జన‘జాతర’

ABN , First Publish Date - 2022-05-26T06:41:28+05:30 IST

వందలు కాదు... వేలు కూడా కాదు... లక్షపైనే దాటి ఉంటుంది జనసమూహం. ఒక రాష్ట్రం కాదు... రెండు కూడా కాదు... ఏకంగా మూడు రాష్ట్రాల జనం. ఇసుక వేస్తే రాలలేదు. అడుగుతీసి అడుగు వేయడానికి వీలుకాలేదు. అయినా వెనుకడుగు వేయలేదు. భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూనే ఉన్నారు. దర్శనం చేసుకుని వెళ్లేవారు వారు వెళ్తూనే ఉన్నారు. ఖాళీ మాత్రం కాలేదుకుప్పంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ విశ్వరూప దర్శనమిస్తే, భక్తజనం ఆమెకు తమ భక్తి తీవ్రతను రుచిచూపారు.

జన‘జాతర’

వేలాదిగా తరలివచ్చిన మూడురాష్ట్రాల జనం


కిక్కిరిసిన కుప్పం పట్టణం


స్తంభించిన ట్రాఫిక్‌


వైభవోపేతం కుప్పం గంగమ్మ విశ్వరూపం


కుప్పం, మే 25: వందలు కాదు... వేలు కూడా కాదు... లక్షపైనే దాటి ఉంటుంది జనసమూహం. ఒక రాష్ట్రం కాదు... రెండు కూడా కాదు... ఏకంగా మూడు రాష్ట్రాల జనం. ఇసుక వేస్తే రాలలేదు. అడుగుతీసి అడుగు వేయడానికి వీలుకాలేదు. అయినా వెనుకడుగు వేయలేదు. భక్తులు తండోపతండాలుగా తరలి వస్తూనే ఉన్నారు. దర్శనం చేసుకుని వెళ్లేవారు వారు వెళ్తూనే ఉన్నారు. ఖాళీ మాత్రం కాలేదు కుప్పం. పోలీసులు ఎన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నా ట్రాఫిక్‌ కష్టాలు తప్పలేదు. కుప్పంలో వెలసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ విశ్వరూప దర్శనమిస్తే, భక్తజనం ఆమెకు తమ భక్తి తీవ్రతను రుచిచూపారు.


కుప్పం పట్టణంలో శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ విశ్వరూప దర్శన సంబరం బుధవారం అంగరంగ వైభవోపేతంగా జరిగింది. ఊరేగింపు పూర్తి చేసుకుని ఉదయం ఐదు గంటలకల్లా ఆలయం తిరిగి రావాల్సిన గంగ శిరస్సు, దాదాపు ఆరున్నర గంటలు ఆలస్యంగా 11 గంటలకు చేరింది. ఇక అక్కడినుంచి ఆ శిరస్సును మొండేనికి అమర్చి భక్తులకు దర్శనాలు ప్రారంభమయ్యేలోగా మధ్యాహ్నం పన్నెండు గంటలయింది. అప్పటికే క్యూలైన్లలో అసహనంతో వేగిపోతున్నారు భక్తజనం. అసలే ఉక్కపోత, ఆపైన మొక్కులు తీర్చుకోవడానికి వేసిన విచిత్ర వేషాల మోత. వేపచీరలు, తళతళలాడే వస్త్రాభరణాలు... రంగులు, కిరీటాలు, గదలు, శూలాలు... ఏవేవో వేషాలు. అలానే వచ్చేశారు భక్తులు. ఇక మహిళల సంగతి చెప్పనే అక్కరలేదు. తలలపై పిండిముద్దల తట్టలతో, చంకన నెలల పిల్లలతో, చిటికెన వేలు పట్టుకున్న చిన్నారులతో క్యూలైన్లలో చొరబడిపోయి ఉన్నారు. ఇక్కడ చూస్తే గంటలకు గంటలు ఆలస్యం. అమ్మవారి దర్శనం ప్రారంభమైన మరుక్షణంలో కిలోమీటరు పొడవున రోడ్డుమీద క్యూలైన్లలో నిలబడిపోయిన జనంలో కదలిక ప్రారంభమైంది. చూస్తుండగానే, తోపులాటలు, తొక్కిసలాటలు మొదలయ్యాయి. అయితే పోలీసులు ఇటువంటి పరిస్థితిని ముందుగానే ఊహించడంతో అప్రమత్తమయ్యారు. చిన్నపిల్లలు, ముసలివాళ్లు కొద్దిసేపు అష్టకష్టాలు పడినా, కాస్త అదుపులోకి వచ్చారు జనం.


ఇంటింటా జాతరే


గంగమ్మ ఆలయంవద్దే కాదు... ప్రతి ఇంట్లోనే జన జాతర కనిపించింది. రెండుమూడు రోజులముందుగానే దిగిపోనే బంధుమిత్రులతో కళకళాడాయి ఇళ్లు. షామియానాలు వేసి మరీ వారికి మాంసాహార వంటకాలు చేసి వడ్డించారు. అంతేకాదు... పొరుగు రాష్ట్రాలనుంచి వచ్చిన భక్తజనం పట్టణ శివారు ప్రాంతాల్లో ఎక్కడ ఖాళీ ప్రదేశముంటే అక్కడ దిగిపోయి అక్కడికక్కడే పొంగళ్లు పెట్టి, వంటకాలు సిద్ధంచేసి తోటి భక్తజనానికి వడ్డించారు. రైళ్లు, బస్సులు, ఆటోలు, ప్రైవేటు వాహనాలు... అన్నీ భక్తజనంతో నిండిపోయాయి. వచ్చేవాళ్లు వస్తూనే ఉన్నారు... వెళ్లేవాళ్లు వెళ్తూనే ఉన్నారు. ఈరోజు ఈ నిమిషంలో కనిపించిన వ్యక్తి, మరో నిమిషంలో కనిపించలేదు. ఎప్పటికప్పుడు కొత్తగా దూర ప్రాంతాలనుంచి జనం రాకపోకలు నిరంతరాయంగా జరుగుతూనే ఉన్నాయి.


అంబరాన్నంటిన పిల్లల సంబరం


జాతరంటే భక్తి పరవళ్లు... మొక్కుల ఉరవళ్లే కాదు... ఉరకల్లు కూడా. దేవుడిమీద భక్తి పెద్దలదైతే... బొమ్మలు, సర్కస్‌ ఆటలమీద దృష్టి పిల్లలది. నేతాజీరోడ్డు, ప్యాలస్‌ రోడ్డు మొత్తం బొమ్మల దుకాణాలు బారులు తీరాయి. ఆలయానికి ఎదురుగా ఉన్న మైదానంలో సర్కస్‌ కొలువుదీరింది. ప్రతి బొమ్మల దుకాణంలోనూ మారాం చేసే పిల్లలే. సర్కస్‌లోని ఆటల దగ్గరంతా వారి ఉరుకులు పరుగులే. అమ్మ చెంగు పట్టుకుని బొమ్మకోసం వేధించే చిన్నారి ఒకరైతే... బండ్లమీద అమ్మే తీపి మిఠాయికోసం మారాం చేసే పిల్ల మరొకతె. కసురు కుంటూనే అమ్మలు వారి కోర్కెలు తీర్చారు. వారు కాదంటే నాన్నల భుజాలమీదెక్కి జుట్టు పీకి పందిరివేసి మరీ... కోరిన కోర్కెలు తీర్చుకున్నారు పిల్లలు.


తరలొచ్చిన పల్లె


కుప్పం ఓ మోస్తరు పట్టణం. ఇక్కడ ఆధునికతా హంగులు... ఫ్యాషన్‌ పొంగులు కనిపించడం ఎక్కువ. అయితే కుప్పం గంగ జాతర సందర్భంగా కుప్పం పట్టణం పల్లె సోకులు సంతరించుకుంది. భుజంమీద పిల్లలు... చేతిలో గుడ్డ సంచీలు... కొప్పులో ముద్దబంతి పువ్వులు... మోములపై అమాయకపు నవ్వులు... స్వచ్ఛమైన పల్లె సౌందర్యం పల్లవించింది. రంగురంగుల రిబ్బన్లు... పెద్దపెద్ద పక్కపిన్నులు... గలగలలాడే గాజులు కొనుగోలు చేశారు పల్లెజనం. వేపచీరలు ధరించి, బొగ్గు, కుంకుమ బొట్లు ముఖాల దిద్దుకుని, పిండి ముద్దల తట్టలు తలలపై పెట్టుకుని తరలివచ్చారు. రాళ్లపొయ్యిలపై పొంగళ్లు ఉడికించి అమ్మవారికి నైవేద్యాలు పెట్టారు. సంప్రదాయబద్ధంగా కోళ్లను, పొట్టేళ్లు. మేకపోతులు, గొర్రెలను బలిచ్చి ఆదిమ సమాజ భక్తిని చాటుకున్నారు. నుదుటున రూపాయికాసంత అమ్మవారి కుంకుమలు దిద్దుకున్నారు. పూనకాలతో ఊగిపోతూ... పసునీళ్లతో ఉపశమిస్తూ స్వచ్ఛమైన భక్తిభావనలో మునిగితేలారు.


న భూతో


జనమేజనం... ఇసుక రాలనంత జనం. ధన ప్రాణాలను హరించిన కరోనా కుప్పం గంగ జాతరను కూడా హైజాక్‌ చేసింది. వరుసగా రెండేళ్లపాటు సంబరాలే జరగకుండా నిర్బంధం విధించింది. ఎప్పటెప్పటివో మొక్కులు అలాగే నిలిచిపోయాయి. ఎప్పుడెప్పుడు గంగ జాతర జరుగుతందా... పెండింగులో ఉన్న మొక్కులన్నింటినీ చెల్లించేసుకుని ఆయమ్మ బాకీ తీర్చేసుకుందామా అని మూడు రాష్ట్రాల జనం వేచి వేసారి పోయింది. అదిగో... జరిగ్గా అటువంటి వేళ వచ్చిన జాతర ఇది. ఇక జనం ఊరుకుంటారా. గడిచిపోయిన రెండేళ్లతోపాటు, తాజా ఏడాది కూడా మొక్కిన మక్కుల భారంతో తరలివచ్చారు తండోపతండాలుగా. సాధారణంగా జరిగేజాతర కంటే మూడు రెట్ల జనం ఎక్కువైపోయారు అందుకనే. కుప్పం పట్టణంలో ఇటు చూసినా జనమే. పరిసర పల్లెల్లో సైతం జనమే జనం. అమ్మవారి విశ్వరూప దర్శనం సందర్భంగా జనం కూడా తమ విశ్వరూపం ప్రదర్శించేశారు.


స్తంభించిన ట్రాఫిక్‌


సాధారణ జాతరకంటే ఈసారి జాతరకు మూడురెట్ల జనం అధికం కావడంతో అదే స్థాయిలో వాహనాల రాకపోకలు పెరిగిపోయాయి. పోలీసులు పట్టణంలో ఎక్కడిక్కడ బ్యారికేడ్లను ఏర్పాటు చేసి జనాన్ని కొంచెం నియంత్రించగలిగారు కానీ, బైపాస్‌ మార్గంలో వాహనాల రాకపోకలను అదుపు చేయలేక చేతులెత్తేశారు. అప్పటికీ అమ్మవారి శిరస్సు ఊరేగింపు సందర్భంగా జిల్లా ఎస్పీ రిషాంత్‌రెడ్డి కుప్పం వచ్చి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. అయినా లాభంలేకపోయింది. ఒక దశలో కుప్పం బైపాస్‌ ఓవర్‌ బ్రిడ్జితోపాటు అటూ ఇటూ రెండుమూడు కిలోమీటర్ల మేర ఎక్కడి ట్రాఫిక్‌ అక్కడ స్తంభించిపోయింది. మధ్యాహ్నం లోగానే రెండుమూడు సార్లు గంటా గంటన్నరపాటు ఎక్కడివాహనాలు అక్కడే నిలబడిపోయాయి. పోలీసులు నానాతంటాలు పడి క్లియర్‌ చేసినా, రాత్రి పొద్దుపోయేదాకా ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతూనే ఉంది.

Updated Date - 2022-05-26T06:41:28+05:30 IST