Pawan kalyan ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తిన జనసేనాని

ABN , First Publish Date - 2022-08-08T15:03:12+05:30 IST

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొగడ్తలతో ముంచెత్తారు.

Pawan kalyan ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తిన జనసేనాని

అమరావతి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan kalyan) పొగడ్తలతో ముంచెత్తారు. కామన్‌వెల్త్ క్రీడా (Commonwealth games) పోటీల్లో మహిళా కుస్తీ పోటీలో బంగారం చేజారినందుకు దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పిన పూజ గెహ్లట్‌‌ (Pooja Gehlot)ను ప్రధాని ఓదార్చిన తీరు అమోఘమన్నారు. క్రీడాకారుల(Sportsmens)లో ప్రధాని (Prime minister) నింపుతున్న స్ఫూర్తి ప్రతీ ఒక్కరిలో కలగాలని ఆకాంక్షించారు. అలాగే  చంద్రయాన్-2 ప్రాజెక్ట్ (Chandrayaan-2 project) విఫలమైన సందర్భాల్లోనూ శాస్త్రవేత్తలకు గుండెధైర్యాన్ని నింపారని తెలిపారు.


‘‘విజయాలు వరించినప్పుడు పొగడ్తలతో ముంచెత్తేవారు కొల్లలుగా ఉంటారు. అదే అపజయం వెంటాడినప్పుడు ఓదార్చేవారు అరుదుగా మాత్రమే కనిపిస్తారు. సన్మానాలు కంటే పరాజయంలో వెన్నంటి ఉన్నవారే గొప్పగా కనపడతారు. ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు చెప్పడం, శుభాకాంక్షలు అందచేయడానికి మాత్రమే పరిమితం కాలేదు. విజయాలు సాధించిపెట్టడానికి పరితపిస్తూ.. పరిశ్రమిస్తూ... త్రుటిలో విజయానికి దూరమైన వారికి భరోసాగా నిలవడం నన్నెంతో ఆకట్టుకుంది. బ్రిటన్‌లో జరుగుతున్న కామన్ వెల్త్  క్రీడా పోటీలలో మహిళా  కుస్తీ పోటీలో  పూజ గెహ్లట్ బంగారు పతకం చేజారిపోయి కాంస్యం వచ్చింది. దీంతో దేశానికి బంగారు పతకం అందించలేకపోయానని, దేశ ప్రజలు క్షమించాలంటూ పూజ గెహ్లట్ విలపిస్తున్న వీడియోను మోదీ  చూసి ఆమెను ఓదార్చిన తీరు మానవీయంగా ఉంది. "నీ విజయం దేశానికి వేడుకలను తీసుకొచ్చింది.. క్షమాపణలు కాదు. నీ విజయాన్ని చూసి ఉత్తేజితులమయ్యాము... నీ విజయం మాకో అద్భుతం" అని ఆమెకు పంపిన సందేశం కదిలించేలా ఉంది. ఈ సందర్భంలోనే కాదు పలు సంఘటనలలో ఆయన చూపిన ఇటువంటి ఓదార్పు  మనసుకు స్వాంతన చేకూరుస్తాయి’’ అని పవన్ కొనియాడారు.


‘‘టోక్యో (Tokyo)లో జరిగిన ఒలింపిక్ క్రీడల (Olympic Games)లో మన దేశ హాకీ మహిళ టీం (Women's Hockey Team) ఫైనల్ చేరలేదు. మన క్రీడాకారిణులు మైదానంలో విలపించిన తీరు చూపరులను కూడా కంటతడి పెట్టించింది. ఆ సందర్భంలో కూడా  మోదీ (PM Modi) మన క్రీడాకారిణులను ఇలాగే ఓదార్చారు. వారికి ఫోన్ చేసి తండ్రిలా అనునయించారు. చంద్రయాన్-2 ప్రాజెక్ట్ విఫలమైన సందర్భాల్లోనూ శాస్త్రవేత్తలకు గుండెధైర్యాన్ని నింపారు. ఈ ప్రాజెక్టులోని విక్రమ్ ల్యాండర్ (Vikram Lander) చంద్రునిపై దిగడంలో విఫలమైనప్పుడు ప్రత్యర్ధులు సోషల్ మీడియా వేదికగా మన శాస్తవేత్తలను గేలి చేశారు..అవమానించారు. అటువంటి క్లిష్ట సమయంలో ఇస్రో చీఫ్ (ISRO Chief ) శ్రీ శివన్‌ (Sri Sivan)ను గుండెలకు హత్తుకుని పరాజయాన్ని మరిచిపోండి. భవిష్యత్తుపై దృష్టిపెట్టండని చెప్పి శాస్త్రవేత్తలకు మనోధైర్యాన్ని ఇవ్వడం కుడా మనం మరిచిపోలేని సంఘటన. ఇదే స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో కలగాలని కోరుకుంటున్నాను’’ అని అన్నారు. పూజ గెహ్లట్‌తో పాటు కామన్ వెల్త్ క్రీడల్లో పతకాలు సాధించిన విజేతలకు, పాల్గొన్న క్రీడాకారులందరికీ పవన్ కళ్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. 

Updated Date - 2022-08-08T15:03:12+05:30 IST