పోలవరంపై చిత్తశుద్ధి ఉంటే...సీఎం స్పందించాలి: పోతిన మహేష్

ABN , First Publish Date - 2020-11-28T19:34:45+05:30 IST

వైసీపీ, టీడీపీ పార్టీలపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన‌ వెంకట మహేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

పోలవరంపై చిత్తశుద్ధి ఉంటే...సీఎం స్పందించాలి: పోతిన మహేష్

విజయవాడ: వైసీపీ, టీడీపీ పార్టీలపై జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన‌ వెంకట మహేష్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బీజేపీ కేంద్ర నాయకులతో తమ అధినేత పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారని... ప్రజలు, రాష్ట్ర అభివృద్ధిలో తమ నాయకుడి చిత్తశుద్ధి ఏమిటో అందరికీ అర్ధమైందని తెలిపారు. పోలవరం నిర్మాణం, అమరావతి రాజధాని అంశాల పైనే పవన్ చర్చించారని స్పష్టం చేశారు. అమరావతి, పోలవరంపై పోరాటం చేయలేని దుస్థితిలో టీడీపీ ఉందని విమర్శించారు. వైసీపీ నేతలు  స్వార్ధ ప్రయోజనాల కోసమే రాజధాని మార్పు అన్నారని వ్యాఖ్యానించారు. పోలవరం విషయంలో కూడా రాజకీయంగా వాడుకోవాలని చూస్తున్నారని ఆయన అన్నారు. సీఎం జగన్ రెడ్డి నోరు విప్పాలని.. పోలవరం ఎత్తు పై ప్రభుత్వం నిర్ణయం ప్రకటించాలని డిమాండ్ చేశారు. మంత్రులతో రోజుకొక ప్రకటన చేస్తే రైతుల్లో  గందరగోళం నెలకొందన్నారు.


పోలవరంపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే... సీఎం స్పందించాలన్నారు. రాష్ట్రం లో ప్రాంతాలు, ప్రజల మధ్య చిచ్చు పెట్టే కుట్రలు ఆపాలని హితవు పలికారు. బీజేపీ, జనసేనలు అమరావతి విషయంలో స్పష్టంగా ఉన్నాయన్నారు. రాజధాని అమరావతేనని, పోలవరం నిర్మాణంపై బీజేపీ పెద్దల నుంచి  పవన్  హామీ తీసుకున్నారని తెలిపారు. బుగ్గన ఢిల్లీ‌ వెళ్లి ఏం‌ సాధించారో ఎందుకు చెప్పలేక పోయారని ప్రశ్నించారు. తుఫాన్ కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు పొలాలను ఎందుకు పరిశీలించడం లేదని ఆయన నిలదీశారు. విజయవాడలో కూర్చుని ప్రెస్‌మీట్లకే పరిమితం అవుతున్నారని వ్యాఖ్యానించారు. క్షేత్ర స్థాయిలోకి‌ వెళ్లి రైతుల కడగండ్లు తెలుసుకోవాలని సూచించారు. 




మహానగరంలో మాయగాడు కేసీఆర్

ఏపీలో ఎక్కడా అభివృద్ధి జరగకూడదని కేసిఆర్ భావిస్తున్నారని పోతిన విమర్శించారు. మహానగరంలో మాయగాడు కేసీఆర్.. అనేది తెలుసుకోవాలన్నారు. ఆయన అహంకారానికి‌ బుద్ధి చెప్పేలా కేసీఆర్‌కు ఎవరూ ఓటు‌ వేయవద్దని పిలుపునిచ్చారు. హైదరాబాద్‌లో ఉన్న ఏపీ ప్రజలంతా బీజేపీకే ఓటు‌ వేయాలని కోరారు. రాష్ట్ర ప్రయోజనాలకు అడ్డుపడుతున్న కేసీఆర్‌కు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి కూడా ప్రచారం చేయాలన్నారు. జగన్ పాలనలో ఏపీలో అభివృద్ధి అనేది లేకుండా పోయిందని తీవ్రస్థాయిలో ఆయన ధ్వజమెత్తారు. ప్రజలకు అమలు చేసే పధకాలు ఎటువంటి ఉపయోగం లేదని...తమరు ఇచ్చే పది‌వేలతో‌ వాళ్ల తలరాత మారదన్నారు. అన్ని రకాల నిత్యావసర వస్తువుల ధరలు పెరిగిపోయాయని... ట్రాఫిక్ ఆంక్షలు పెట్టి ఇష్టం వచ్చిన విధంగా ఫైన్‌లు వేస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మూడింతలు ధరలు పెరిగాయన్నారు. ధరలను  నియంత్రణ చేసేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. 




ప్రకాష్‌రాజ్‌పై మండిపడ్డ పోతిన

ప్రకాష్ రాజ్..  పవన్ కళ్యాణ్, జనసేన పై చేసిన వ్యాఖ్యలు ఖండిస్తున్నామన్నారు. బీజేపీతో జనసేన పొత్తు పెట్టుకుంటే.. తమకు ఉలుకెందుకని ప్రశ్నించారు. కొండారెడ్డి పల్లెను దత్తత తీసుకుని ఎంత వరకు అభివృద్ధి చేశారో ప్రకాష్ రాజ్ చెప్పాలని డిమాండ్ చేశారు. ఆ ప్రాంతంలో తమరు ఫాం హౌస్  నిర్మించుకున్నారని.. అక్కడి అటవీ భూములను కూడా తమరు కలుపుకున్నారా అని నిలదీశారు. టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా దీనిపై విచారణ చేసి వాస్తవాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. తమ వ్యాపారం కోసం కేసీఆర్ పొగుడుకోండని.. కానీ పవన్‌ను విమర్శిస్తే ఊరుకోమని... నోరు అదుపులో పెట్టుకోక పోతే.. తమ సినిమాలను అడ్డుకుంటామని హెచ్చరించారు. తమకు దమ్ముంటే టీఆర్ఎస్, ఎం.ఐ.ఎం పొత్తులపై స్పందించాలని పోతిన మహేష్ సవాల్ విసిరారు. 

Updated Date - 2020-11-28T19:34:45+05:30 IST