జన్ కీ బాత్

ABN , First Publish Date - 2020-12-29T09:15:44+05:30 IST

గడ్డకట్టే చలిలో ఢిల్లీ వీధుల్లో రైతులు బైఠాయింపు మొదలుపెట్టి నెలరోజులు దాటింది. ఏలికలకు ఇప్పుడిప్పుడే వేడి తెలిసివస్తున్నది....

జన్ కీ బాత్

గడ్డకట్టే చలిలో ఢిల్లీ వీధుల్లో రైతులు బైఠాయింపు మొదలుపెట్టి నెలరోజులు దాటింది. ఏలికలకు ఇప్పుడిప్పుడే వేడి తెలిసివస్తున్నది. ఆ ఒక్కటి తప్ప ఏవైనా అడగమన్నట్టు- చట్టాల రద్దు మాత్రం చర్చించవద్దు అంటున్నది ప్రభుత్వం. పోనీ మద్దతు ధరను చట్టంలోకి తీసుకురమ్మని రైతులు అడుగుతున్నారు. వీరికి ఇంత తెలివితేటలు, ఇంతటి నిబ్బరం, ధైర్యం ఎట్లా వచ్చాయి అని ఒక వంక ఆశ్చర్యపోతూనే, వారి లోపల విభజన ఎట్లా సృష్టించాలా అని పెద్దమనుషులు ప్రయత్నాలు చేస్తున్నారని వింటున్నాము. ప్రజల గుండెల్లోంచి రగిలి పొగిలే ఇటువంటి ఉద్యమాలు సృజనాత్మకంగా ఉంటాయి, అనూహ్యమైన ఆలోచనలతో ఎదుటి పక్షాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. సంభాషణలకు ఆస్కారం లేకుండా, ఏకపక్షంగా సాగే ప్రధాని నెలవారీ ప్రసంగపు వేళ, రేకుడబ్బాల మోత లతో అసమ్మతి తెలపడం ఆ సృజనాత్మకతలో భాగమే.


రైతులపక్కన నిలబడకపోతే, భవిష్యత్తు ఉండదని గ్రహించి, అకాలీదళ్ మొదటి దశలోనే ఎన్‌డిఎ నుంచి వైదొలగింది. ఇప్పుడు హర్యానాలో ఖట్టర్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తూ ఉపముఖ్యమంత్రిగా ఉన్న దుష్యంత్ చౌటాలా మీద ఒత్తిడి పెరుగుతున్నది. జన్ నాయక్ జనతాపార్టీ నేత అయిన చౌటాలా ఇంకా హర్యానా ప్రభుత్వంలో కొనసాగితే, రాజకీయంగా తీవ్రంగా నష్టపోయే పరిస్థితి నెలకొంటున్నది. మహారాష్ట్ర నుంచి, దక్షిణాది నుంచి రైతులకు సంఘీభావం క్రమంగా  పెరుగుతున్నది. వ్యవసాయ చట్టాల పరోక్ష, దీర్ఘకాలిక పర్యవసానాలపై విస్తృతంగా చర్చ జరుగుతున్నది, క్రమంగా అందరికీ తెలిసివస్తున్నది. 


రైతుల ఉద్యమానికి కారకులుగా ప్రతిపక్షాలను నిందిస్తున్నారు అధికారపార్టీ నేతలు. అంతకంటె అన్యాయం ఇంకొకటి లేదు. ఇటువంటి దృఢమైన ఉద్యమాన్ని నిర్మించే శక్తి, చిత్తశుద్ధి ఏ ఒక్క రాజకీయపార్టీకి లేదు. పైగా, రైతుల ఉద్యమం నుంచి ప్రేరణ పొంది తమ వెన్నెముకలను ప్రతిపక్షాలు సవరించుకుంటున్నాయి. కశ్మీర్ స్థానిక ఎన్నికలలో ప్రతిపక్షాల కూటమి విజయం సాధిం చడం, కట్టుబాటు, పట్టుదల సడలకుండా రైతులు ఉద్య మించడం వివిధ పక్షాలు గొంతు విప్పడానికి శక్తినిస్తు న్నాయి. యుపిఎ నాయకత్వంలో దేశంలోని ప్రతిపక్షాలన్నీ ఏకం కావాలని శివసేన పిలుపు నిచ్చింది. యుపిఎ నాయకత్వానికి శరద్ పవార్‌ను ప్రతిపాదించడం కొందరికి నచ్చలేదు కానీ, యుపిఎలో ఇప్పటిదాకా భాగస్వామి కాని, పైగా ఇటీవలిదాకా బిజెపికి తోడుగా ఉన్న శివసేన నుంచి అటువంటి ఆకాంక్ష వ్యక్తం కావడం విశేషమే. ఒకపక్క సంస్థాగత ఎన్నికల హడావుడి ప్రారంభమవుతున్నవేళ, పార్టీ 136వ వ్యవస్థాపన దినోత్సవం జరుగుతున్న సందర్భంలో, నూతన సంవత్సరం వేడుకల కోసం ఇటలీవెళ్లిన రాహుల్ గాంధీ యుపిఎకు నమ్మదగిన నాయకత్వం ఇవ్వలేరని ఎవరికైనా అనిపిస్తే తప్పులేదు. శరద్‌ పవార్ వంటి ప్రత్యామ్నాయాలను ఆలోచిస్తే తప్పేమిటి? శివసేనతో కలిసి శరద్ పవార్ కేంద్ర ప్రభుత్వం దూకుడును కనీసం మహారాష్ట్ర వరకు నిరోధించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ పాటి చొరవ కాంగ్రెస్ నేతలలో ఎక్కడ? సహకార బ్యాంకు కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ శివసేన ఎంపీ సంజయ్ రౌత్ భార్యకు సమన్లు పంపిందంటే, మహారాష్ట్రలో వైరిశిబిరాల మధ్య గీతలు స్పష్టమయినట్టేనని పరిశీలకులు అంటున్నారు. అంత ఒత్తిడిలోనూ జాతీయ కూటమి గురించి ఒక ప్రాంతీయ పార్టీ మాట్లాడుతున్నప్పుడు, జాతీయ ప్రతిపక్షాలకు ఎందుకు ఉదాసీనత? 


భారతీయ జనతాపార్టీతో నేరుగా, చాటుగా స్నేహం నెరుపుతున్నవారిలో కూడా కొత్త ధైర్యాలు కనిపించడానికి కారణం, దేశంలో కనిపిస్తున్న ధిక్కార వాతావరణమే కావచ్చును. లవ్ జిహాద్ చట్టాల విషయంలో బిజెపితో విభేదిస్తున్నట్టు, బిహార్ ఉమ్మడి ప్రభుత్వంలోని భాగస్వామ్య పార్టీ జనతాదళ్ యునైటెడ్ బాహాటంగానే ప్రకటించింది. దేశంలోని అనేక న్యాయస్థానాలలో ఆశించిన న్యాయం ఆశించిన వేగంతో లభించడం లేదని, ప్రభుత్వ నిర్ణయాల మంచిచెడ్డల నిర్ధారణలో ఆలస్యం రాజ్యాంగ వ్యతిరేక శక్తులకు చేయూత ఇస్తున్నదని కలవరం కలుగుతున్న రోజులలో నిలకడగా సాహసోపేతమైన ఆదేశాలిస్తున్న అలహాబాద్ హైకోర్టు, ఒక వయోజన మతాంతర ప్రేమజంటను కలపడానికి యువకుడి మీద పెట్టిన కిడ్నాప్ కేసును కొట్టివేసింది. బిజెపి ఆశీస్సులతో మాత్రమే తమిళనాడు ప్రభుత్వం సజావుగా కొనసాగుతున్నదని, అన్నాడిఎంకె నేతలు ఐక్యంగా కనిపించడానికి, పాలన సజావుగా జరపడానికి కేంద్రం వెన్నుదన్ను ఉన్నదని అంతా భావిస్తున్నారు. రాబోయే ఎన్నికలలో అన్నాడిఎంకెతో పాటు మరికొన్ని పార్టీలకు కూడా ప్రత్యక్ష, పరోక్ష సహాయాన్ని బిజెపి అందించవచ్చునని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ తరుణంలో, తాము ఏ పార్టీతోనూ అధికారాన్ని పంచుకోబోమని, ముఖ్యంగా జాతీయ పార్టీలు ఈ విషయాన్ని గుర్తెరగాలని అన్నాడిఎంకె కీలకనేత ఒకరు స్పష్టం చేశారు. తమ నాయకుడు ఎడప్పాడి పళనిస్వామేనని, మరెవరో నాయకుడిని తమ పార్టీ మీద రుద్దే ప్రయత్నాలు చేయవద్దని ఆ నాయకుడు నర్మగర్భంగా సూచించారు.


రకరకాల కారణాల వల్ల ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు కేంద్రంతో, అక్కడ ప్రభుత్వంలో ఉన్న పార్టీతో సఖ్యతగా మెలగే ప్రయత్నం చేస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి అయితే, ఫెడరల్ ఫ్రంట్ అనీ, మరేదో అనీ నామకరణాలు కూడా చేశారు. నిజమైన ప్రత్యామ్నాయాలు ధైర్యంగా వ్యవహరించే శక్తుల నుంచే పుట్టుకు వస్తాయి. అవకాశవాద డాంబికాల నుంచి రావు.

Updated Date - 2020-12-29T09:15:44+05:30 IST