కరోనా సమయంలో రాజకీయాలు సిగ్గు చేటు: పోతిన

ABN , First Publish Date - 2021-05-11T18:38:51+05:30 IST

ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏపీలో కరోనాతో ప్రజలు అల్లాడుతున్నారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు.

కరోనా సమయంలో రాజకీయాలు  సిగ్గు చేటు: పోతిన

విజయవాడ: ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏపీలో కరోనాతో ప్రజలు అల్లాడుతున్నారని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ వెల్లంపల్లి మంత్రిగా ఉండి  కరోనా సమయంలో కూడా రాజకీయాలు చేయడం సిగ్గు చేటని మండిపడ్డారు. ‘‘మిమ్మలను ఓట్లేసి గెలిపించింది... ఇంట్లో కూర్చోవడానికేనా మంత్రిగారూ’’ అంటూ విరుచుకుపడ్డారు. పశ్చిమ నియోజకవర్గంలో  కోవిడ్ సెంటర్లను ఎందుకు ఏర్పాటు చేయలేదో మంత్రి వెల్లంపల్లి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. అసలు కరోనా టెస్ట్‌లు, రిపోర్టులు ఎప్పుడు వస్తాయో కూడా కనీసం సమాచారం చెప్పలేకపోతున్నారన్నారు. జిల్లా మంత్రిగా విజయవాడలో ఒక్క సమీక్ష అయినా చేశారా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వాసుపత్రికి వెళ్లి ఏర్పాట్లను కూడా పరిశీలించలేకపోయారని మండిపడ్డారు. వైసీపీ గొప్పగా చెప్పుకునే వార్డు వాలంటీర్లు  వ్యవస్థ ఏం చేస్తుందని ప్రశ్నించారు. రెండేళ్లుగా కనీసం పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు కూడా చేపట్టలేదన్నారు.


ఎంతసేపూ ఆలయాలను అడ్డం పెట్టుకుని దోపిడీ చేయడం...స్థలాలను కబ్జా చేయడం పైనే వెల్లంపల్లి దృష్టి అంతా అని వ్యాఖ్యానించారు. మొదటి కరోనా వేవ్‌లో కూరగాయల పంపిణీ పేరుతో దోపిడీ చేశారని... రెండో వేవ్‌లో అర్చక పోస్టుల భర్తీతో లక్షల వసూళ్లు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. కరోనా అందరినీ కష్ట పెడుతుంటే... వెల్లంపల్లికి మాత్రం కాసులు కురిపిస్తుందన్నారు. పెన్షన్లు, రేషన్ ఇచ్చినప్పుడు పోటోలు దిగే కార్పోరేటర్లంతా ఇప్పుడు ఎక్కడ అని మండిపడ్డారు. కరోనాతో బాధ పడుతున్న వారికి కనీసం సాయం అందించారా అని నిలదీశారు. విశాల ప్రాంగణం ఉన్న కెబీయన్ కళాశాలలో వ్యాక్సిన్ కేంద్రం పెడతారా.. బెడ్‌లు ఏర్పాటు చేయరా అని అడిగారు. శాశ్వత వ్యాక్సిన్ కేంద్రం ఏర్పాటుకు తన కార్యాలయం ఇస్తా.. తీసుకోండన్నారు. అవసరమైతే.. ఇందుకు సొంత ఖర్చులు భరించేందుకు సిద్దంగా ఉన్నానని స్పష్టం చేశారు. పది ఎకరాల భూమి ఉన్న కేబీయన్ కాలేజీ ప్రాంగణంలో పడకలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. వ్యాక్సిన్, ఇంజక్షన్, బెడ్లు కొరతతో ప్రజలు పరుగులు పెడుతున్నా... పట్టించుకోరా అని అన్నారు. స్మశానాలలో అంత్యక్రియలకు కూడా టోకెన్ తీసుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని జనసేన నేత వ్యాఖ్యానించారు.


‘‘ప్రజలు కోరుకున్నది ఇటువంటి పాలన కాదు జగన్ రెడ్డి గారూ.. ఓట్లు వేసిన ప్రజలకు.. ఇదేనా మీరు అందించే పాలన’’ అని ప్రశ్నించారు. విపత్కర పరిస్థితులలో సేవ చేయాల్సిన వారు పత్తా లేకుండా పోతారా అని అన్నారు. రుయా ఆస్పత్రిలో ఆక్సిజన్ అందకపోవడం ప్రభుత్వ వైఫల్యమే అని విమర్శించారు. ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే.. ప్రతిపక్ష నేతలపై కేసులు పెడతారా అని అడిగారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే.. వెంటనే ప్రజల అవసరాలకు అనుగుణంగా వైద్యపరమైన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. మంత్రి వెల్లంపల్లి రాజకీయాలు మాని.. కోవిడ్ సెంటర్‌ను తన నియోజకవర్గంలో ఏర్పాటు చేయాలన్నారు. విపత్కర పరిస్థితులలో ఇంట్లో దాక్కుంటే.. ప్రజలు తరిమికొడతారన్నారు. ప్రభుత్వం వెంటనే వ్యాక్సిన్ తెప్పించి.. అర్హులైన వారికి క్రమపద్ధతిలో వేయాలని పోతిన వెంకట మహేష్ డిమాండ్ చేశారు. 

Updated Date - 2021-05-11T18:38:51+05:30 IST