భూఆక్రమణ కేసులో లాయర్ కుటుంబానికి జైలు శిక్ష..

ABN , First Publish Date - 2022-08-05T00:48:25+05:30 IST

ప్రముఖ వైద్యులు డాక్టర్ గుడారు జగదీష్ కుటుంబానికి చెందిన భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన నిందితులకి న్యాయస్థానం జరిమానా విధించింది. సుమారు 9..

భూఆక్రమణ కేసులో లాయర్ కుటుంబానికి జైలు శిక్ష..

చిత్తూరు: భూములను ఆక్రమించేందుకు ప్రయత్నించిన నిందితులకి న్యాయస్థానం జరిమానా విధించింది. సుమారు 9 సంవత్సరాల కిందటి ఈ కేసు వివరాలను పరిశీలిస్తే...


చిత్తూరుకు చెందిన ఎస్. కృష్ణమ నాయుడు వృత్తి రీత్యా న్యాయవాది కాగా, నకిలీ పత్రాలు సృష్టించడం ప్రధాన వృత్తిగా చేసుకున్నాడు. తిరుపతి, చిత్తూరు పరిసర ప్రాంతాలలోని విలువైన ప్రభుత్వ, ప్రైవేట్ స్థలాలను ఎంపిక చేసుకుని, వాటికి నకిలీ దస్తావేజులు తయారు చేసి అమ్మకాలు సాగించి సొమ్ము చేసుకునేవాడు. ఆ పత్రాలను నమ్మి అతని వద్ద భూములు కొన్నవారు ఆ తర్వాత న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూ అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 1967లో తిరుపతి రూరల్ మండలం దామినీడు గ్రామంలోని సర్వే నంబర్ 87/1బి, 87/3ఎ, 87/4ఎలో గల భూమిని ఐ.గౌరి, 87/6ఎ, 87/7ఎ లో కృష్ణారెడ్డి కుమార్తె పి.సుమతి, 87/1ఎ, 87/2ఎ ఇంకా 2బి, 87/3బి, 87/4బి, 87/5ఎ  ఇంకా బి, 87/6బి, 87/7బిలో భూమిని జి. లీలావతమ్మ కొనుగోలు చేశారు.


2003 సంవత్సరంలో ఈ భూమిలోని 87/3, 87/4, 87/6 సర్వే నంబర్లకు ఎస్. కృష్ణమనాయుడు తన కుమారుడు ఎస్. రామచంద్ర హక్కు కలిగి ఉన్నట్లు నకిలీ పత్రాలు సృష్టించి హైకోర్టులో కేసు వేశాడు. అయితే, అతని పిటిషన్‌ను పరిశీలించిన కోర్టు కొట్టివేసింది. అయినప్పటికీ 2013లో మళ్ళీ తన భార్య డా. శ్యామల, కుమారుడు ఎస్. రామచంద్ర, మరో ఇద్దరు న్యాయవాదులు, మరికొందరు తమ మనుషులతో కలిసి ఆ స్థలంలోకి దౌర్జన్యంగా ప్రవేశించి అందులో ఉన్న ప్రహరీ, బోరుబావిని ధ్వంసం చేశారు. ఆ సమయంలో తిరుచానూరు పోలీసులు అడ్డుకుని, వారిలో కొంతమందిని అరెస్టు చేయడంతో పాటు, కృష్ణమనాయుడుకు చెందిన కారును స్వాధీనం చేసుకుని క్రిమినల్ కేసు నమోదు చేశారు.


సుమారు తొమ్మిది సంవత్సరాల తర్వాత, అంటే ఆగస్టు 2వ తేదీన 5వ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 447, 506 మరియు 248(2) ప్రకారం ఈ కేసులోని ముద్దాయిలను దోషులుగా నిర్ధారించి జైలు శిక్ష విధిస్తూ తీర్పును వెలువరించింది. అయితే కృష్ణమ నాయుడు వయసు రీత్యా అనారోగ్యంతో ఉన్నట్లు, తన కుటుంబ పోషణ బాధ్యత రామచంద్రపై ఉండటం వలన వారిద్దరికీ జైలు శిక్ష విధిస్తే కుటుంబం ఇబ్బందులు పడుతుందని కోర్టును కోరారు. వారి విజ్ఞప్తిని పరిగణించిన న్యాయస్థానం క్రిమినల్ పీనల్ కోడ్ 360 ప్రకారం ఇది క్షమార్హమైన నేరం కాదనీ, అయితే వారి అనారోగ్యం, కుటుంబ పరిస్థితుల దృష్ట్యా మానవతా దృక్పథంతో జైలు శిక్షను మినహాయిస్తూ, ఒక్కొక్కరికి రూ.2,500 జరిమానా విధించింది.

Updated Date - 2022-08-05T00:48:25+05:30 IST