జల్‌ జీవన్‌.. జాప్యం

ABN , First Publish Date - 2022-05-16T05:19:58+05:30 IST

పల్లెల్లో ప్రతి ఇంటికి రక్షిత నీరు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ను అమలు చేస్తున్నది.

జల్‌ జీవన్‌.. జాప్యం

ఇంటింటికి రక్షిత నీరు కరువు 

గ్రామాల్లో నత్తనడకన పనులు

పల్లెల్లో తీరని తాగునీటి వెతలు

కేంద్రం నుంచి రూ.202 కోట్లు విడుదల

రాష్ట్ర ప్రభుత్వ వాటా నిధుల పెండింగ్‌

ఉమ్మడి గుంటూరు జిల్లాలో నీటి సరఫరా 35.84 శాతమే


ప్రతి ఇంటికి సురక్షితమైన తాగునీరు అందించాలి.. ప్రజల ఆరోగ్యాలను కాపాడాలి. ఈ లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ను ప్రారంభించింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేరి సగం నిధులతో ఈ పనులు చేపట్టే విధంగా 2020లో ప్రణాళికను రూపొందించారు. ఈ పథకంలో భాగంగా ఇప్పటికే గ్రామాల్లో ఉన్న తాగునీటి పథకాలను విస్తరించడంతో పాటు, పైపులైన్లు, తాగునీటి చెరువుల అభివృద్ధి తదితర పనులు చేపట్టాలని ప్రణాళికలు రూపొందించారు.  అయితే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఈ పథకం అమలులో తీవ్రజాప్యం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేసినా రాష్ట్ర ప్రభుత్వం నిధులను మంజూరు చేయలేదు. 2024 కల్లా పనులు పూర్తి చేసి ఇంటింటికి కుళాయిల ద్వారా తాగునీరు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యాంగా నిర్ణయించింది. లక్ష్యాల మేర పనులు జరుగుతున్న పరిస్థితులు కానరాడంలేదు. ఈ పరిస్థితుల్లో గ్రామీణులకు సురక్షితమైన తాగునీరు అందక అనారోగ్యాల బారిన పడుతున్నారు. ఇదే అవకాశంగా గ్రామాల్లో సైతం నీటి వ్యాపారం జోరందుకుంది.    


నరసరావుపేట, మే 15: పల్లెల్లో ప్రతి ఇంటికి రక్షిత నీరు అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జల్‌ జీవన్‌ మిషన్‌ను అమలు చేస్తున్నది.  తాగునీటి పథకాలను పూర్తి స్థాయిలో పునరుద్ధరించి ప్రతి గ్రామంలో నూరు శాతం కుళాయిల ద్వారా నీరు ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయించాయి. ఇందుకు రూ.404 కోట్లు వ్యయం అవుతుందని, కేంద్రం రూ.202 కోట్లు నిధులను మంజూరు చేసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేయడంలేదు. దీంతో గ్రామాల్లో జల్‌ జీవన్‌ మిషన్‌ అమలులో జాప్యం జరుగుతుందన్న విమర్శలున్నాయి. జల్‌ జీవన్‌ పథకం ద్వారా పల్లెల్లో ప్రతి వ్యక్తికి 55 లీటర్లు నీరు ఇవ్వడమే లక్ష్యం. ప్రస్తుతం ఉన్న నీటి పథకాలు ప్రతి వ్యక్తిగా 40 లీటర్లు నీరు ఇచ్చే విధంగా రూపొందించబడ్డాయి. వీటిని విస్తరించాలి. ప్రధానంగా ఫ్లోరైడ్‌ ఉన్న నీటి తాగడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారు. బొల్లాపల్లి, నకరికల్లు మండలాలతో పాటు, గురజాల, మాచర్ల నియోజకవర్గాల్లోని అనేక గ్రామాల్లో ఫ్లోరైడ్‌ నీటినే ప్రజలు వినియోగిస్తున్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గ్రామాల్లో 8,23,652 గృహాలు ఉన్నాయి. ఇప్పటి వరకు 2,95.232 గృహాలకు మాత్రమే కుళాయిల ద్వారా నీటి సరఫరా జరుగుతున్నది. అంటే 35.84 శాతమే గృహాలకు కుళాయిలు ఉన్నాయి. ఇంకా 5,28,420 గృహాలకు కుళాయి కనెక్షన్‌ ఇవ్వాల్సి ఉంది. అనేక గ్రామాల్లో రక్షిత నీటి పథకాలు సక్రమంగా పనిచేయడంలేదు. కుళాయిలు కూడా నామమాత్రంగానే ఉన్నాయి. 


1580 పనులు.. రూ.404 కోట్లు

నీటి సరఫరాకు సంబంధించి గ్రామాల్లో 1580 పనులు గుర్తించారు. ఇందుకు సంబంధించి రూ.404 కోట్లు వ్యయం అంచనా వేశారు. పల్నాడు జిల్లాకు 209 కోట్లు, గుంటూరు, బాపట్లలోని మూడు నియోజకవర్గాలకు 195 కోట్లు కేటాయించారు. రూ.5 లక్షలలోపు 333 పనులను గుర్తించారు. రూ.40 లక్షల లోపు ఉన్న పనులు 990, రూ.40 లక్షల కన్నా ఎక్కువ వ్యయం ఉన్న పనులు 257గా నిర్ధారించారు. అయితే కొన్ని పనులు అరకొర ప్రారంభంకాగా ఇంకా కొన్ని పనులకు టెండర్లు ఖరారు కాలేదు. పల్నాడు జిల్లాలో 536 పనులు చేపట్టాల్సి ఉంది. గుంటూరు జిల్లా, బాపట్ల జిల్లాలోని రేపల్లె, పొన్నూరు, బాపట్ల నియోజకవర్గాల్లో 1044 పనులు చేపట్టాలి. పల్నాడు జిల్లాలో 132 పనులకు మాత్రమే టెండర్లు పిలిచారు. రూ.3.74 కోట్లు విలువైన 93 పనులు పూర్తి చేశామని, 25 పనులు జరుగుతున్నాయని ఆర్‌డబ్ల్యూఎస్‌ అధికారులు తెలిపారు. 

Updated Date - 2022-05-16T05:19:58+05:30 IST