
అమరావతి: అమలాపురంలో మంగళవారం జరిగిన దాడులు.. కుట్రపూరిత దాడులని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ విపక్ష నేతలవి దుర్మార్గపు రాజకీయ ఆరోపణలని తప్పికొట్టారు. కోనసీమ అల్లర్లకు వైసీపీనే కారణం అంటున్నారని, వైసీపీ వాళ్లే అయితే.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లపై దాడులు జరిగేవా? అని ప్రశ్నించారు. టీడీపీ, పవన్, బీజేపీ ఒకే ఆరోపణలు చేస్తున్నారని, పార్టీల స్పందన చూస్తుంటే.. అందరూ ప్లాన్ ప్రకారమే చేశారనిపిస్తోందన్నారు. టీడీపీ స్క్రిప్టునే జనసేన అధినేత పవన్‌కల్యాణ్ చదివారని, ఆయనకు కనీస అవగాహన లేకుండా మాట్లాడారని ఎద్దేవాచేశారు. అంబేద్కర్ పేరు పెట్టాలని టీడీపీ, జనసేన కోరాయని, ప్రజల నుంచి అభ్యర్థనలు వచ్చాయని తెలిపారు. పేరుపై అభ్యంతరాల నమోదుకు అన్ని జిల్లాలకు గడువు ఇచ్చామని సజ్జల గుర్తుచేశారు. అల్లర్ల కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అమలాపురం అల్లర్ల కేసులో అనుమానితుడు అన్యం సాయి మిగతా వాళ్లతోనూ ఫొటోలు దిగాడని, అన్యం సాయి జనసేన కార్యకర్తేనని సజ్జల తెలిపారు. అతను జనసేన నేతలతో ఉన్న ఫొటోలు ఉన్నాయని, అన్యం సాయి మిగతా వాళ్లతోనూ ఫొటోలు దిగాడని సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు.
ఇవి కూడా చదవండి