Jammu and Kashmir: ఇది చరిత్రాత్మక దినం : లెఫ్టినెంట్ గవర్నర్

ABN , First Publish Date - 2022-09-18T21:44:11+05:30 IST

జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు

Jammu and Kashmir: ఇది చరిత్రాత్మక దినం : లెఫ్టినెంట్ గవర్నర్

శ్రీనగర్ : జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతంలో నెమ్మదిగా సాధారణ పరిస్థితులు నెలకొంటున్నట్లు కనిపిస్తోంది. శ్రీనగర్, పుల్వామా, షోపియాన్‌లలో మళ్లీ సినిమా థియేటర్లు పని చేయడం ప్రారంభమవుతోంది. కొత్తగా నిర్మితమవుతున్న థియేటర్ ప్రాంగణాల్లో వినోదంతోపాటు, నైపుణ్య శిక్షణ వంటి ఇతర అంశాలు కూడా ఉంటాయి. 2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీరును రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన సంగతి తెలిసిందే. 


శ్రీనగర్‌లో నిర్మితమవుతున్న మల్లిప్లెక్స్ వచ్చే నెలలో ప్రారంభమయ్యే అవకాశం ఉంది. అయితే పుల్వామా, షోపియాన్లలోని సినిమాహాళ్ల ప్రారంభం సందర్భంగా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా  ఆదివారం ట్విటర్ వేదికగా హర్షం వ్యక్తం చేశారు. ఇది చరిత్రాత్మక దినమని తెలిపారు. సినిమా హాళ్ళ ప్రారంభానికి సంబందించిన ఫొటోలను షేర్ చేశారు. 


బాలీవుడ్ చిత్రం ‘భాగ్ మిల్కా భాగ్’ను మనోజ్ సిన్హా వీక్షించారు. ‘‘జమ్మూ-కశ్మీరు కేంద్ర పాలిత ప్రాంతానికి ఇది చరిత్రాత్మక దినం! పుల్వామా, షోపియాన్లలో మల్టీపర్పస్ సినిమా హాల్స్‌ను ప్రారంభించాను. ఇక్కడ మూవీ స్క్రీనింగ్, ఇన్ఫోటెయిన్‌మెంట్, యువతకు నైపుణ్య శిక్షణ వంటి సదుపాయాలు ఉన్నాయి’’ అని సిన్హా కార్యాలయం ఇచ్చిన ట్వీట్‌లో పేర్కొంది. 


జమ్మూ-కశ్మీరులో ఉగ్రవాదం పెచ్చరిల్లడంతో 1990వ దశకం ప్రారంభం నుంచి సినిమా హాళ్లు మూతపడ్డాయి. సుమారు 10 సినిమా హాళ్ళు ఉండేవి, కానీ వాటి యజమానులకు ఉగ్రవాదుల నుంచి బెదిరింపులు వచ్చేవి. శ్రీనగర్ నడిబొడ్డున ఉన్న రీగల్ సినిమా థియేటర్‌పై 1999లో గ్రెనేడ్ దాడి జరిగింది. దీంతో వాటిని మూసేశారు. కొన్ని థియేటర్లను పునఃప్రారంభించడానికి చేసిన ప్రయత్నాలు అప్పట్లో సఫలం కాలేదు.


జమ్మూ-కశ్మీరుకు ప్రత్యేక ప్రతిపత్తిని తొలగిస్తూ, 2019 ఆగస్టు 5న భారత రాజ్యాంగంలోని అధికరణ 370ని రద్దు చేశారు. ఆ తర్వాత వివిధ రంగాల్లో అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేశారు. ఈ కేంద్ర పాలిత ప్రాంతాన్ని సినీ నిర్మాణం, చిత్రీకరణలకు గమ్యస్థానంగా తీర్చిదిద్దడానికి కృషి జరుగుతోంది. జమ్మూ-కశ్మీరు ఫిలిం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కృషితో సినిమాల ప్రదర్శనతోపాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను కూడా ప్రజలకు అందజేయడం కోసం మల్టీపర్పస్ హాల్స్‌ను నిర్మిస్తున్నారు. 


Updated Date - 2022-09-18T21:44:11+05:30 IST