సింగపూర్‌లోని ఖరీదైన ‘సూపర్ పెంట్‌హౌస్‌’ను అమ్మేస్తున్న జేమ్స్

ABN , First Publish Date - 2020-10-20T01:59:29+05:30 IST

బ్యాగ్‌లెస్ వ్యాక్యూమ్ క్లీనర్‌ ఆవిష్కర్త, బ్రిటిష్ బిలియనీర్ జేమ్స్ డైసన్, ఆయన భార్య కలిసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్‌లోని అత్యంత ఎత్తైన భవనంలో దాదాపు

సింగపూర్‌లోని ఖరీదైన ‘సూపర్ పెంట్‌హౌస్‌’ను అమ్మేస్తున్న జేమ్స్

సింగపూర్: బ్యాగ్‌లెస్ వ్యాక్యూమ్ క్లీనర్‌ ఆవిష్కర్త, బ్రిటిష్ బిలియనీర్ జేమ్స్ డైసన్, ఆయన భార్య కలిసి సంచలన నిర్ణయం తీసుకున్నారు. సింగపూర్‌లోని అత్యంత ఎత్తైన భవనంలో దాదాపు ఏడాది క్రితం కొనుగోలు చేసిన అత్యంత ఖరీదైన పెంట్‌హౌస్‌ను అమ్మేస్తున్నారు. సింగపూర్‌లోనే అత్యంత ఎత్తైన టాన్‌జోంగ్ పేజర్ సెంటర్‌‌పైన ఉన్న ఈ మూడంతస్తుల సూపర్ పెంట్‌హౌస్‌ను అప్పట్లో 74 సింగపూర్ మిలియన్ డాలర్ల (54 మిలియన్ డాలర్లు)కు కొనుగోలు చేశారు. ఐదు బెడ్‌రూములు కలిగిన పెంట్‌హౌస్‌లో 600 బాటిళ్లు కలిగిన వైన్ సెల్లార్ ఉండడం విశేషం.


ప్రస్తుతం ఈ పెంట్‌హౌస్‌ను 62 సింగపూర్ మిలియన్ డాలర్లకు విక్రయిస్తున్నట్టు డైసన్ సంస్థ అధికార ప్రతినిధి తెలిపారు. కొనుగోలు చేసిన ధరతో పోలిస్తే ఇది 15 శాతం కంటే తక్కువ. ఈ అపార్ట్‌మెంట్‌లో పూల్, జాకూజీ, నగరాన్ని వీక్షించేందుకు ప్రైవేటు గార్డెన్ ఉన్నాయి. ఒకప్పుడు ఈ సూపర్ పెంట్‌హౌస్ 100 సింగపూర్ మిలియన్ డాలర్లు పలికింది. ఇప్పుడీ పెంట్‌హౌస్‌ను జన్మతః ఇండోనేసియాకు చెందిన బిజినెస్ టైకూన్ లియో కోగౌన్ సొంతం చేసుకోబోతున్నాడు. ఇన్ఫోటెక్ ప్రొవైడర్ అయిన ఎస్‌హెచ్ఐ ఇంటర్నేషనల్‌కు లియో చైర్మన్‌గా ఉన్నాడు. ఈ సంస్థకు ఆయన సహ వ్యవస్థాపకుడు కూడా.


సూపర్ పెంట్‌హౌస్‌ను విక్రయించిన డైసన్‌కు సింగపూర్‌లో మరో విలాసవంతమైన ప్లాట్ ఉంది. ఇందులోనూ పూల్, ఇండోర్ వాటర్ ఫాల్ ఉంది. వేగంగా విస్తరిస్తున్న మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని డైసన్ తన ప్రధాన కార్యాలయాన్ని బ్రిటన్ నుంచి సింగపూర్‌కు తరలించాడు. సింగపూర్‌లో ఎలక్ట్రిక్ కారు తయారు చేయాలన్న ప్రణాళికను ఏడాది క్రితం అటకెక్కించాడు. వాణిజ్యపరంగా అది అంత విజయం సాధించకపోవచ్చన్న ఆలోచనతో దానిని పక్కనపెట్టాడు. ప్రస్తుతం రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌పైనే దృష్టిసారించాడు. 

Updated Date - 2020-10-20T01:59:29+05:30 IST