రాజమండ్రి: జనసేన నుంచి వైసీపీలోకి వెళ్ళిన స్థానిక ఎమ్మెల్యే ( రాజోలు) నియోజకవర్గంలో రోడ్లకు ప్రతి రెండున్నర అడుగులకు ఒక గొయ్యి ఉందని జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఏపీలో సీఎం జగన్ భూకబ్జాలు, ఇసుక దోపిడీతో ప్రజాధనాన్ని దోచుకుంటున్నారన్నారు. జగన్ పాలనలో రాష్ట్రం అధోగతి పాలై అంధకారంలో కూరుకు పోయిందన్నారు.
ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు తీవ్ర నష్టం కలిగినప్పటికీ ఆదుకోవడం పోయి తద్వారా పైశాచిక ఆనందం పొందడం దారుణమన్నారు. వన్ టైం సెటిల్మెంట్ పేరుతో వలంటీర్ల వ్యవస్థ ద్వారా పేదలను పదివేల రూపాయలు చొప్పున దోచుకుంటున్నారని ఆయన తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. స్పష్టమైన హామీలతో జనసేన పార్టీ మేనిఫెస్టోల ద్వారా అంచెలంచెలుగా రాష్ట్రంలో బలపడుతుందని ఆయన పేర్కొన్నారు.