నేర సామ్రాజ్యమే జాహెద్‌ టార్గెట్‌

ABN , First Publish Date - 2022-10-05T16:05:03+05:30 IST

ఉగ్రవాద దాడులు, మతకల్లోలాలతో అశాంతిని నెలకొల్పడంతోపాటు.. హైదరాబాద్‌ నగరంలో నేరసామ్రాజ్య విస్తరణే లక్ష్యంగా ఐఎ్‌సఐ ఉగ్రవాది జాహెద్‌ కుట్రలు పన్నాడని స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(సిట్‌) స్పష్టం చేసింది. ఈ మేరకు

నేర సామ్రాజ్యమే జాహెద్‌ టార్గెట్‌

దసరా నాడు పేలుళ్ల కుట్రకేసు.. 

నిందితుల జాబితాలో ఆరుగురు

జాహెద్‌, సమీ, హసన్‌ల అరెస్టు

పాక్‌లో ముగ్గురు నిందితులు ఫర్హతుల్లా, సిద్ధిఖీ, హంజాలా

ఉగ్ర దాడులకు పాక్‌ నుంచి నిధులు

హవాలా ద్వారా 30 లక్షల బదిలీ

ఫసియుద్దీన్‌ మొదలు జాహెద్‌ దాకా..

రిమాండ్‌ రిపోర్టులో  ఉరగ్రవాద చరిత్ర


హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): ఉగ్రవాద దాడులు, మతకల్లోలాలతో అశాంతిని నెలకొల్పడంతోపాటు.. హైదరాబాద్‌ నగరంలో నేరసామ్రాజ్య విస్తరణే లక్ష్యంగా ఐఎ్‌సఐ ఉగ్రవాది జాహెద్‌ కుట్రలు పన్నాడని స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీం(సిట్‌) స్పష్టం చేసింది. ఈ మేరకు నాంపల్లి కోర్టుకు ఏడు పేజీల సుదీర్ఘ రిమాండ్‌ రిపోర్టును అందజేసింది. నల్లగొండకు చెందిన ఉగ్రవాది ఫసియుద్దీన్‌ మూడు దశాబ్దాల క్రితం సృష్టించిన విధ్వంసాలు మొదలు.. జాహెద్‌ దాకా హైదరాబాద్‌లో మొత్తం 30 ఏళ్ల ఉగ్రవాద చరిత్రను రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించింది. 1990లలో ఫసియుద్దీన్‌ ద్వారా ఆజంఘోరీ(ఎన్‌కౌంటర్‌లో హతమయ్యాడు), ఫర్హతుల్లా ఘోరీ, జాహెద్‌ పెద్దన్న షాహెద్‌ బిలాల్‌(కరాచీలో ఎన్‌కౌంటర్‌ అయ్యాడు), తమ్ముడు అబ్దుల్‌ మాజిద్‌, అబూ హంజాలా, సిద్ధిఖీ-బిన్‌-ఉస్మాన్‌ కార్యకలాపాలను వివరించింది. అబూహంజా లష్కరేతాయిబాకు సౌదీ అరేబియాలో కీలక నేతగా ఉన్నట్లు వెల్లడించింది. హైదరాబాద్‌ యువకులను ఉగ్రవాదం వైపు ఆకర్షించడంలో వీరంతా తమ వంతు పాత్రలను పోషిస్తున్నారని.. ఫర్హతుల్లా ఆదేశాలతో హైదరాబాద్‌లో విధ్వంసాలకు జాహెద్‌ కుట్రపన్నాడని పేర్కొంది. ఫసియుద్దీన్‌ హయాంలో హైదరాబాద్‌కు చెందిన కరసేవకులు పాపయ్యగౌడ్‌, నందరాజ్‌గౌడ్‌ల హత్య, శ్రీనివా్‌సగౌడ్‌ చేతులు నరకడం, జువెల్లరీ షాప్‌లో దొంగతనం చేశారంటూ ఇద్దరు ముస్లిం మహిళలను తనిఖీ చేయించినందుకు సునీల్‌కుమార్‌ అగర్వాల్‌ అనే నగల వ్యాపారి హత్య, ఇస్లాంను అవమానించారంటూ శ్యాంబాబు హత్య.. ఇలా మొత్తం 5 హత్యలు, ఓ హత్యాయత్నం, ఉగ్రవాద కార్యకలాపాల కోసం చేసిన ఓ దోపిడీ, 10 చోరీలు, స్నాచింగ్‌లను రిమాండ్‌ రిపోర్ట్‌లో ప్రస్తావించింది.


జైలు నుంచి విడుదలైనప్పటి నుంచే..

2005 నాటి బేగంపేట టాస్క్‌ఫోర్స్‌ కార్యాలయంలో మానవబాంబు దాడి కేసులో జాహెద్‌ 2017లో విడుదల కాగా.. అప్పటి నుంచే ఫర్హతుల్లా, అబూ హంజాలాతో కాంటాక్ట్‌లో ఉన్నాడని రిమాండ్‌ రిపోర్ట్‌ స్పష్టం చేస్తోంది. ‘‘ఈ క్రమంలో విడతల వారీగా జాహెద్‌కు పాకిస్థాన్‌ నుంచి హవాలా మార్గాల్లో రూ. 30 లక్షల నగదు అందింది. పాకిస్థాన్‌లో ఉంటోన్న ఐఎ్‌సఐ/లష్కరే తాయిబా ఏజెంట్లు అబుల్‌ నొమాన్‌, సయ్యద్‌ ఇంతియాజ్‌ హుస్సేన్‌, మహమ్మద్‌ మిన్హాజుల్‌ అబేదిన్‌, మహమ్మద్‌ ఫిరోజ్‌ ఈ డబ్బును చేరవేశారు. ఈ డబ్బును చేరవేయడంలో జాహెద్‌కు హైదరాబాద్‌లో ఉండే అతని 11 మంది స్నేహితులు సహకరించారు. ఫర్హతుల్లా ఆదేశాలతో తనకు 4 హ్యాండ్‌ గ్రనేడ్లు చేరాయని, వాటితో విధ్వంసాలకు కుట్రపన్నానని జాహెద్‌ వాంగ్మూలమిచ్చాడు. జాహెద్‌ దగ్గర రెండు.. సమీ, మాజ్‌ వద్ద మరో రెండు గ్రనేడ్లను స్వాధీనం చేసుకున్నాం. వీరు గ్రనేడ్‌ పార్సిళ్లను మోటార్‌ సైకిళ్లపై హైదరాబాద్‌కు తీసుకువచ్చారు’’ అని సిట్‌ అధికారులు రిమాండ్‌ రిపోర్ట్‌లో వివరించారు.


జాహెద్‌ ఫోన్లలో ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌లు

సైదాబాద్‌, అక్టోబరు 4 (ఆంధ్రజ్యోతి): జాహెద్‌ మొబైల్‌ఫోన్లలో అత్యంత అధునాతన ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌లు ఉన్నట్లు సిట్‌ వర్గాలు గుర్తించాయి. నాలుగు గ్రనేడ్‌లను పాకిస్థాన్‌ నుంచి తెప్పించిన పార్సిల్‌లోనే.. ఐఎ్‌సఐ హ్యాండ్లర్లు అతనికి రెండు ఫోన్లను పంపారని నిర్ధారించారు. ‘‘ఇస్లామిక్‌ స్టేట్‌ ఉగ్రవాదులు నిఘావర్గాలు గుర్తించకుండా సమాచార మార్పిడికి అత్యంత అధునాతన ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌లను వాడుతున్నారు. జాహెద్‌ ఫోన్‌లో కూడా అలాంటి యాప్‌లు ఉన్నాయి. వాటి ద్వారానే అతను పాకిస్థాన్‌లో ఉంటోన్న లష్కరే తాయిబా హ్యాండ్లర్లు, ఫర్హతుల్లా ఘోరీ, ఐఎ్‌సఐ ఏజెంట్లతో సంభాషిస్తున్నట్లు గుర్తించాం. వాటిని డీక్రిప్ట్‌ చేసేందుకు ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపించాం. ఉగ్రవాదులు వాడే ఎన్‌క్రిప్టెడ్‌ యాప్‌లను క్రాక్‌ చేసేందుకు ప్రయత్నిస్తే.. వాటంతట అవే అన్‌ఇన్‌స్టాల్‌ అవ్వడమే కాకుండా.. ఫోన్లలో ఉన్న డేటా మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది. అందుకే చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం’’ అని సిట్‌ వర్గాలు వెల్లడించాయి. ఇటీవల అసోంలో పట్టుబడ్డ అల్‌-ఖాయిదా ఇన్‌ ఇండియన్‌ సబ్‌-కాంటినెంట్‌(ఐఎ్‌సఏక్యూ) ఉగ్రవాదులు కూడా ఈ తరహా యాప్‌లను వాడినట్లు తెలుస్తోంది. మరోవైపు చంచల్‌గూడ జైలులో ఉన్న జాహెద్‌, సమీయుద్దీన్‌, హసన్‌లను హైసెక్యూరిటీ బ్యారెక్‌లలో పెట్టారు. జాహెద్‌ను ఐసోలేటెడ్‌ బ్యారెక్‌లో వేరుగా పెట్టినట్లు తెలిసింది. ఈ ముగ్గురిపై నిరంతరం నిఘా ఉంచేందుకు సెల్‌లో సీసీకెమెరాలను ఏర్పాటు చేశారని సమాచారం. ఈ ముగ్గురికి ఆహార పదార్థాలను అందజేసే సిబ్బందికి కూడా బాడీవోర్న్‌ కెమెరాలను అమరుస్తున్నట్లు జైలు వర్గాలు వెల్లడించాయి. ఇదే జైలులో పాపులర్‌ ఫ్రంట్‌ ఆఫ్‌ ఇండియా(పీఎ్‌ఫఐ)కి చెందిన 13 మంది ఉండడంతో.. జాహెద్‌ గ్యాంగ్‌ వీరితో కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

Updated Date - 2022-10-05T16:05:03+05:30 IST