జగ్గిరెడ్డి వ్యాఖ్యలపై దుమారం

ABN , First Publish Date - 2020-06-07T08:28:21+05:30 IST

జిల్లాలో ఇసుక దుమారం రాజకీయంగా తీవ్ర చర్చనీ యాంశమైంది..

జగ్గిరెడ్డి వ్యాఖ్యలపై దుమారం

చర్చనీయాంశమైన ఇసుక అంశం..

వినియోగదారుల నుంచి మద్దతు

వెంటనే రంగంలోకి దిగిన పార్టీ పెద్దలు..

ముఖ్య నేతల నుంచి ఫోన్లు


అమలాపురం(ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక దుమారం రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశమైంది. అధికార వైసీపీకి చెందిన కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి వినియోగదారులు ఎదుర్కొంటున్న ఇసుక కష్టాలపై శుక్రవారం రావులపాలెంలో ఏర్పాటుచేసిన సదస్సులో గళం విప్పారు. ఏపీఎండీసీ అనుసరిస్తున్న తీరుపై తీవ్రస్థాయిలో ఎమ్మెల్యే మండిపడ్డ తీరు అధికార వైసీపీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. జిల్లాకు చెందిన రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి పినిపే విశ్వరూప్‌, ఎమ్మెల్యే జగ్గిరెడ్డితో ఫోన్లో మాట్లాడినట్టు సమాచారం. జగ్గిరెడ్డి ఇసుక కష్టాలపై ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఏకరువు పెట్టిన తీరుపై రాష్ట్రవ్యాప్తంగా అధికారపార్టీకి చెందిన ముఖ్య నేతలతోపాటు కొందరు ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఆయనతో మాట్లాడి అనునయించినట్టు తెలిసింది.


ఉభయగోదావరి జిల్లాల పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి, టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి సైతం జగ్గిరెడ్డితో మాట్లాడినట్టు సమాచారం. అయితే జిల్లాలో ఇసుక వినియోగదారులు ఎదుర్కొంటున్న కష్టాలను బహిరంగంగా వ్యక్తం చేయడం ప్రభుత్వ ధిక్కరణ అంటూ కొందరు ప్రచారం చేస్తున్నప్పటికీ ప్రజల్లో నుంచి మాత్రం ఆయనకు మద్దతు లభిస్తోంది. క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలను జగ్గిరెడ్డి ప్రస్తావించడం తప్పెలా అవుతుందని వారు సమర్థిస్తున్నారు. అయితే జగ్గిరెడ్డి శనివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో తన మాటలను మీడియా వక్రీకరించిందంటూ చెప్పారు. అయితే జగ్గిరెడ్డి రెండు, మూడు రోజుల్లో పార్టీ అధిష్ఠానం పెద్దలను కలిసి వాస్తవ పరిస్థితులను వివరించే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.


లోపాలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లే స్వేచ్ఛ జగన్‌ మాకిచ్చారు: జగ్గిరెడ్డి

సమస్యలపై తక్షణం స్పందించే నాయకుడు జగన్‌ అని, శాఖల పనితీరుపై సమీక్షలు జరిపి లోపాలను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే స్వేచ్ఛ తమకు ఆయన ఇచ్చారని కొత్తపేట ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి చెప్పారు. శనివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఇసుక విధానంపై జగన్‌ వెంటనే స్పందించడం జరిగిందని, అయితే మీడియా వక్రీకరించి వార్తలు రాయడం దారుణమన్నారు.


అంతేకాకుండా ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలనలో పార్టీకి చెందిన ఎమ్మెల్యేలంతా సంతృప్తికరంగా ఉన్నామన్నారు. సంక్షేమ అభివృద్ధి పథకాల అమలులో వైసీపీ ప్రభుత్వ పాలనలో మునుపెన్నడూ జరగని అభివృద్ధి జరుగుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వ పాలనలో జన్మభూమి కమిటీల కారణంగా అర్హులకు పెన్షన్లు అందలేదని, వైసీపీ ప్రభుత్వ పాలనలో అర్హులకు పెన్షన్లు అందజేస్తున్నామని ఆయన తెలిపారు.


Updated Date - 2020-06-07T08:28:21+05:30 IST