జన సందోహం నడుమ జలధికి పీర్లు

ABN , First Publish Date - 2022-08-10T04:50:21+05:30 IST

మొహర్రం వేడుకల్లో భాగంగా మంగళవారం తెల్లవారుజామున పోరుమామిళ్ల రెవెన్యూ చావడి, ఉద్దికట్ట వీధిలోని మకాన్‌ల వద్ద అగ్నిగుండం నిర్వహించారు.

జన సందోహం నడుమ జలధికి పీర్లు
దువ్వూరులో పీర్ల ఊరేగింపులో పాల్గొన్న ప్రజలు

పోరుమామిళ్ల,  ఆగస్టు 9 :  మొహర్రం వేడుకల్లో భాగంగా మంగళవారం  తెల్లవారుజామున పోరుమామిళ్ల రెవెన్యూ చావడి, ఉద్దికట్ట వీధిలోని మకాన్‌ల వద్ద అగ్నిగుండం నిర్వహించారు. ఉదయం ఆయా మకాన్లలోని పీర్లు, గుమ్మటాలను ఊరేగించారు.  ఈ సందర్భంగా రంపాడు వీధికి చెందిన ఎం. రామయ్య (72) అనే వృద్ధుడు పులి వేషధారణతో విన్యాసాలు ప్రదర్శిస్తూ ఆకట్టుకున్నారు. యువకులు ఆనందోత్సాహాలతో రంగులు చల్లుకున్నారు. పీర్లను చూసేందుకు అమ్మవారిశాల వీధిలో ని భవనాలపై మహిళలు, చిన్నారులు బారులుతీరారు. సీఐ రమేష్‌బాబు, ఎస్‌ఐ హరిప్రసాద్‌ గట్టి బందోబస్తును నిర్వహించారు. 

కొండాపురం: మండలంలోని పలు గ్రామాలలో మంగళవారం పీర్లను ఏటికి తీసుకెళ్లడంతో పండుగ ముగిసింది. కొండాపురం, చౌటిపల్లె తదితర గ్రామాల్లో ఊరేగింపుగా పీర్లను ఏటికి తీసుకెళ్లారు. మండలంలోని పలు గ్రామాల నుంచి పెద్దఎత్తున గూగూడుకు తరలివెళ్లారు.

ముద్దనూరు: స్థానిక పీర్ల చావిడిలో 9 రోజులుగా నిర్వహించిన మొహర్రం వేడుకలు మంగళవారం ముగిసాయి. సోమవారం రాత్రి గుండం కాల్చారు. మం గళవారం సాయంత్రం పీర్లను అంగరంగ వైభవంగా ఊరేగిస్తూ ఏటికి తరలిం చారు. భక్తులు భారీ సంఖ్యలో ఊరేగిం పులో పాల్గొన్నారు.  సీఐ మోహన్‌రెడ్డి బందోబస్తు ఏర్పాటు చేశారు.

దువ్వూరు:  దువ్వూరులోని బంగారు పీర్లు, బాదుల్లా పీర్లకు భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామంలో వాయిద్యాల మధ్య ఘనంగాఊరేగించారు. గుడిపాడు, చల్లబసాయిపల్లె, ఎర్రబల్లె, కానగూడూరు గ్రామాల్లో పీర్లను ఊరేగించారు. యువకులు ఉల్లాసంగా రంగులు చల్లుకున్నారు.

రాజుపాళెం:  టంగుటూరు, తొండలదిన్నె, గోపాయపల్లె, కొర్రపాడు గ్రామాల్లో పీర్ల పండుగను వైభవంగా నిర్వహిస్తున్నారు. టంగుటూరు తప్ప మిగతా గ్రామాల్లో పీర్లు ఏటికి పోవడంతో పండుగ ముగిసింది. మహిళలు పానకం, చక్కెర చదివింపులు చేశారు. 




Updated Date - 2022-08-10T04:50:21+05:30 IST