ఝులన్‌ ఎక్స్‌ప్రెస్‌

ABN , First Publish Date - 2022-01-12T05:30:00+05:30 IST

రెండు దశాబ్దాల కెరీర్‌... రెండు వందలకు పైగా వికెట్స్‌... నాలుగు పదుల వయసులోనూ అదే వేగం.. చెదరని ఆత్మవిశ్వాసం.. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి......

ఝులన్‌ ఎక్స్‌ప్రెస్‌

రెండు దశాబ్దాల కెరీర్‌... రెండు వందలకు పైగా వికెట్స్‌... నాలుగు పదుల వయసులోనూ అదే వేగం.. చెదరని ఆత్మవిశ్వాసం.. ఎక్కడో మారుమూల ప్రాంతంలో పుట్టి... పురుషులకే సాధ్యమన్న క్రికెట్‌లో కాలుపెట్టి... అసాధ్యాలెన్నిటినో సుసాధ్యం చేసిన భారత మహిళా జట్టు ఫాస్ట్‌ బౌలర్‌ ఝులన్‌ గోస్వామి ప్రస్థానంలో ప్రతి ఘట్టం ఒక పాఠం. సవాళ్లను ఎదుర్కొంటూ... అవహేళనలను భరిస్తూ సాగిన ఆమె జీవితం ఇప్పుడు చలనచిత్రమై... మరింత మందిలో స్ఫూర్తి నింపడానికి సిద్ధమైంది. 


‘ఛక్‌డా ఎక్స్‌ప్రెస్‌’... బాలీవుడ్‌ స్టార్‌ అనుష్కా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం గురించి ప్రస్తుతం దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఈ సినిమా ట్రైలర్‌కు లక్షల్లో వ్యూస్‌ వచ్చాయి. కారణం... అది ఓ బయోపిక్‌. ప్రపంచ క్రికెట్‌లో సంచలనాలకు మారుపేరైన భారత మహిళా క్రికెటర్‌ ఝులన్‌ గోస్వామి కథ అది. అందుకే అంతటి క్రేజ్‌. అంతర్జాతీయ క్రికెట్‌లో ఒక ఫాస్ట్‌ బౌలర్‌కు రెండు దశాబ్దాల కెరీర్‌ అంటే... సాధారణ విషయం కాదు. అదీ ఒక మహిళ ఆ ఘనత సాధించడమంటే... నిజంగా అద్భుతమనేది తలపండిన కిక్రెటర్ల మాట. పశ్చిమబెంగాల్‌లోని మారుమూల పల్లె ప్రాంతమైన ఛక్‌డాలో పుట్టి పెరిగిన 39 ఏళ్ల ఝులన్‌కు క్రికెట్‌ ఒక్కటే ప్రపంచం. దాని కోసం ఆమె చేసిన త్యాగాలు అనంతం. యువ క్రికెటర్లకే కాదు... కొత్తగా ప్రయత్నించాలనుకొనే ప్రతి ఆడపిల్లకూ ఆమె ఆదర్శం.

 

చిన్న వయసులోనే... 

ఝులన్‌ 19 సంవత్సరాల వయసులోనే బెంగాల్‌ జట్టుకు ఆడడం ప్రారంభించారు. అంతేకాదు... వాళ్ల కుటుంబంలో ఆమే మొట్టమొదటి క్రీడాకారిణి. తన కజిన్స్‌, స్నేహితులతో కలిసి వీధుల్లో క్రికెట్‌ ఆడేవారు. అప్పటి నుంచే పేస్‌ బౌలింగ్‌పై మక్కువ. తనతో కలిసి ఆడే మగపిల్లలు ‘ఫాస్ట్‌ బౌలింగ్‌ నీవల్ల కాదన్నా’రు. ఆ మాటలు ఆమెలో కసి పెంచాయి. ‘నావల్ల ఎందుకు కాదు’! తానేంటో వారికి చూపించాలనే పట్టుదల. అందుకు ఎంతో సమయం పట్టలేదు. కొన్ని రోజులకే ఝులన్‌ ఆ మగపిల్లలతో పోటీపడి మరీ బంతులు విసిరారు. ఆడపిల్లలు అసలు ఆటలను కెరీర్‌గా మలుచుకోవడానికే వెనకాడే రోజుల్లో ఆమె క్రికెట్టే తన జీవితమని నిర్ణయించుకున్నారు. అనుకున్నట్టుగానే భారత్‌ తరఫున అంతర్జాతీయ వేదికలపై తన ఆటతో అసమాన ప్రదర్శనలెన్నో ఇచ్చారు. 


ప్రతికూల పరిస్థితుల్లోనూ... 

సినిమాలో ఝులన్‌ పాత్ర పోషించిన అనుష్కాశర్మ... ‘‘క్రికెట్‌ ఆడడానికి కావల్సిన వసతులు, సౌకర్యాలు, ఆదాయ వనరులు... ఏవీ లేవు. సహకారం అందించేవారు గానీ, మద్దతుగా నిలిచి భుజం తట్టేవారు గానీ లేరు. క్రికెట్‌ను కెరీర్‌గా ఎంచుకొంటే భవిష్యత్తు లేదనే రోజులవి. అలాంటి రోజుల్లో, అందులోనూ ఒక మహిళ క్రికెట్‌నే ప్రేమించి, అందులో రాణించింది. 2017 మహిళల ప్రపంచ కప్‌ ఫైనల్స్‌కు వెళ్లిన జట్టుకు ఝులన్‌ ప్రాతినిధ్యం వహించింది. టోర్నీ పొడుగునా అద్భుత ప్రదర్శనతో ఆమె పేరు మారుమోగింది. సౌకర్యాల లేమిని సాకుగా చూపకుండా ఝులన్‌ ఎదిగిన తీరు అనిర్వచనీయం. అభిరుచి, పట్టుదల ఉంటే ఎలాంటి ప్రతికూల పరిస్థితులనైనా ఎదిరించి విజయం సాధించవచ్చని చెప్పడానికి ఆమె జీవితం ప్రత్యక్ష సాక్ష్యం. లక్ష్యం కోసం ఎన్నిటినో త్యాగం చేసి... భారత క్రికెట్‌లో వెలుగుతున్న ఆమె కథను సినిమాగా తీయడం ఒక అవసరంగా, గౌరవంగా భావించాను. అందుకు ఒక మహిళగా గర్విస్తున్నా. ఝులన్‌ సాధించిన విజయాలకు గుర్తుగా ఈ చిత్రం నిలిచిపోతుంది’’ అంటూ భావోద్వేగానికి లోనయ్యారు. మూడేళ్ల సుదీర్ఘ విరామం తరువాత అనుష్క చేస్తున్న చిత్రమిది. 


అసమానతలు అధిగమించి... 

క్రికెట్‌లో అద్భుతాలు చేయాలంటే పురుష క్రికెటర్లకే సాధ్యమనే రోజులవి. మహిళా క్రికెటర్లకు అంతగా ప్రాధాన్యం ఉండేది కాదు. ఒక సందర్భంలో వారికి ప్రత్యేక జెర్సీలు కూడా ఇవ్వలేదు. పురుష క్రికెటర్ల జెర్సీలు వేసుకుని ఆడాల్సి వచ్చింది. అలాంటి పురుషాధిక్య సమాజంలో... అత్యున్నత ప్రదర్శనతో మహిళలు ఎందులోనూ తక్కువ కాదని నిరూపించారు ఝులన్‌. 2006లో గంటకు 120 కిలోమీటర్ల వేగంతో బంతిని విసిరి ప్రపంచంలోనే ఫాస్టెస్ట్‌ ఉమన్‌ బౌలర్‌గా చరిత్ర సృష్టించారు ఆమె. 


నెంబర్‌ వన్‌... 

ఝులన్‌ సారథ్యంలో భారత్‌ 25 మ్యాచ్‌లు ఆడింది. 12 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. విభిన్న బౌలింగ్‌ శైలి, నిరంతర పరిశ్రమ... ఇవే ఆమెను 200 వన్డే వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్‌గా నిలబెట్టాయి. 2016లో వన్డే బౌలర్లలో నెంబర్‌ వన్‌ స్థానంలో ఉన్న ఝులన్‌... అంతకముందు 2007లో ‘ఐసీసీ ఉమెన్స్‌ క్రికెటర్‌ ఆఫ్‌ ది ఇయర్‌’గా నిలిచారు. ఈ వయసులో కూడా ఫిట్‌నెస్‌ కాపాడుకొంటూ... యువ క్రికెటర్లతో పోటీపడుతున్నారు. ‘‘అంతర్జాతీయ స్థాయిలో రాణించాలంటే ఫిట్‌గా ఉండడం తప్పనిసరి. దాని కోసం కచ్చితంగా అనుసరించాల్సినవి... డైట్‌, శిక్షణ, నిద్ర’’ అంటారు ఝులన్‌. 


అవే మదిలో మెదిలేది...  

తన బయోపిక్‌ టీజర్‌ను ఇన్‌స్టాలో పోస్ట్‌ చేశారు ఝులన్‌. ఈ సందర్భంగా... ‘‘భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నామంటే... అదొక్కటే మన మెదడులో ఉండాలి. మన కోసం కాదు... దేశం కోసం ఆడుతున్నామని గుర్తుంచుకోవాలి. నేనైతే ఎప్పుడూ భారత జట్టు పేరును చరిత్రలో లిఖించడానికి 11 మంది మహిళలు కలిసి బరిలో దిగుతున్నామని భావిస్తాను. ‘మహిళలు క్రికెట్‌ ఆడలేరంటూ’ ఎవరెవరో చేసే వ్యాఖ్యలను పట్టించుకోనక్కర్లేదు. పురుష క్రికెటర్లతో సమానంగా గుర్తింపు దక్కకపోయినా... స్టేడియాలు ఖాళీగా ఉన్నా... నాకు అనవసరం. ఒక్కసారి బరిలోకి దిగాక... నా చేతిలో బంతి... ఎదురుగా పిచ్‌పై సిద్ధంగా ఉన్న బ్యాట్స్‌మన్‌... ఆ వెనక ఉన్న మూడు స్టంప్స్‌... వాటిని పడగొట్టడానికి చేయాల్సిన ప్రయత్నం... ఇవే నాకు కనిపిస్తాయి. ప్రతి క్షణం మన ఆలోచన లక్ష్యంపై ఉంచితేనే విజయం వరిస్తుంది. దేనికైనా బలమైన పునాదులు అవసరం’’ అంటూ తన ఇన్‌స్టా పోస్ట్‌ కింద రాసుకొచ్చారు ఈ మేటి ఫాస్ట్‌ బౌలర్‌. 


 చీర్స్‌ చెబుదాం... 

పోరాటమే తప్ప ప్రతికూల పరిస్థితుల నుంచి పారిపోని నైజం ఝులన్‌ది. ఇప్పుడు ఆమె ఆటలోని ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తున్నారు. ఓ ఇన్‌స్టా పోస్ట్‌లో ఆ సంతోషాన్ని షేర్‌ చేసుకున్నారు... ‘‘టీమ్‌ ఇండియా అంటే 1.3 బిలియన్ల ప్రోత్సహించి, ప్రార్థించే గొంతులే కాదు... ఛక్‌డా నుంచి వచ్చిన ఓ అమ్మాయి... అద్భుత బంతితో వికెట్లు గిరాటు వేసినప్పుడు బిగ్గరగా అరుస్తూ... గెంతుతూ... చేతులు కలుపుతూ... సహచరులతో పంచుకొనే ఆనందం కూడా! నేడు మేం ఆడుతున్నాం. ప్రత్యక్షంగా చూస్తున్నారు. రేపు మా పేర్లు గుర్తుపెట్టుకొంటారు. ఇది మహిళల ప్రకాశాన్ని చూడాల్సిన సమయం. రండి... అందరం కలిసి చిత్రాన్ని ఆస్వాదిద్దాం. మహిళా క్రికెట్‌కు చీర్స్‌ చెబుదాం’’.

Updated Date - 2022-01-12T05:30:00+05:30 IST