‘జైహింద్‌’ నినాద స్రష్ట హైదరాబాదీ

ABN , First Publish Date - 2022-08-12T06:57:38+05:30 IST

సాయుధ పోరాటంతోనే భారతావనికి స్వాతంత్య్రం సిద్ధిస్తుందని విశ్వసించి, ఆ పథంలో ముందుకు సాగిన నేతాజీతో కలిసి ఉద్యమించిన వ్యక్తులలో నగరవాసి అబిద్‌ ముఖ్యుడు.

‘జైహింద్‌’ నినాద స్రష్ట హైదరాబాదీ

భారత స్వాతంత్య్ర సంగ్రామంలో హైదరాబాదీల పాత్ర ఘనమైనదే. ఆంగ్లేయుల చెర నుంచి భారతావని విముక్తి కోసం ప్రాణాలను పణంపెట్టిన నగరవాసులెందరో. బ్రిటీషు ఏలికపై పిడికిలి బిగించిన తుర్రేబాజ్‌ఖాన్‌, మౌల్వీ అల్లా ఉద్దీన్‌ వంటి ధీరులు మరెందరో. ఆ వరుసలో తర్వాత తరానికి చెందిన అబిద్‌ హసన్‌ సఫ్రానీ పోరాట స్ఫూర్తి ప్రత్యేకమైంది. 


హైదరాబాద్‌ సిటీ, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): సాయుధ పోరాటంతోనే భారతావనికి స్వాతంత్య్రం సిద్ధిస్తుందని విశ్వసించి, ఆ పథంలో ముందుకు సాగిన నేతాజీతో కలిసి ఉద్యమించిన వ్యక్తులలో నగరవాసి అబిద్‌ ముఖ్యుడు. ఆయన బోస్‌కు వ్యక్తిగత కార్యదర్శిగానూ సేవలందించారు. నేతాజీ అధినాయకత్వంలోని ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ ‘‘గాంధీ బ్రిగేడ్‌’’కు కమాండర్‌గానూ వ్యవహరించారు. బర్మా యుద్ధ క్షేత్రంగా బ్రిటీషు సైన్యంతో తలపడి, ఇంఫాలా పరిసరాలలో బందీ అయ్యారు. కొన్నేళ్లపాటు కఠిన కారాగార శిక్ష అనుభవించారు. ఆజాద్‌ హింద్‌ ఫౌజ్‌లో భాగంగా నేతాజీ చేపట్టిన పోరాటంలో అబిద్‌ క్రియాశీల పాత్ర పోషించారు. జర్మనీలోని ‘‘ఫ్రీ ఇండియా సెంటర్‌’’, ‘‘ఇండియన్‌ లెజియన్‌’’ సైనిక విభాగంలో భారతీయులను భాగస్వాములను చేయడంలో విశేష కృషి చేశారు. 1943లో జర్మనీ నుంచి జపాన్‌కు జలాంతర్గామి ద్వారా నేతాజీతో కలిసి ప్రయాణించిన ఏకైక భారతీయుడు అబిద్‌ హసనే. బోస్‌కు హసన్‌ అంటే అభిమానం. 


ఇదీ అబిద్‌ జీవితం

అబిద్‌ హసన్‌ సఫ్రానీ అసలు పేరు జైన్‌-అల్‌-అబ్దిన్‌ హసన్‌. ఆయన తండ్రి అమీర్‌ హసన్‌ నిజాం ప్రభుత్వంలో ఉన్నతాధికారి. తల్లి ఫక్రూల్‌ హాజియా హసన్‌. ఆమె సరోజినీదేవి నాయుడు  స్నేహితురాలు కూడా. హాజియా జాతీయ భావాలు కలిగిన వ్యక్తి. తల్లి ప్రోత్సాహంతో అబిద్‌ సబర్మతీ ఆశ్రమంలో కొన్నాళ్లు గడిపారు. తర్వాత సాయుధ పోరాటంవైపు ఆకర్షితుడై, బ్రిటీషు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశారు. అదే సమయంలో ఏడాది జైలుశిక్ష అనుభవించారు.గాంధీ-ఇర్విన్‌ ఒడంబడిక వల్ల ఖైదు నుంచి విడుదలై నగరానికి చేరుకున్నాడు. అనంతరం తల్లి ఆకాంక్ష మేరకు విదేశాలలో ఉన్నత విద్య అభ్యసించేందుకు సన్నద్ధమయ్యారు. లండన్‌కు వెళ్లి చదవడం ఇష్టంలేక, బ్రిటీషు రాజ్యానికి విరోధులుగా నిలిచిన జర్మనీలో విద్య అభ్యసించేందుకు నిశ్చయించుకున్నాడు. అలా, అబిద్‌ బెర్లిన్‌ విశ్వవిద్యాలయంలో ఇంజనీరింగ్‌ పూర్తిచేశారు. అదే సమయంలో బోస్‌తో పరిచయం అబిద్‌ జీవితాన్ని మలుపుతిప్పింది. 1941, మార్చి నుంచి రెండేళ్లు నేతాజీ వ్యక్తిగత కార్యదర్శిగా అబిద్‌ సేవలందించారు. 


సఫ్రానీ పేరు..

జర్మనీలో నేతాజీ నెలకొల్పిన ‘‘ఆజాద్‌ హింద్‌ రేడియో’’, ‘‘ఆజాద్‌ హింద్‌’’ జర్మనీ, ఆంగ్ల పత్రిక తదితర మాధ్యమాలలోనూ అనువాదకుడిగా పనిచేశాడు. ‘ఫ్రీ ఇండియా సెంటర్‌’లో పోరాట యోధులు ఒకరికొకరు ఎదురుపడినప్పుడు పలకరించుకునేందుకు ‘‘జై హింద్‌’’ అని సంబోధించుకోవచ్చని అబిద్‌ సూచించారు. ఆ  ప్రతిపాదనను 1941, నవంబరు 2న ‘‘ఫ్రీ ఇండియా లీగ్‌’’ సమావేశంలో ఆమోదించారు. ‘‘హిందూస్థాన్‌ కో జయహో’’ (హిందూస్థాన్‌కు జయం కలుగుగాక) హిందీ నినాదానికి సంక్షిప్తమే ‘‘జై హింద్‌’’ అని అబిద్‌ ఒక సందర్భంలో వివరించినట్లు ఆనంద్‌సింగ్‌ బావె రచనలో ఉటంకించారు. బ్రిటీషు కబంధహస్తాల నుంచి హిందూస్థాన్‌ను విముక్తి చేయడమే తన జీవిత లక్ష్యం అంటూ భారత స్వాతంత్య్ర సంగ్రామంలో దుమికాడు. అప్పుడే అబిద్‌ తల్లిదండ్రులు పెట్టిన జైన్‌-అల్‌-అబ్దిన్‌ అనే తన పేరును  అబిద్‌ హసన్‌ సఫ్రానీగా మార్చుకున్నాడు. ఇండియన్‌ నేషనల్‌ ఆర్మీ మేల్కొలుపు పాటగా విశ్వకవి రవీంద్రనాథ్‌ టాగూర్‌ రచించిన ‘‘జనగణ మన’’గీతాన్ని ఆమోదించారు. ఆ క్రమంలో బెంగాలీ-సంస్కృతం మేళవింపులోని ఆ గీతాన్ని అబిద్‌ హసన్‌ హిందుస్థానీ (హిందీ-ఉర్దూ)భాషలోకి అనువదించి చరిత్రలో సుస్థిర స్థానం పొందారు. హైదరాబాద్‌ ఖ్యాతిని మరింత ఇనుమడింపచేశారు.

Updated Date - 2022-08-12T06:57:38+05:30 IST