డప్పు కొట్టి.. చిందేసిన జగ్గారెడ్డి

ABN , First Publish Date - 2022-06-03T09:35:53+05:30 IST

హైదరాబాద్‌, మే 2(ఆంధ్రజ్యోతి): గాంధీభవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అధిక

డప్పు కొట్టి.. చిందేసిన జగ్గారెడ్డి

గాంధీభవన్‌లో అట్టహాసంగా ఆవిర్భావ దినోత్సవం

కార్యకర్తల్లో ఉత్సాహం నింపిన టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌

బాణసంచా కాల్చి, స్వీట్లు పంచి నేతల సంబరాలు

ఉద్యమ హామీలను నెరవేర్చడంలో కేసీఆర్‌ విఫలం

రైతులు, ఉద్యోగులు, సంతోషంగా లేరు

మూల్యం చెల్లించుకోక తప్పదు: జగ్గారెడ్డి

హైదరాబాద్‌, మే 2(ఆంధ్రజ్యోతి): గాంధీభవన్‌లో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను అట్టహాసంగా నిర్వహించారు. కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి.. బాణాసంచా కాల్చి, స్వీట్లు పంచి, డప్పులు వాయిస్తూ ఆనందాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో కలిసి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, వి.హన్మంతరావు ఉత్సాహంగా డప్పు వాయించారు. జగ్గారెడ్డి.. బంజారాలతో కలిసి చిందేశారు. జగ్గారెడ్డితోపాటు నేతలు బొల్లు కిషన్‌, అనిల్‌కుమార్‌ యాదవ్‌, ఫిరోజ్‌ ఖాన్‌ తదితరులు పాదం కలిపారు. నేతలు, కార్యకర్తల ఆటా పాటలతో గాంధీభవన్‌లో కోలాహలం నెలకొంది. కాగా, గాంధీభవన్‌లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి విచ్చేసిన పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌కు జగ్గారెడ్డితోపాటు యూత్‌ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి, పార్టీ నేతలు అనిల్‌కుమార్‌ యాదవ్‌, మెట్టు సాయికుమార్‌ సాదర స్వాగతం పలికారు. అనంతరం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ తమ పార్టీ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ ఇచ్చిన తెలంగాణలో రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. కాంగ్రెస్‌ ఇచ్చిన తెలంగాణలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్‌, ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శించారు. ప్రధానంగా రైతులు, ఉద్యోగులు, మహిళలు సంతోషంగా లేరని చెప్పారు. వారి వ్యతిరేకత ఎలా ఉందో వచ్చే ఎన్నికల్లో కేసీఆర్‌కు తెలిసి వస్తుందని జోస్యం చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ తెలంగాణ ఇచ్చిందన్న సంతోషం ఇక్కడి ప్రజలకు లేకుండా చేస్తున్న టీఆర్‌ఎస్‌.. తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. అంతకుముందు రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మహే్‌షకుమార్‌గౌడ్‌ గాంధీభవన్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మహే్‌షకుమార్‌గౌడ్‌ మాట్లాడుతూ ఇందిరాగాంధీ కూడా చేయలేని సాహసం సోనియా చేశారని, తెలంగాణ ప్రజలకు ఆమె ఇచ్చిన కానుక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అని కొనియాడారు. కార్యక్రమంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, అంజన్‌కుమార్‌ యాదవ్‌, గీతారెడ్డి, మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు, పీసీసీ మాజీ చీఫ్‌లు వీహెచ్‌, పొన్నాల లక్ష్మయ్య పాల్గొన్నారు. 

Updated Date - 2022-06-03T09:35:53+05:30 IST