జమాబంద్‌

ABN , First Publish Date - 2021-10-12T05:57:07+05:30 IST

గ్రామ రెవెన్యూ ఆడిట్‌ కోసం ఏటా నిర్వహించే జమాబందీ గత కొన్నేళ్లుగా నిలిచిపోయింది. భూమికి సంబంధించి మాన్యువల్‌ రికార్డులు ఉన్న సమయంలో జమాబందీ నిర్వహించి పన్ను వసూళ్లు, బకాయిలపై ఆడిటింగ్‌ నిర్వహించే వారు.

జమాబంద్‌

కొన్నేళ్లుగా నిలిచిన జమాబందీ 

ట్యాంపరింగ్‌లు జరగడానికి ఆస్కారం 

గతంలో ప్రతీ ఫసలీ సంవత్సరంలో నిర్వహణ


గుంటూరు, అక్టోబరు 11 (ఆంధ్రజ్యోతి): గ్రామ రెవెన్యూ ఆడిట్‌ కోసం ఏటా నిర్వహించే జమాబందీ గత కొన్నేళ్లుగా నిలిచిపోయింది. భూమికి సంబంధించి మాన్యువల్‌ రికార్డులు ఉన్న సమయంలో జమాబందీ నిర్వహించి పన్ను వసూళ్లు, బకాయిలపై ఆడిటింగ్‌ నిర్వహించే వారు. ఆ సమయంలో స్పెషల్‌ ఆఫీసర్‌ తనకు కేటాయించిన మండలాల్లోని అన్ని గ్రామాలకు వెళ్లి ఆడిటింగ్‌ చేయడం వల్ల భూములకు సంబంధించి ఖాతాదారులు ఎవరనే దానిపై స్పష్టత ఉండేది. జమాబందీ నిర్వహించకపోతుండటంతో వెబ్‌ల్యాండ్‌లో కంప్యూటర్‌ ఆపరేటర్లు రికార్డులు ట్యాంపరింగ్‌ చేయడానికి ఎక్కువ ఆస్కారం కలుగుతోన్నది. లేని భూమికి ఖాతాదారుల పేర్లను ఆన్‌లైన్‌లో పోర్టింగ్‌ చేస్తూ బ్యాంకుల నుంచి రుణాలు, ఏటా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పంట పెట్టుబడిసాయం అక్రమంగా పొందేందుకు సహకరిస్తోన్నారు. భూమికి సంబంధించి పన్ను, నీటితీరువా వసూళ్లని పర్యవేక్షించేందుకు గతంలో ప్రతీ జూలై 1వ తేదీ నుంచి తదుపరి సంవత్సరం జూన్‌ 30 వరకు ఫసలీ సంవత్సరంలో జమాబందీ నిర్వహించే వారు. ఇందుకోసం స్పెషలాఫీసర్లను నియమించి గ్రామాలకు పంపించేవారు. ఆ సందర్భంలో స్పెషల్‌ ఆఫీసర్‌ ఫలాన తేదీన జమాబందీ నిర్వహిస్తారని రైతులకు తెలియజేసేవారు. ఆ రోజున గ్రామ రెవెన్యూ రికార్డులన్నింటిని దగ్గర పెట్టుకొని ఏ రైతుకు ఎంత వ్యవసాయ భూమి ఉంది, అందులో మాగాణి, మెట్ట ఎంత, ఆ భూముల్లో ఏమి సాగు చేశారు, ఎంత పన్ను చెల్లించారు, ఇంకా ఎంత బకాయి ఉన్నారనే వివరాలను లెక్కించేవారు.  దీని వలన భూములు, సర్వే నెంబర్లు, ఖాతా నెంబర్లపై స్పష్టత ఉండేది. అక్రమాలు జరగడానికి ఆస్కారం ఉండేది కాదు. 

ఆన్‌లైన్‌తో అక్రమాలు

కాగా ఎప్పుడైతే భూమి రికార్డులన్నింటిని ఆన్‌లైన్‌ చేశారో ఆ సంవత్సరం నుంచి మాన్యువల్‌ రికార్డులన్నింటిని గ్రామాల నుంచి కలెక్టరేట్‌కి తెప్పించుకొని డిపాజిట్‌ చేసుకొన్నారు. ఇప్పుడు వీఆర్‌వోల వద్ద సరైన రికార్డులు లేవు. ఇదే అదనుగా మండల రెవెన్యూ కార్యాలయాల్లో విధులు నిర్వహించే కంప్యూటర్‌ ఆపరేటర్లు అక్రమాలకు పాల్పడటం ప్రారంభించారు. తహసీల్దార్‌ డిజిటల్‌ సంతకం కంప్యూటర్‌ ఆపరేటర్ల వద్దనే ఉంటుందన్న విషయం బహిరంగ రహస్యమే. దానిని కంప్యూటర్‌ ఆపరేటర్లు దుర్వినియోగం చేస్తున్నారు. ప్రధానంగా ప్రభుత్వ భూములు ఎక్కువ విస్తీర్ణంలో ఉన్న మాచర్ల, దాచేపల్లి, మాచవరం, పిడుగురాళ్ల, గురజాల, వెల్దుర్తి, కారంపూడి మండలాల్లో ఇటీవల అనేక అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇందుకు కారణం జమాబందీ జరగకపోవడం వల్ల అక్కడి రెవెన్యూ సిబ్బంది కుమ్మక్కు అయి భారీ ఎత్తున ట్యాంపరింగ్‌ చేస్తున్నారు. మాచవరం మండలంతో పాటు తంగెడ గ్రామంలో వెలుగు చూసిన ఉదంతాలే ఇందుకు నిదర్శనం. ఈ నేపథ్యంలో తిరిగి జమాబందీ నిర్వహణ చేపట్టాలని రైతులు కోరుతున్నారు. 

Updated Date - 2021-10-12T05:57:07+05:30 IST