జమ్మూ-కశ్మీరు : భయానక ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

ABN , First Publish Date - 2021-07-31T19:34:25+05:30 IST

జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదంపై భద్రతా దళాలు గొప్ప విజయం సాధించాయి

జమ్మూ-కశ్మీరు : భయానక ఉగ్రవాదిని మట్టుబెట్టిన భద్రతా దళాలు

న్యూఢిల్లీ : జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదంపై భద్రతా దళాలు గొప్ప విజయం సాధించాయి. అత్యంత భయానక ఉగ్రవాది ఇస్మాయిల్ భాయ్ వురపు లంబును శనివారం మట్టుబెట్టాయి. లంబు నుంచి ఓ ఏకే-47 రైఫిల్, ఓ ఎం-4 రైఫిల్ స్వాధీనం చేసుకున్నారు. 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలో సీఆర్‌పీఎఫ్ కాన్వాయ్‌పై జరిగిన ఆత్మాహుతి దాడి కోసం ఇంప్రొవైజ్డ్ ఎక్స్‌ప్లొజివ్ డివైస్ (ఈఐడీ)ని లంబు తయారు చేశాడని తెలుస్తోంది. 


కశ్మీరు ఐజీపీ విజయ్ కుమార్ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ, జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన అత్యున్నత స్థాయి పాకిస్థానీ ఉగ్రవాది లంబూ ఎన్‌కౌంటర్‌లో మరణించినట్లు ధ్రువీకరించారు. ఈ ఎన్‌కౌంటర్‌లో మరొక ఉగ్రవాది కూడా మరణించాడని, అతని వివరాలను ఇంకా తెలుసుకోవలసి ఉందని చెప్పారు. 


విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, లంబు 2018 డిసెంబరులో కశ్మీరులో ప్రవేశించాడు. పుల్వామాలోని ట్రాల్ ప్రాంతంలో లంబు సంచరిస్తున్నట్లు భద్రతా దళాలు గుర్తించాయి. శ్రీనగర్ నుంచి 46 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతంలో ఉగ్రవాదం ప్రభావం తీవ్రంగా ఉంటుంది. 


మరణించిన ఉగ్రవాది ఇస్మాయిల్ భాయ్‌ ఎత్తు ఆరున్నర అడుగులు కావడంతో అతనిని తోటి ఉగ్రవాదులు లంబు అని పిలుస్తారని అధికారులు చెప్పారు. ఇతనిని మోనికర్ ఫౌజీ బాబా అని కూడా పిలుస్తారని చెప్పారు. 


జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ నెట్‌వర్క్ కశ్మీరులో బలహీనపడుతోందని, దీనిని బలోపేతం చేయడానికి లంబును  ఆ ఉగ్రవాద సంస్థ కశ్మీరుకు పంపించినట్లు తెలుస్తోంది. ఐఈడీలను తయారు చేయడంతోపాటు కొత్త ఉగ్రవాదులను చేర్చుకోవడం కోసం ఇతనిని పంపించినట్లు సమాచారం. ఆత్మాహుతి దాడులకు పాల్పడేవిధంగా యువతకు బ్రెయిన్‌వాష్ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. 


Updated Date - 2021-07-31T19:34:25+05:30 IST