్ని ప్రారంభించినట్లు వారు విమర్శించారు. మూడేళ్లల్లోనే రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో పడవేసిన ఘనత జగన్‌కే దక్కుతుందన్నారు. ప్రజల పట్ల బాధ్యత లేని అయోగ్యుడికి పట్టం కట్టినందుకు ప్రజలు బాధపడుతున్నారని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగుల న్యాయపరమైన డిమాండ్లను నెరవేర్చాలని వారు డిమాండ్ చేశారు. ఉద్యోగ సంఘాల పోరాటానికి జనసేన పూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు తెలిపారు. సమావేశంంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి నాయబ్ కమాల్, నాయకులు వంశీ, నారదాసు ప్రసాద్, ఆళ్ల హరి, కొండూరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు.