కేసీఆర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: Pavan

ABN , First Publish Date - 2022-02-17T16:51:11+05:30 IST

తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.

కేసీఆర్‌కు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు: Pavan

అమరావతి: తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు‌కు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. గొప్ప వాక్పటిమ, ముందుచూపు కలిగిన రాజకీయ పోరాటయోధుడని కొనియాడారు. ఎంతటి జఠిలమైన సమస్య తెలంగాణ రాష్ట్రానికి ఎదురైనా తన మాటలతో, వాక్చాతుర్యంతో  ప్రజలకు సాంత్వన చేకూర్చడంలో ఆయనకు ఆయనే సాటన్నారు. ఆయన రాజకీయ ప్రయాణం, తెలంగాణ సాధనలో ఆయనదైన పోరాటం..కేసీఆర్‌ను తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుందని తెలిపారు. సమకాలీన రాజకీయ నాయకులలో తనకంటూ ఒక ప్రత్యేక పంథాను ఏర్పరుచుకుని రాజకీయ ప్రస్థానం కొనసాగించడం  కేసీఆర్‌లోని మరో ప్రత్యేకతన్నారు.


ఆయన రాజకీయ శైలిని ప్రత్యర్థులు సైతం మెచ్చుకోకుండా ఉండలేరన్నది నిగూఢమైన నిజమని చెప్పుకొచ్చారు. తెలంగాణ అంతటా శాంతిభద్రతలు పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వడం విజ్ఞులందరితో పాటు తనకూ ఆనందాన్ని కలిగించిందన్నారు. నూతన వసంతంలోకి అడుగిడుతున్న శుభ తరుణంలో కేసీఆర్‌కు సంపూర్ణ ఆరోగ్యాన్ని, దీర్ఘాయుష్షును ప్రసాదించాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను అని పవన్ కళ్యాణ్ ఓ ప్రకటనలో తెలిపారు. 

Updated Date - 2022-02-17T16:51:11+05:30 IST