బంగ్లాదేశ్‌లో కోమాలో జమ్మూకశ్మీర్ వైద్య విద్యార్థి.. వాయుమార్గంలో ఎయిమ్స్‌కు తరలిస్తామన్న బీజేపీ నేత

ABN , First Publish Date - 2022-06-13T22:18:11+05:30 IST

బంగ్లాదేశ్‌లో వైద్య విద్య అభ్యసిస్తూ ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోయిన జమ్మూకశ్మీర్‌కు చెందిన విద్యార్థి కుటుంబానికి ఆ రాష్ట్ర

బంగ్లాదేశ్‌లో కోమాలో జమ్మూకశ్మీర్ వైద్య విద్యార్థి.. వాయుమార్గంలో ఎయిమ్స్‌కు తరలిస్తామన్న బీజేపీ నేత

జమ్మూ: బంగ్లాదేశ్‌లో వైద్య విద్య అభ్యసిస్తూ ప్రమాదానికి గురై కోమాలోకి వెళ్లిపోయిన జమ్మూకశ్మీర్‌కు చెందిన విద్యార్థి కుటుంబానికి ఆ రాష్ట్ర బీజేపీ చీఫ్ రవీందర్ రైనా అభయమిచ్చారు. మరింత మెరుగైన చికిత్స కోసం బంగ్లాదేశ్ నుంచి ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలిస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు సంబంధించి ప్రయత్నాలు జరుగుతున్నట్టు చెప్పారు. 


రాజౌరి జిల్లాకు చెందిన షోయబ్ లోనే ఢాకాలోని బరింద్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చివరి సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 3న జరిగిన ప్రమాదంలో లోనేతోపాటు అతడి ఇద్దరి క్లాస్‌మేట్స్ తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు మరణించగా, మిగతా ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. తాజాగా, రాజౌరిని సందర్శించిన రవీందర్ రైనా.. లోనే తండ్రి మహమ్మద్ అస్కామ్ లోనేను కలిశారు. తనకు విషయం తెలిసిన వెంటనే ప్రధానమంత్రి కార్యాలయానికి సమాచారం అందించి సాయం కోరానని రైనా పేర్కొన్నారు. లోనే కోమాలో ఉన్నాడని, అతడి తల్లిదండ్రులు సాయాన్ని అర్థిస్తున్నారని చెప్పానని పేర్కొన్నారు. 


పీఎంవో తన నుంచి వివరాలు తీసుకుందని, ప్రధానమంత్రి స్వయంగా బంగ్లాదేశ్‌లోని భారత రాయబారికి ఫోన్ చేసి విద్యార్థి కుటుంబానికి అవసరమైన సాయం అందించాల్సిందిగా ఆదేశించారని తెలిపారు. ప్రధానమంత్రి ఆదేశాలతో విద్యార్థి చికిత్స పొందుతున్న ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రి సందర్శించి వివరాలు తెలుసుకున్నట్టు రైనా చెప్పారు. విద్యార్థి విషయంలో వేగంగా స్పందించినందుకు ప్రధానమంత్రి మోదీకి రైనా కృతజ్ఞతలు తెలియజేశారు.


ఢాకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థిని వాయుమార్గంలో ఢిల్లీ లోని ఎయిమ్స్‌కు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. చికిత్సకయ్యే ఖర్చును ప్రభుత్వం భరిస్తుందని హామీ ఇచ్చారు. జమ్మూకశ్మీర్ ప్రభుత్వంలో క్లాస్ 4 ఉద్యోగి అయిన షోయబ్ తండ్రి కుమారుడి చికిత్స కోసం ఎలాగోలా ఇప్పటి వరకు రూ. 10 లక్షలు పోగు చేసినప్పటికీ అవన్నీ చికిత్సకే అయిపోయాని ఆవేదన వ్యక్తం చేశారు. 

Updated Date - 2022-06-13T22:18:11+05:30 IST