27న జై భీమ్‌ భారత్‌ పార్టీ బహిరంగ సభ

ABN , First Publish Date - 2022-08-14T06:25:54+05:30 IST

రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యమైదానంలో ఈనెల 27న జై భీమ్‌ భారత్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని పార్టీ అధినేత జడ శ్రావణ్‌కుమార్‌ వెల్లడించారు.

27న జై భీమ్‌ భారత్‌ పార్టీ బహిరంగ సభ
పార్టీ అధినేత జడ శ్రావణ్‌కుమార్‌ మాట్లాడారు

రాజమహేంద్రవరం అర్బన్‌, ఆగస్టు 13 : రాజమహేంద్రవరం సుబ్రహ్మణ్యమైదానంలో ఈనెల 27న జై భీమ్‌ భారత్‌ పార్టీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నామని  పార్టీ అధినేత జడ శ్రావణ్‌కుమార్‌ వెల్లడించారు.  రాజమహేంద్రవరం ప్రెస్‌క్లబ్‌లో శనివారం విలేకరులతో మాట్లాడారు. ప్రస్తుతం ఉన్న రాజకీయపార్టీలకు ప్రత్యామ్నాయంగా తమ పార్టీ రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటుందని స్పష్టం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో  వేధింపులు ఎదుర్కొంటున్న వారందరినీ ఈ బహిరంగ సభ ద్వారా ఒకే వేదికపైకి తీసుకొచ్చి వారి ఆవేదన, ఆక్రందన ప్రజలకు తెలియజేయడం జరుగుతుందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అరాచక పాలనసాగుతుందన్నారు. వైసీపీ అధికారం చేపట్టి మూడున్నరేళ్లయినా రాజధాని లేకపోవడం ఒక రికార్డు అయితే 143 సార్లు హైకోర్టులో చీవాట్లు తినడం మరో రికార్డు అన్నారు. ఎన్నికల్లో గెలిచాక ప్రజల ముఖం చూడని ఎమ్మెల్యేలు, ఎంపీలది ఒక రికార్డు అయితే మూడున్నరేళ్లలో పట్లుమని పదిసార్లు కూడా ప్రజల ముఖం చూడలేని సీఎం జగన్‌ది మరో రికార్డు అన్నారు. మహిళా మంత్రులు రోజా, విడదల రజనీ, పుష్ప శ్రీవాణి వంటి వారు పొగడ్తల సామ్రాజ్యానికి యువరాణులుగా మిగలడం దురదృష్టకరమన్నారు. అసలు ఒక్క పొగడ్తకైనా జగన్‌ అర్హుడేనా అని ప్రశ్నించారు. బహిరంగ సభ పోస్టరు ఆవిష్కరించారు. సమావేశంలో పళ్లెం సురేంద్ర, ఏనుగుపల్లి కృష్ణ, కారెం మమత, దాడిశెట్టి వీరబాబు తదితర నాయకులు పాల్గొన్నారు.


Updated Date - 2022-08-14T06:25:54+05:30 IST