25న అనుచరులతో జగ్గారెడ్డి సమావేశం

ABN , First Publish Date - 2022-02-24T02:14:48+05:30 IST

తన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో ఎమ్మెల్యే

25న అనుచరులతో జగ్గారెడ్డి సమావేశం

సంగారెడ్డి: తన అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, అనుచరులతో ఎమ్మెల్యే, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ నెల 25న సంగారెడ్డిలో సమావేశం కానున్నారు.  కాంగ్రెస్ పార్టీకి రాజీనామా, తదుపరి కార్యాచరణపై చర్చించనున్నారు. 


జగ్గారెడ్డి సొంతంగా పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా కాంగ్రెస్‌ను వీడాక తాను ఏ పార్టీలోనూ చేరేది లేదని, స్వతంత్రంగానే వ్యవహరిస్తాననీ తన సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం, సోనియాగాంధీ కుటుంబంపైన మొదటి నుంచీ తన విధేయతను ప్రకటిస్తూ వస్తున్న జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి నియామకం పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. రేవంత్‌ పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నప్పుడే మీడియాతో చిట్‌చాట్లలో, పలుమార్లు పత్రికా ముఖంగా వ్యతిరేకించారు. రేవంత్‌ ఆర్మీ పేరుతో సోషల్‌ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌ నియామకం తర్వాత కూడా ఆయన వ్యవహార శైలిని తప్పుపడుతూ వస్తున్నారు. 


వ్యక్తిగత ఇమేజీని పెంచుకోవడానికే రేవంత్‌ ప్రాధాన్యం ఇస్తున్నారనీ, తమకు సమాచారం ఇవ్వకుండానే తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ప్రకటిస్తున్నారని ఆక్షేపిస్తూ ఇటీవల అధిష్ఠానానికి లేఖా రాశారు. ‘పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డినైనా మార్చండి.. లేకుంటే ఆయన పనితీరునైనా మార్చుకోవాలని సూచించండి’ అని ఆ లేఖలో అధిష్ఠానాన్ని కోరారు.


సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందనే కారణంతోనే తాను కాంగ్రె్‌సను ఇష్టపడ్డానని.. కానీ, సొంత పార్టీ నేతలే తనపై సోషల్‌ మీడియాలో, బయటా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు చేసి గెలిచి ఇలా కోవర్టునన్న ముద్ర వేయించుకోవాల్సిన అవసరమేముందని, పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా వ్యవహరిస్తాననీ వారికి చెప్పినట్లు సమాచారం. టీఆర్‌ఎ్‌సలో చేరదామన్న ప్రతిపాదననూ సమావేశంలో జగ్గారెడ్డి తోసిపుచ్చినట్లు చెబుతున్నారు. అలా చేరితే తాను టీఆర్‌ఎస్‌ కోవర్టునంటూ సొంత పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం నిజం చేసినట్లవుతుందని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.

 


Updated Date - 2022-02-24T02:14:48+05:30 IST