విన్నపాలు వినవలె..

ABN , First Publish Date - 2022-07-04T06:20:07+05:30 IST

విన్నపాలు వినవలె..

విన్నపాలు వినవలె..
తిరువూరు ఫ్లోరైడ్‌ బాధితుల సమస్యలు వింటున్న పవన్‌ కల్యాణ్‌

‘జనవాణి భరోసా’కు రెండు జిల్లాల నుంచి మంచి స్పందన

జనసేనానికి భారీగా ఫిర్యాదులు

ఓపిగ్గా అందరి సమస్యలూ విన్న పవన్‌ కల్యాణ్‌

తిరువూరు ఫ్లోరైడ్‌ సమస్యపై మండిపాటు

ఈనెల 10న మరోసారి అర్జీల స్వీకరణ


ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి పవన్‌ కల్యాణ్‌ నిర్వహించిన జనవాణి భరోసా కార్యక్రమంలో జిల్లా సమస్యలు వెల్లువెత్తాయి. నగరంలోని మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లావాసులు.. తాము ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందులను జనసేనానికి తెలియజేశారు. అయితే, ఈ కార్యక్రమంలో కృష్ణా, ఎన్టీఆర్‌, గుంటూరు, ప్రకాశం, పల్నాడు జిల్లాల నుంచి 425 మంది అర్జీదారులు తమ సమస్యలను విన్నవించుకున్నారు. మరో 150 మందికి అవకాశం లభించలేదు. అయితే, ఈనెల పదో తేదీన నిర్వహించే జనవాణిలో వారి నుంచి అర్జీలు స్వీకరిస్తామని పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. వేదికపై పవన్‌ కల్యాణ్‌తో పాటు పీఏసీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌, విశ్రాంత ఐఏఎస్‌ అధికారి వరప్రసాదరావు ఉన్నారు. 

- విజయవాడ, ఆంధ్రజ్యోతి


తాడేపల్లి నిర్వాసితురాలితో తొలి అర్జీ

తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయం వద్ద భద్రత కోసం ఇళ్లను తొలగించిన నిర్వాసితుల్లో శివశ్రీ ‘జనవాణి భరోసా’లో తొలి అర్జీని అందజేశారు. పరిహారం ఇవ్వకుండా, ప్రత్యామ్నాయం చూపకుండా ఇంటిని తొలగించారని వివరించారు. అలాగే, కొన్ని రోజుల తరువాత కూరగాయలు తెస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లిన తన సోదరుడు మూడు రోజుల తర్వాత ఆటో ట్రాలీలో మృతదేహమై ఇంటికి వచ్చాడని విలపించింది. 

పవన్‌ : వాస్తవానికి జనవాణి భరోసా కార్యక్రమం ప్రారంభించడానికి ఈ ఘటన ఒక కారణం. శివశ్రీ జరిగిన అన్యాయం చెప్పుకోవడానికి మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి వచ్చింది. అప్పటికి ఆమె వలంటీర్‌గా పనిచేస్తోంది. నన్ను కలిస్తే ఇబ్బందులు వస్తాయి కదా.. అని ప్రశ్నించాను. ఇబ్బందిపడినా న్యాయం కావాలని చెప్పింది. ఆమె నాకు రాసిన లేఖ కదిలించింది. శివశ్రీ సోదరుడి మరణం వెనుక మిస్టరీ ఏంటో తేల్చలేదు. కనీసం పోస్టుమార్టం చేయించమని అడిగినా చేయలేదు. 

- మచిలీపట్నంలో ఉపాధి అవకాశాలు లేక యువత ఇతర రాష్ట్రాలకు తరలివెళ్తున్నారని జనసేన మచిలీపట్నం నగర అధ్యక్షుడు గడ్డం రాజు తెలిపారు. బందరు పోర్టు నిర్మాణం జరిగితే జిల్లాలోని యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. మచిలీపట్నంలో తాగునీరు, డ్రెయినేజీ సమస్య ఎక్కువగా ఉందని, జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు ఏర్పరచాలన్నారు. చిన్నాపురం దిగువన ఉన్న వాడగొయ్యి, కొత్తవాడపాలెం, పెదయాదర గ్రామాల్లోని దళితుల సమస్యలను పెదయాదర సర్పంచ్‌ తిమోతి వివరించారు.

- ఇబ్రహీంపట్నంలోని ఎన్టీటీపీఎస్‌ కాలుష్యం కారణంగా వ్యాధుల బారిన పడుతున్నామని తుమ్మలపాలెం జనసేన ఎంపీటీసీ పొలిశెట్టి తేజ.. పవన్‌కు వివరించారు. స్థానికులు ఊపిరితిత్తులు, చర్మవ్యాధుల బారినపడి తీవ్ర ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. బూడిద వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా యాజమాన్యం సామాజిక బాధ్యత కింద గ్రామాల్లో చేపట్టాల్సిన పనులను నిర్లక్ష్యం చేసిందని చెప్పారు. 

- జగ్గయ్యపేట ప్రాంతంలో సిమెంట్‌, రసాయన, ఫార్మా కర్మాగారాల వల్ల తలెత్తుతున్న జల, వాయు కాలుష్యం నుంచి ప్రజలను కాపాడాలని పవన్‌కు జగ్గయ్యపేట ప్రాంత జనసేన ప్రతినిధులు ఫిర్యాదు చేశారు. ధనంబోడు కాలనీలో సిమెంట్‌ కాలుష్యంతో పాటు షేర్‌మహ్మద్‌పేటలో రసాయన కర్మాగారాల వల్ల భూగర్భ జలాలు రంగుమారి, తాగేందుకు పనికిరాకుండా పోయాయని ఫిర్యాదు చేశారు. 

- దేశంలోనే అతిపెద్ద ఆటోనగర్‌ విజయవాడలో ఉందని, దానిని ఇప్పుడు తరలించాలని ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని, వేలాది మంది కార్మికుల ఉసురు తీస్తోందని ఆటోనగర్‌ కార్మికులు పవన్‌కు వివరించారు. 

- వాంబేకాలనీలో చెత్త సమస్యను స్థానికులు పవన్‌కు తెలియజేశారు. ఇక్కడి నుంచి డంపింగ్‌ యార్డును తరలిస్తామని అధికారులు, ప్రజాప్రతినిధులు మాటలు చెబుతున్నారు కానీ, చేతల్లో అమలు చేయట్లేదని పేర్కొన్నారు. రాత్రిపూట చెత్తకు నిప్పంటుకుని మంటలు రేగుతున్నాయని, దాని నుంచి వస్తున్న పొగతో చుట్టుపక్కల ఉండలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.

- ఎన్నో ఏళ్లుగా శాశ్వత పరిష్కారానికి నోచుకోని ఎ.కొండూరు మండల కిడ్నీ సమస్యను జనసేన జిల్లా కార్యదర్శి ఎం.శ్రీనివాసరావు.. పవన్‌ కల్యాణ్‌ దృష్టికి తీసుకొచ్చారు. తిరువూరు, గంపలగూడెం, ఎ.కొండూరు మండలాల్లో కిడ్నీ బాధితులను తీసుకెళ్లి సమస్యను వివరించారు. విజయవాడకు కూతవేటు దూరంలో ఉన్న ఎ.కొండూరుకు కృష్ణా జలాలు సరఫరా చేయలేకపోవడం దారుణమని పవన్‌ మండిపడ్డారు. 






Updated Date - 2022-07-04T06:20:07+05:30 IST