కశ్మీరీ యువతతో చర్చిస్తాం

ABN , First Publish Date - 2021-10-26T08:05:13+05:30 IST

పాకిస్థాన్‌తో చర్చలు జరపాలన్న జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా సూచనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మండిపడ్డారు.

కశ్మీరీ యువతతో చర్చిస్తాం

అమిత్‌ షా స్పష్టీకరణ..

పాక్‌తో చర్చలపై ఫరూక్‌ డిమాండ్‌కు నో


శ్రీనగర్‌, అక్టోబరు 25: పాకిస్థాన్‌తో చర్చలు జరపాలన్న జమ్ము కశ్మీర్‌ మాజీ సీఎం ఫరూక్‌ అబ్దుల్లా సూచనపై కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా మండిపడ్డారు. కశ్మీరీ యువత, కశ్మీరు లోయ ప్రజలతో మాత్రమే చర్చిస్తామని.. జమ్మూ కశ్మీరును దేశంలోనే పురోగామి రాష్ట్రంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. కశ్మీర్‌ పర్యటనలో ఉన్న అమిత్‌షా.. సోమవారం అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించారు. శ్రీనగర్‌లోని షేర్‌-ఎ-కశ్మీర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగిన సభలో మాట్లాడారు. ముందుగా వేదికపై ఏర్పాటు చేసిన బుల్లెట్‌ప్రూఫ్‌ కవచాన్ని తొలగించాలని ఆదేశించారు. ‘ఇవాళ మీతో నిష్కపటంగా మాట్లాడాలని అనుకుంటున్నాను.


అందుకే బుల్లెట్‌ప్రూఫ్‌ కవచం గానీ, భద్రత గానీ లేవు. మీ ముందు (సంప్రదాయ కశ్మీరీ వస్త్రధారణతో) ఇలా నిలబడ్డాను. కశ్మీరు, జమ్ము, లద్దాఖ్‌ను అభివృద్ధి పథంలో నిలపాలన్న ఉద్దేశంతోనే 370 అధికరణను రద్దు చేశాం. 2024కల్లా మా కృషి ఫలాలను చూస్తారు. పాక్‌తో, వేర్పాటు వాదులతో చర్చించాలంటున్నవాళ్లను.. పీవోకేలో పాక్‌ ఏం చేసిందో అడగాలి. పీవోకేలో కరెంటు, రోడ్లు, ఆస్పత్రులు, మరుగుదొడ్లు ఉన్నాయా? ఇక్కడ మీకు (కశ్మీరీ యువత) మిగతా భారతీయుల్లాగా సమాన హక్కులు ఉన్నాయి. వైద్యం చదవడానికి మీరు పాకిస్థాన్‌ వెళ్లాల్సిన అవసరం లేదు. కశ్మీరును పాలించిన మూడు కుటుంబాలు (కాంగ్రెస్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, పీపుల్స్‌ డెమోక్రాటిక్‌ పార్టీ) మూడు వైద్య కళాశాలలను ఏర్పాటుచేస్తే.. ప్రధాని మోదీ ఏడు  మంజూరుచేశారు’ అని తెలిపారు. ‘కశ్మీర్లో హింసాకాండకు 40 వేల మంది బలయ్యారు. దీనిని ఇక ఆపేయాలి’ అని పేర్కొన్నారు. కశ్మీరీ యువతకు రెండేళ్లలో 20 వేల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించామన్నారు. 

Updated Date - 2021-10-26T08:05:13+05:30 IST