Abn logo
Nov 1 2020 @ 04:02AM

20వ శతాబ్ది సూపర్‌ హీరో జేమ్స్‌బాండ్‌ కన్నుమూత

  • తొలి 007 నటుడిగా విశ్వఖ్యాతి
  • 90 ఏళ్ల వయసులో తుదిశ్వాస
  • 4 దశాబ్దాల పాటు వెండితెరను ఏలిన సీన్‌ కానరీ
  • ఆస్కార్‌ సహా అనేక అవార్డులు రివార్డులు

నిలువెత్తు రూపం, రఫ్‌గా కనిపించే ముఖవర్చస్సు, విశాలమైన బాహువులు, చక్కటి శరీరాకృతి, కరుకుగా వినిపించే కంఠం... ప్రపంచాన్ని ఊపేసిన అద్భుత నటుడు, తొలి జేమ్స్‌బాండ్‌ హీరో సర్‌ షాన్‌ కానరీ(90) కన్నుమూశారు. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన బహామాస్‌లోని నసావూలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. 


నసావూ(బహామాస్‌), అక్టోబరు 31: తొలి జేమ్స్‌ బాండ్‌ నటుడు సర్‌ షాన్‌ కానరీ(90) కన్నుమూశారు. కొద్ది కాలంగా ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన.. బహామా్‌సలోని నసావూలో నిద్రలోనే తుదిశ్వాస విడిచారు. ‘‘బాండ్‌.. జేమ్స్‌బాండ్‌’’ అంటూ 1962లో తొలిసారిగా డాక్టర్‌ నో చిత్రం ద్వారా మొదలెట్టిన ఆయన జేమ్స్‌బాండ్‌ ప్రయాణం.. 1983దాకా.. మరో ఆరు సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్లలో కొనసాగింది. ఫ్రం రష్యా విత్‌ లవ్‌, గోల్డ్‌ ఫింగర్‌, థండర్‌ బాల్‌, యూ ఓన్లీ లివ్‌ ట్వైస్‌, డైమండ్స్‌ ఆర్‌ ఫరెవర్‌, నెవర్‌ సే నెవర్‌ ఎగైన్‌ అన్న చిత్రాల్లో ఆయన నటనకు ముగ్ధులైన ప్రేక్షకులు ఆయనకు బ్రహ్మరథమే పట్టారు. 007 కోడ్‌ నేమ్‌తో ఆయన బ్రిటిష్‌ ఏజెంట్‌గా పాల్గొన్న యాక్షన్‌ సన్నివేశాలు, రొమాంటిక్‌ సీన్స్‌, హస్కీగా ఉండే వాయి్‌సతో పలికే కొద్దిపాటి డైలాగ్స్‌ ప్రేక్షకుల్ని కట్టిపడేశాయి. ఒరిజినాలిటీ కోసం ఆయన తపించేవాడు. ఓ సారి అత్యంత ప్రమాదకరమైన షార్క్‌లున్న ఓ చెరువులో ఆయనను ప్రత్యర్థులు పడేసిన షాట్‌లో ఆయన ప్రాణాలకే ముప్పు ఏర్పడింది. ఓ షార్క్‌ ఆయనను కబళించడానికి వచ్చినపుడు దానితో కాసేపు పోరాడి- అతి కష్టంమ్మీద ఒడ్డుకు చేరాడు. 


సెక్సీ అపియరెన్స్‌తో చరిష్మా ఉన్న సీక్రెట్‌ ఏజెంట్‌గా, కరుడు గట్టిన నిఘా అధికారిగా ఆయన పోషించిన పాత్రలు అనితరసాధ్యమని ఇప్పటికీ విమర్శకులంటూంటారు. ప్రపంచవ్యాప్తంగా లక్షల మంది అభిమానులను సాధించి- 20వ శతాబ్దిలో సూపర్‌ హీరోగా గణుతికెక్కారు. 1980ల్లోనే తీసిన ది అన్‌టచబుల్స్‌ సినిమాలో ఆయనకు ఆస్కార్‌ అవార్డ్‌ లభించింది. బ్రిటిష్‌ రాణి ఎలిజెబెత్‌ ఆయనను సర్‌ అనే గౌరవంతో సత్కరించగా, పీపుల్స్‌ మ్యాగజైన్‌ ఆయనను సెక్సియెస్ట్‌ మ్యాన్‌ ఆఫ్‌ ది సెంచరీగా పేర్కొంది. 


మురికివాడలో బాల్యం

1930 ఆగస్టు 25న ఎడిన్‌బర్గ్‌లో జన్మించిన షాన్‌ కానరీది సాదాసీదా కుటుంబం. ఓ మురికివాడలోని ఓ ఇరుకైన గదిలో బాల్యం గడిచింది.  తండ్రి ఫ్యాక్టరీలో కార్మికుడు. చదువుకోడానికి డబ్బుల్లేక 13వ ఏటనే చదువుకి స్వస్తి చెప్పాడు. పొట్ట గడవడానికి పాలు అమ్మాడు. శవపేటికలు పాలిష్‌ చేశాడు. రాయల్‌ ఆర్మీలో చేరినా మూడేళ్లలోనే ఆయనకు కడుపులో అల్సర్లు రావడంతో బయటకు పంపేశారు. ఆ తరువాత లారీలు నడిపాడు. రిచర్డ్‌ డీమార్కో అనే చిత్రకారుడు కానరీ రూపాన్ని పెయింట్‌ చేసి- ‘‘నీది అద్భుతమైన దేహాకృతి... మాటలకందదు’’ అని ప్రశంసించాడు. అక్కడ నుంచి ఆయనకు సినిమాలవైపు దృష్టి మళ్లింది.


అమెరికన్‌ నటుడు రాబర్ట్‌ హెండర్సన్‌ ప్రోత్సహించడంతో తనలోని నటనకు పదునుపెట్టాడు. 1954లో బ్రిటిష్‌ మ్యూజికల్‌ చిత్రం లైలాక్స్‌ ఇన్‌ ది స్ర్పింగ్‌లో నటించాడు. ఆ తరువాత బీబీసీ తీసిన బ్లడ్‌ మనీ సహా అనేక డ్రామాల్లో, కొన్ని చిన్న చిత్రాల్లోనూ నటించాడు. ఆ తరువాత సుప్రసిద్ధ నవలా రచయిత ఇయాన్‌ ఫ్లెమింగ్‌ సృష్టించిన జేమ్స్‌ బాండ్‌ పాత్రకు అతికినట్లు సరిపోయి ప్రపంచానికి థ్రిల్లర్‌ సినిమాల్లో కొత్తదనాన్ని అందించాడు. ఆల్‌ఫ్రెడ్‌ హిచ్‌కాక్‌ తీసిన మేర్నీ, ది హిల్‌ అనే సినిమాలతో పాటు రుడ్యార్డ్‌ కిప్లింగ్‌ రాసిన ది మేన్‌ హూ వుడ్‌ బీ దీ కింగ్‌ చిత్రంలోనూ నటించాడు. షాన్‌ కానరీ తరువాత జార్జ్‌ లిజన్‌బీ, రోజర్‌ మూర్‌, తిమోతీ డాల్టన్‌, డేనియల్‌ క్రెయిగ్‌ లాంటి వారు జేమ్స్‌బాండ్‌ పాత్రలు ఫోషించినా కానరీ ముందు తక్కువే అయ్యారు.

ఓవర్సీస్ సినిమామరిన్ని...