తెల్లబెల్లం ధరలు పతనం

ABN , First Publish Date - 2020-11-11T06:25:22+05:30 IST

దీపావళి పండగొస్తే తెల్లబెల్లం ధరలకు రెక్కలొస్తాయ్‌. ఈసారి ఊహించని విధంగా ధరలు పడిపోయాయి.

తెల్లబెల్లం ధరలు పతనం

 కిలో రూ.40కీ కొనేవాళ్ళు లేక 

  మండీల్లో పేరుకుపోయిన నిల్వలు

  గత దీపావళికి కిలో రూ. 55 నుంచి 58


 చిత్తూరు(వ్యవసాయం), నవంబరు 10 : దీపావళి పండగొస్తే తెల్లబెల్లం ధరలకు రెక్కలొస్తాయ్‌.అయితే  ఈసారి ఊహించని విధంగా తెల్లం బెల్లం ధరలు పడిపోయాయి.గత ఏడాది దీపావళికి కిలో రూ. 55 నుంచి 58 మధ్య, వినాయక చవితికి కిలో రూ. 62 నుంచి 64 మధ్య ధర పలికిన బెల్లం ఈసారి రైతులను హతాశులను చేసింది. హోల్‌సేల్‌ ధర కిలో రూ.38 నుంచి 40 మధ్య , రిటైల్‌గా అయితే మార్కెట్లో రూ.43కు లభిస్తోంది.అవసరానికి మించి తెల్లబెల్లం ఉత్పత్తి కావడంతో ధరలు పడిపోయి  టన్నుల కొద్దీ తెల్లబెల్లం నిల్వలు మండీల్లో నిలిచిపోయాయి.చిత్తూరులోనే  ఒక్కో మండీలో 50 నుంచి 60 టన్నుల వరకు స్టాకు నిలిచిపోయింది. సుమారు వెయ్యి టన్నుల తెల్లబెల్లం నిల్వలు మండీల్లో నిలిచిపోయినట్టు వ్యాపారులు చెబుతున్నారు. గతంలో అయితే ఏడాదికోసారి మాత్రమే చెరకు గానుగ ఆడేవారు.అయితే ఈమధ్య తమిళనాడు సరిహద్దు మండలాలైన జీడీనెల్లూరు, ఎస్‌ఆర్‌పురం, పాలసముద్రం, పుత్తూరు మండలాల రైతులు తమిళనాడు నుంచి ఆరునెలల చెరుకును తెచ్చుకుని దానికి చక్కెర కలుపుకుని తెల్లబెల్లం తయారు చేస్తున్నారు. ఈ ప్రక్రియ ఏడాదంతా జరుగుతుండడంతో తెల్లబెల్లం అవసరానికి మించి ఉత్పత్తై ధరలు పతనమయ్యాయి.మరోవైపు నల్లబెల్లానికి డిమాండు పెరిగింది. అనఽధికార ఆంక్షలున్నట్టు ప్రచారం జరుగుతుండడంతో గతవారం వరకు కిలో రూ.50 పలికిన నల్లబెల్లం నేడు తెల్లబెల్లంతో సమానంగా రూ.40 పలుకుతోంది. 

Updated Date - 2020-11-11T06:25:22+05:30 IST