కాంగ్రెస్‌కు జగ్గారెడ్డి గుడ్‌బై?

ABN , First Publish Date - 2022-02-19T06:39:35+05:30 IST

కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు

కాంగ్రెస్‌కు జగ్గారెడ్డి   గుడ్‌బై?

  • నేడు రాజీనామా ప్రకటన చేసే అవకాశం!
  • పీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి తీరుపై తొలి నుంచీ అసంతృప్తి
  • టీఆర్‌ఎస్‌ కోవర్టని ప్రచారం చేస్తూ తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీస్తున్నారని ఆవేదన 
  • ఏ పార్టీలోనూ చేరేది లేదంటున్న జగ్గారెడ్డి.. సొంతంగా పార్టీ పెట్టే చాన్స్‌!
  • మాకు ముందే తెలుసు: రేవంత్‌ సన్నిహిత వర్గాలు


హైదరాబాద్‌, ఫిబ్రవరి 18 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పనున్నట్లు సమాచారం. తాను కాంగ్రెస్‌ పార్టీకి ఎందుకు దూరం అవుతున్నదీ వివరిస్తూ.. శనివారం మధ్యాహ్నం 12 గంటలకు ఆయన రాజీనామా ప్రకటన చేసే అవకాశం ఉంది. తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపనున్నట్లు తెలుస్తోంది. జగ్గారెడ్డి సొంతంగా పార్టీ పెడతారన్న ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా.. కాంగ్రె్‌సను వీడాక తాను ఏ పార్టీలోనూ చేరేది లేదని, స్వతంత్రంగానే వ్యవహరిస్తాననీ తన సన్నిహితులతో చెబుతున్నట్టు సమాచారం. వాస్తవానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం, సోనియాగాంధీ కుటుంబంపైన మొదటి నుంచీ తన విధేయతను ప్రకటిస్తూ వస్తున్న జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి నియామకం పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.


రేవంత్‌ పేరును అధిష్ఠానం పరిశీలిస్తున్నప్పుడే మీడియాతో చిట్‌చాట్లలో, పలుమార్లు పత్రికా ముఖంగా వ్యతిరేకించారు. రేవంత్‌ ఆర్మీ పేరుతో సోషల్‌ మీడియాలో తనపై దుష్ప్రచారం చేస్తున్నారంటూ విమర్శలు చేశారు. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌ నియామకం తర్వాత కూడా ఆయన వ్యవహార శైలిని తప్పుపడుతూ వస్తున్నారు. వ్యక్తిగత ఇమేజీని పెంచుకోవడానికే రేవంత్‌ ప్రాధాన్యం ఇస్తున్నారనీ, తమకు సమాచారం ఇవ్వకుండానే తమ నియోజకవర్గాల్లో కార్యక్రమాలు ప్రకటిస్తున్నారని ఆక్షేపిస్తూ ఇటీవల అధిష్ఠానానికి లేఖా రాశారు.


‘పీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డినైనా మార్చండి.. లేకుంటే ఆయన పనితీరునైనా మార్చుకోవాలని సూచించండి’ అని ఆ లేఖలో అధిష్ఠానాన్ని కోరారు. ఇది క్రమశిక్షణ ఉల్లంఘన కిందకు వస్తుందన్న టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్‌ చిన్నారెడ్డి.. దీనిపై జగ్గారెడ్డిని వివరణ కోరతామని ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన టీపీసీసీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశంలో ఈ అంశంపైన సీరియస్‌ అయిన జగ్గారెడ్డి.. పార్టీలో అంతర్గతంగా చెప్పుకొనే స్వేచ్ఛ లేనప్పుడు పార్టీకి రాజీనామా చేస్తానంటూ ఆవేశపడ్డారు. తాను స్వతంత్ర అభ్యర్థిగానే సంగారెడ్డిలో పోటీ చేసి గెలుస్తానన్నారు. అయితే ఎవరూ రాజీనామా చేయాల్సిన అవసరం లేదంటూ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు అనునయించారు.


ఇదిలా ఉండగా.. శుక్రవారంనాడు పటాన్‌ చెరు వద్దనున్న మత్తంగిలో తన అనుచరులతో సమావేశమైన జగ్గారెడ్డి.. తాను టీఆర్‌ఎస్‌ కోవర్టునంటూ సోషల్‌ మీడియాలో ప్రచారం చేయడం ద్వారా తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతర్గత ప్రజాస్వామ్యం ఉంటుందనే కారణంతోనే తాను కాంగ్రె్‌సను ఇష్టపడ్డానని.. కానీ, సొంత పార్టీ నేతలే తనపై సోషల్‌ మీడియాలో, బయటా దుష్ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కోట్లు ఖర్చు చేసి గెలిచి ఇలా కోవర్టునన్న ముద్ర వేయించుకోవాల్సిన అవసరమేముందని, పార్టీకి రాజీనామా చేసి స్వతంత్రంగా వ్యవహరిస్తాననీ వారికి చెప్పినట్లు సమాచారం. టీఆర్‌ఎ్‌సలో చేరదామన్న ప్రతిపాదననూ సమావేశంలో జగ్గారెడ్డి తోసిపుచ్చినట్లు చెబుతున్నారు. అలా చేరితే తాను టీఆర్‌ఎస్‌ కోవర్టునంటూ సొంత పార్టీ నేతలు చేస్తున్న ప్రచారం నిజం చేసినట్లవుతుందని ఆయన సమాధానం ఇచ్చినట్లు తెలిసింది.


కాగా.. జగ్గారెడ్డి పార్టీ నుంచి వెళ్లిపోతారన్న సంగతి తమకు రెండు నెలల ముందే తెలుసుననీ రేవంత్‌ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఆ మేరకు తమకు సంకేతాలూ ఉన్నాయని ఆ వర్గాలు అంటున్నాయి. రేవంత్‌ను టీపీసీసీ అధ్యక్ష పదవి నుంచి తప్పించే ఎత్తుగడలు పారకపోవడంతో ఆయన సొంత దారి వెతుక్కుంటున్నారని అంతర్గతంగా ఆరోపిస్తున్నాయి.



ఎమ్మెల్యేగా కొనసాగుతారు..

కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేసినా.. ఎమ్మెల్యే పదవిలో మాత్రం జగ్గారెడ్డి కొనసాగనున్నట్లు చెబుతున్నారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జగ్గారెడ్డి రాజీనామా చేసి.. ఆ రాజీనామాను అధిష్ఠానం ఆమోదించిన పక్షంలో జగ్గారెడ్డిపై అనర్హత వేటు వేయాలంటూ స్పీకర్‌కు సీఎల్పీ నేత పిటిషన్‌ను దాఖలు చేసుకోవాల్సి ఉంటుంది. దానిపై స్పీకర్‌ తన విచక్షణ మేరకు నిర్ణయం తీసుకుంటారు.


ఆమోదిస్తారా.. పిలిచి మాట్లాడుతారా?

పార్టీ తరఫున గెలిచిన ఎమ్మెల్యేల్లో 12 మందిని ఇప్పటికే జారవిడుచుకున్న కాంగ్రెస్‌.. మరో ఎమ్మెల్యేను పోగొట్టుకునేందుకు సిద్ధపడుతుందా? అన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం సభలో పార్టీకి ఆరుగురు సభ్యులుంటే.. అందులో  రాజగోపాల్‌రెడ్డి పార్టీతో అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు.  ఇలాంటి పరిస్థితుల్లో జగ్గారెడ్డి రాజీనామా చేస్తే క్రమశిక్షణ విషయంలో గట్టి సంకేతాన్ని ఇచ్చేందుకు పార్టీ దాన్ని ఆమోదిస్తుందా.. లేక జగ్గారెడ్డిని పిలిచి మాట్లాడుతుందా అనే చర్చ నడుస్తోంది. కాగా.. జగ్గారెడ్డి రాజీనామా చేస్తున్నారన్న వార్తల నేపథ్యంలో పీసీసీ మాజీ చీఫ్‌ ఉత్తమ్‌, సీఎల్పీ నేత భట్టి, ఏఐసీసీ కార్యదర్శి బోసురాజు ఆయనకు ఫోన్‌ చేసి తొందర పడొద్దని బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు సమాచారం. 


Updated Date - 2022-02-19T06:39:35+05:30 IST