జలకలేనా..?

ABN , First Publish Date - 2022-07-30T05:43:50+05:30 IST

రైతుల కల మన వైఎస్‌ఆర్‌ జలకళ అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన పథకం నిజ్జంగా కలగానే మిగిలిపోతోంది. నెలలు గడుస్తున్నా జిల్లాలో జలకళ అమలు నత్తనడకన సాగుతోంది.

జలకలేనా..?
వ్యవసాయ బోరు

నత్తనడకన జలకళ

బోర్లు కోసం నెలలుగా నిరీక్షణ

బోర్లు నిర్మాణానికి 9354 దరఖాస్తులు

7392 అమోదించగా 535 బోర్లే నిర్మాణం

  

 

నరసరావుపేట, జూలై 29: రైతుల కల మన వైఎస్‌ఆర్‌ జలకళ అంటూ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రవేశపెట్టిన పథకం నిజ్జంగా కలగానే మిగిలిపోతోంది. నెలలు గడుస్తున్నా జిల్లాలో జలకళ అమలు నత్తనడకన సాగుతోంది. సాగు నీటి కష్టాలు తీర్చేలా పొలాల్లో బోర్లు వేసి.. చిన్న సన్న కారు రైతులకు లబ్ధి చేకూర్చాలని ప్రవేశ పెట్టిన ఈ పథకం ప్రయోజనాలు నెరవేరడంలేదు. రైతులకు బోరు బావులతో సాగు నీటి భరోసా కల్పించేందుకు వైఎస్‌ఆర్‌ జలకళ పథకాన్ని ప్రభుత్వం 2020లో ప్రారంభించింది. చిన్న, సన్న కారు రైతుల వ్యవసాయ భూమిని సేద్యానికి అనుకూలంగా మార్చేందుకు భూగర్భ జలాలను సమర్ధవంతంగా సద్యినియోగం చేసుకునేందుకు వ్యవసాయ ఉచిత బోరు బావుల పథకాన్ని ప్రవేశపెట్టింది. అయితే ప్రభుత్వ లక్ష్యాలు ఘనంగా ఉన్నా ఆచరణ నామమాత్రంగా కూడా లేదు. జలకళ పథకంలో వ్యవసాయ బోరు బావులను ఉచితంగా నిర్మించాలి. అయితే ఈ పథకం ఆరంభం నుంచి అమలులో చిత్తశుద్ధి కొరవడిందన్న విమర్శలున్నాయి. బోరు కింద పంట సాగు చేయవచ్చని ఆశ పడ్డ రైతులకు అడియాసే మిగిలింది. దరఖాస్తు చేసుకున్న వేలాది మంది రైతులు బోరు బావుల నిర్మాణానికి నెలల తరబడి ఎదురుచూస్తున్నా ఫలితం లేదు. పథకం ఘనంగా ఉన్నా ఆచరణలో ప్రభుత్వం విఫలమవుతున్నదని గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఖరీఫ్‌ సీజన్‌ ప్రారంభమై నెలలు గడుస్తున్నా బోర్లు నిర్మాణం నామమాత్రంగా కూడా జరగడంలేదు. దీంతో అన్నదాతలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 9354 మంది రైతులు జలకళ పథకానికి దరాఖాస్తు చేసుకోగా వాటిలో అన్ని పరిశీలనల అనంతరం 7,392 దరఖాస్తులను ఆమోదించారు. భూగర్భ జలాల లభ్యతకు సంబంఽధించి 3,564 దరఖాస్తులపై సర్వే కూడా చేశారు. సర్వే బృందం ఇచ్చిన నివేదిక ఆధారంగా బోర్లు నిర్మాణానికి 2,566 దరఖాస్తులకు అనుమతి ఇచ్చారు. వీటిలో 1,939 బోర్లకు పరిపాలన అనుమతి వచ్చింది. ఇందుకు రూ.21.14 కోట్లు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే ఇప్పటి వరకు 535 బోర్లను మాత్రమే నిర్మించారు. గత మూడు నెలల వ్యవధిలో కేవలం 117 బోర్లు మాత్రమే నిర్మించారు. సత్తెనపల్లి క్లస్టర్‌ పరిధిలో ఒక్క బోరు కూడా నిర్మించలేదు. వినుకొండ క్లస్టర్‌లో 12, మాచర్ల క్లస్టర్‌లో 97, నరసరావుపేట క్లస్టర్‌లో 8 బోర్లు నిర్మించారు. ఈ గణాంకాలను పరిశీలిస్తే జలకళ పథకం పురోగతి ఏవిధంగా ఉందో అవగతమవుతుంది. 


లక్ష్యాలు ఘనం.. ఆచరణలో విఫలం

పథకం ప్రవేశ పెట్టడంలో ఉన్నత లక్ష్యాలను నిర్ధేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో దీనిని అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతున్నది. పథకం అమలుపై సమీక్షలతో సరి పెడుతుందే తప్ప బోర్ల నిర్మాణంపై దృష్టి సారించడం లేదన్న విమర్శలు అన్నదాతల నుంచి వస్తున్నాయి. దరఖాస్తుదారులందరికీ బోర్లను నిర్మించే పరిస్థితులు కానరావడంలేదు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు దృష్టి సారించి లక్ష్యాల మేర వ్యవసాయ బోర్లను నిర్మించేందుకు కృషి చేయాలని అన్నదాతలు కోరుతున్నారు. బోర్లు నిర్మిస్తే కనీసం రబీ సీజన్‌లో అయినా పంటల సాగుకు ఉపయోగపడతాయంటున్నారు.  



 =================================================================================

Updated Date - 2022-07-30T05:43:50+05:30 IST