Abn logo
Jul 3 2020 @ 20:59PM

ఏపీ సీఎం జగన్‌కు జనసేన అధినేత పవన్ ప్రశంసలు.. కానీ..

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రశంసించారు. అత్యవసర సేవల్ని అందించే అంబులెన్సులని, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆరంభించడం అభినందనీయమని పవన్ కొనియాడారు. అలాగే, మూడు నెలలుగా కరోనా టెస్టుల విషయంలో ఏమాత్రం అలసత్వం వహించకుండా, ప్రభుత్వం పనిచేస్తున్న తీరు అభినందనీయమని వైసీపీ ప్రభుత్వంపై పవన్ ప్రశంసలు కురిపించారు. 


పవన్ చేసిన ఈ ట్వీట్స్‌పై కొందరు వైసీపీ అభిమానులు కాలరెగరేస్తుంటే.. మరికొందరు మాత్రం కాకమీద ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి-శ్రీ జగన్ రెడ్డి గారు అని పవన్ ట్వీట్‌లో సంబోధించడమే అందుకు కారణం. గతంలో కూడా జగన్మోహనరెడ్డిని జగన్ రెడ్డి అని పవన్ పలుమార్లు సంబోధించారు.


జగన్ రెడ్డి అని పవన్ వ్యాఖ్యానించిన ప్రతీ సందర్భంలోనూ మంత్రులతో సహా పార్టీ శ్రేణులు కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. జగన్‌ను ప్రశంసించిన సందర్భంలోనూ జగన్ రెడ్డి అని పవన్ సంబోధించడంతో.. ప్రశంసలకు పొంగిపోవాలో లేక జగన్ రెడ్డి అని ట్వీట్ చేసినందుకు అభ్యంతరం వ్యక్తం చేయాలో తెలియక వైసీపీ శ్రేణులు మల్లగుల్లాలు పడుతున్న పరిస్థితి నెలకొంది.


Advertisement
Advertisement
Advertisement