Uttar Pradesh: కూల్చివేతలను ఆపండి... సుప్రీంకోర్టుకు జామియా ఉలేమా ఈ హింద్...

ABN , First Publish Date - 2022-06-14T22:22:46+05:30 IST

అల్లర్ల కేసుల్లో నిందితుల ఇళ్ళను కూల్చేయడాన్ని ఆపాలని జామియా

Uttar Pradesh: కూల్చివేతలను ఆపండి... సుప్రీంకోర్టుకు జామియా ఉలేమా ఈ హింద్...

న్యూఢిల్లీ : అల్లర్ల కేసుల్లో నిందితుల ఇళ్ళను కూల్చేయడాన్ని ఆపాలని జామియా ఉలేమా ఈ హింద్ సుప్రీంకోర్టును కోరింది. మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలపై నిరసనగా జరిగిన హింసాకాండలో ప్రధాన నిందితుడు మహమ్మద్ జావేద్ ఇంటిని ఉత్తర ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో కూల్చేసిన నేపథ్యంలో ఈ పిటిషన్‌ను సోమవారం దాఖలు చేసింది. కాన్పూరులో ఇటువంటి కూల్చివేతలు జరగకుండా నిలిపేయాలని కోరింది. 


ప్రయాగ్‌రాజ్ (Prayagraj) అభివృద్ధి సంస్థ ఆదివారం మహమ్మద్ జావేద్ (Muhammad Jawed) ఇంటిని కూల్చేసింది. ఆయన భవన నిర్మాణ నిబంధనలను ఉల్లంఘించి, ఈ ఇంటిని నిర్మించారని ఆరోపించింది. అయితే ఆయన జూన్ 10న ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన హింసాకాండకు ప్రధాన కుట్రదారుల్లో ఒకరని పోలీసులు కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. నూపుర్ శర్మ (Nupur Sharma) వ్యాఖ్యల నేపథ్యంలో శుక్రవారం ప్రార్థనల అనంతరం ఈ హింసాకాండ జరిగింది. 


ఢిల్లీలోని జహంగీర్‌పురిలో అక్రమ నిర్మాణాల కూల్చివేతలను సుప్రీంకోర్టు (Supreme Court) ఏప్రిల్‌లో నిలిపేసింది. ఈ పెండింగ్ వ్యాజ్యంలో తాజా పిటిషన్‌ను జామియా సోమవారం దాఖలు చేసింది. కాన్పూరులో జరిగిన హింసాకాండ నేపథ్యంలో కొందరు అధికారులు మీడియాతో మాట్లాడుతూ, నిందితులు, అనుమానితుల ఆస్తులను జప్తు చేస్తామని, కూల్చేస్తామని చెప్పారని పేర్కొంది. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ (Yogi Adityanath) కూడా నిందితుల ఇళ్ళను బుల్డోజర్లతో కూల్చేస్తామని మీడియాలో చెప్పారని పేర్కొంది. పోలీసు ఉన్నతాధికారులు కూడా ఇదేవిధంగా హెచ్చరించారని తెలిపింది. 


చట్టానికి అతీతంగా చేపట్టే ఇటువంటి చర్యలు సహజ న్యాయసూత్రాలను ఉల్లంఘించడమేనని తెలిపింది. జహంగీర్‌పురి కేసును విచారిస్తుండగా ఇలా జరగడం మరీ ముఖ్యమైన విషయమని పేర్కొంది. ఏదైనా నేరారోపణను ఎదుర్కొంటున్న నిందితులపై చట్టానికి అతీతంగా దండన చర్యగా వారి నివాస లేదా వ్యాపార ఆస్తులపై కాన్పూరు జిల్లాలో ఆత్రుతగా ఎటువంటి చర్యలు చేపట్టకుండా ఉత్తర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరింది. ఏ స్వభావంగల కూల్చివేత ప్రక్రియనైనా సంబంధిత చట్టాలకు అనుగుణంగా మాత్రమే నిర్వహించే విధంగా ఆదేశించాలని కోరింది. సముచితరీతిలో ముందుగా నోటీసు ఇచ్చి, ప్రభావిత వ్యక్తుల్లో ప్రతి ఒక్కరినీ తగిన రీతిలో విచారించి, వారి వాదనలు విన్న తర్వాత మాత్రమే చర్యలు తీసుకునే విధంగా ఆదేశించాలని కోరింది. 


ఢిల్లీలోని జహంగీర్‌పురి కేసులో సుప్రీంకోర్టు గంపగుత్తగా కూల్చివేతలను నిలిపేసేందుకు అంగీకరించలేదు. 


Updated Date - 2022-06-14T22:22:46+05:30 IST