సీఎల్పీ భేటీని బాయ్‌కాట్ చేసిన జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-03-06T19:08:39+05:30 IST

సీఎల్పీ భేటీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాయ్‌కాట్ చేశారు. సమావేశంలో చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా...

సీఎల్పీ భేటీని బాయ్‌కాట్ చేసిన జగ్గారెడ్డి

హైదరాబాద్‌: సీఎల్పీ భేటీని ఎమ్మెల్యే జగ్గారెడ్డి బాయ్‌కాట్ చేశారు. సమావేశంలో చాలా విషయాలు మాట్లాడాలనుకున్నా... వద్దన్నారు కాబట్టి వెళ్ళిపోతున్నానని తెలిపారు. తనను అవమానించే దమ్ము ఎవరికి లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతానని జగ్గారెడ్డి ప్రకటించారు. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో సీఎల్పీ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభంలోనే జగ్గారెడ్డి తన అభిప్రాయాలను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అలాగే నేతల తీరుపై కూడా ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల పార్టీలో జరుగుతున్న పరిణామాలతో విసుగుచెందానని జగ్గారెడ్డి వాపోయారు.


సమావేశం నుంచి బయటకు వచ్చిన తర్వాత జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మెదక్‌ పర్యటనపై జగ్గారెడ్డి మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి పర్యటనపై తనకు సమాచారంలేదని చెప్పారు. రేవంత్‌రెడ్డి తీరుపై జగ్గారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. జగ్గారెడ్డి, కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తారని కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఆ పార్టీ నేతలు ఆయనతో సంప్రదింపులు జరిపిన తర్వాత రాజీనామా నిర్ణయాన్ని తాత్కాలికంగా వాయిదా వేసుకున్నారు. తన రాజీనామా లేఖను ఏఐసీసీకి పంపినట్లుగా ప్రచారంలో ఉంది. వాస్తవానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం, సోనియాగాంధీ కుటుంబంపైన మొదటి నుంచీ తన విధేయతను ప్రకటిస్తూ వస్తున్న జగ్గారెడ్డి.. టీపీసీసీ అధ్యక్షునిగా రేవంత్‌రెడ్డి నియామకం పట్ల మాత్రం తీవ్ర అసంతృప్తితో ఉన్నారు.

Updated Date - 2022-03-06T19:08:39+05:30 IST