జలవలయం

ABN , First Publish Date - 2021-12-01T05:09:24+05:30 IST

జిల్లాలో వర్షాలు తగ్గినా వరద మాత్రం ముంచెత్తుతోంది. చెరువులన్నీ నిండుకుండను తలపిస్తుండగా, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి.

జలవలయం
జలదిగ్బంధం

వర్షం తగ్గినా మంచెత్తుతున్న వరద

ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులు

పలు గ్రామాలకు నిలిచిన రాకపోకలు

ప్రమాదంలో చెరువులు.. ఆందోళనలో ప్రజలు


నెల్లూరు, నవంబరు 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో వర్షాలు తగ్గినా వరద మాత్రం ముంచెత్తుతోంది. చెరువులన్నీ నిండుకుండను తలపిస్తుండగా, వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. దీంతో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోగా, లోతట్టు ప్రాంతాలన్నీ ఇంకా జలదిగ్భందంలోనే ఉన్నాయి. జిల్లాలో 1746 చెరువులు ఉండగా మగళవారం నాటికి 1334 చెరువులు పూర్తిగా నిండిపోయాయి. వీటిలో కొన్ని చెరువులకు గండ్లు పడటంతో ఆ పరిసర గ్రామాలు ముంపునకు గురయ్యాయి. ఇంకొన్ని చోట్ల చెరువు కట్టలు తెగే ప్రమాదం ఉండటంతో అధికారులు, స్థానిక గ్రామాల ప్రజలు ముందస్తుగా గండ్లు కొడుతున్నారు. ఇంకొన్ని చెరువులు ఎప్పుడు తెగుతాయోనని దిగువ గ్రామాల ప్రజలు భయం భయంగా కాలం వెళ్లదీస్తున్నారు. రాకపోకలు నిలిచిపోయిన గ్రామాల్లో నిత్యావసర సరుకులు కూడా దొరక్క ప్రజలు అల్లాడుతున్నారు. అధికారులు కూడా చెరువులపై నిరంతరం పర్యవేక్షణ ఉంచారు. ప్రమాదం అనుకున్న చోట ప్రజలను ముందుగానే అప్రమత్తం చేస్తున్నారు. 


46.8 మి.మీ వర్షపాతం


సోమవారం ఉదయం నుంచి మంగళవారం ఉదయం వరకు జిల్లాలో సరాసరి 46.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. సీతారామపురంలో 112.2 మి.మీ, అత్యల్పంగా తడలో 8.2 మి.మీ నమోదైంది. మర్రిపాడులో 104, కొండాపురంలో 93.4, వరికుంటపాడులో 93, వింజమూరులో 90.6, కలిగిరిలో 88.2, వెంకటాచలంలో 72.4, జలదంకిలో 69.8, కావలిలో 69.4, చిట్టమూరులో 66.4, మనుబోలులో 63.4, దగదర్తిలో 59.8, బాలాయపల్లి 59.4, బుచ్చిరెడ్డిపాలెం 58.6, ఏఎస్‌ పేట 57.2, కోట 56.2, వాకాడు 55.8, సంగం 53.4, ఓజిలి 53.2, అల్లూరు 49.2, కలువాయి 47, దుత్తలూరు 43.2, ఉదయగిరి 43.2, ముత్తుకూరు 41, నెల్లూరు 38.2, కోవూరు 37.8, ఆత్మకూరు 37.8, దొరవారిసత్రం 33.2, గూడూరు 29.6, రాపూరు 29, అనంతసాగరం 28.6, విడవలూరు 24.8, ఇందుకూరుపేట 24.2, చేజర్ల 23.6, డక్కిలి 23.4, పొదలకూరు 22.6, తోటపల్లి గూడూరు 22.2, పెళ్లకూరు 20.8, కొడవలూరు 20.8, బోగోలు 20.4, నాయుడుపేట 20.2, సూళ్లూరుపేట 19.8, వెంకటగిరి 18.6, సైదాపురం 13.6 మి.మీ చొప్పున వర్షం కురిసింది. 


మనుబోలు మండలం బద్దెవోలు రహదారిపై వరద ప్రవహిస్తుండడంతో ఐదు తీర ప్రాంత గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. మనుబోలు పెద్ద చెరువు ప్రమాదకరస్థాయికి చేరడంతో కలుజు వద్ద కట్ట తెంచారు. బాలాయపల్లి మండలంలో కైవల్యా నది ఉప్పొంగడంతో నిండలి, వాక్యం, కడగుంట, రామాపురం గ్రామాలకు రాకపోకలు ఆగిపోయాయి. నాయుడు చెరువు కట్టకు గండి కొట్టి ప్రమాదస్థాయిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. గూడూరు మండలం తిప్పవరప్పాడు సమీపంలో చెప్టాపై వరదనీరు పారుతుండడంతో సైదాపురం, పొదలకూరు, రాపూరు ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. అలానే వేములపాలెం వద్ద చప్టాపై వరద ఉధృతంగా ప్రవహిస్తుండడంతో 8 గ్రామాలకు వెళ్లేందుకు దారి లేకుండా పోయింది. గూడూరు సమీపంలోని ఆదిశంకర కళాశాల వద్ద జాతీయ రహదారిపై నీరు పారుతుండడంతో వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. 

అనంతసాగరం మండలంలో కొమ్మలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో కొత్తపల్లి- కచేరి దేవరాయ పల్లి గ్రామాల మధ్య సంబంధాలు తెగిపోయాయి.  వరికుంటపాడు వద్ద అలుగు వాగు ఉధృతంగా ప్రవహిస్తుండడంతో అనంతసాగరం - సోమశిల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అనంతసాగరం అటవీ ప్రాంతంలో పులిగుంట కట్టకు గండి పడడంతో సచివాలయం, రైతు భరోసా కేంద్రం, పూసల కాలనీ మీదుగా వరద పారుతోంది. నెల్లూరు రూరల్‌ మండలంలోని ములుమూడి గ్రామాన్ని వరద నీరు చుట్టుముట్టడంతో రాకపోకలు ఆగిపోయాయి. చిల్లకూరు మండలం పారిచర్లవారిపాలెం, తిప్పగుంటపాలలెం, రెట్టపల్లి గ్రామాల్లో వరద రోడ్లపై ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. తిప్పగుంటపాలెం జలదిగ్భందంలో చిక్కుకుంది. 

జలదంకి మండలం కమ్మవారిపాలెం, సోమవరప్పాడు, దాసరి అగ్రహారం, అన్నవరం, తిమ్మసముద్రం, చినక్రాక, కొత్తపాలెం, కష్ణాపాడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చేజర్ల మండలంలో నల్లవాగు ఉధృతికి చేజర్ల - కలువాయి మధ్య సంబంధాలు తెగిపోయాయి. గొల్లపల్లి సమీపంలో పందల వాగు ఉధృతి ఇంకా తగ్గకపోవడంతో చేజర్ల - సంగం మధ్య రాకపోకలు పునరద్ధరణ జరగలేదు. నాగులవెల్లటూరు చెరువు తెగిపోయింది. మర్రిపాడు మండలం పడమటినాయుడు పల్లి వద్ద కేతమన్నేరు వాగు పొంగిపొర్లుతుండడంతో ఆ గ్రామానికి రాకపోకలు ఆగిపోయాయి. దీంతో ఆ గ్రామంలోని ప్రజలు నిత్యావసరాల కోసం అల్లాడుతుండగా 24 మంది గర్భిణులు, బాలింతలు వైద్యం కోసం ఇబ్బంది పడుతున్నారు. నందవరం, కదిరినేనిపల్లి చెరువుల కట్టలు ప్రమాదకరస్థాయిలో ఉన్నాయి. 



Updated Date - 2021-12-01T05:09:24+05:30 IST