డాబాగార్డెన్స్(విశాఖపట్నం), మే 14: అంబేడ్కర్ రచించిన రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ, రాష్ట్రంలో తన సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ రాజ్యాంగ ద్రోహి అని జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి టి.శివశంకర్ విమర్శించారు. జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్‌ను రాష్ట్ర ద్రోహి, దేశ ద్రోహి అని జగన్ సంబోధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. నగరంలోని డాబాగార్డెన్స్ వీజేఎఫ్ ప్రెస్‌క్లబ్‌లో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల్లోకి వచ్చినప్పుడు ఎవరో రాసి ఇచ్చిన స్ర్కిప్ట్‌ను చదవడం తప్ప, ప్రజా సమస్యలపై సీఎంకి కనీస అవగాహన లేదన్నారు. పవన్ కల్యాణ్ చేపట్టిన కౌలు రైతుల సహాయ కార్యక్రమాన్ని జీర్ణించుకోలేక, ఈ ప్రభుత్వం దిగజారుడు విమర్శలు చేస్తోందన్నారు. పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ మాట్లాడుతూ, వైసీపీ పేరును ద్రోహం పార్టీగా మార్చుకోవాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జనసేన రాష్ట్ర పీఏసీ సభ్యులు కోన తాతారావు, అధికార ప్రతినిధి పరుచూరి భాస్కరరావు, పసుపులేటి ఉషాకిరణ్ తదితరులు పాల్గొన్నారు.