Vice-presidnt: ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌కఢ్ గెలుపు

ABN , First Publish Date - 2022-08-07T01:42:12+05:30 IST

భారత నూతన ఉపరాష్ట్రపతిగా (Vice president) జగ్‌దీప్ ధన్‌కఢ్ (Jagdeep Dhankar) ఘనవిజయం ..

Vice-presidnt: ఎన్డీయే అభ్యర్థి జగ్‌దీప్ ధన్‌కఢ్ గెలుపు

న్యూఢిల్లీ: భారత నూతన ఉపరాష్ట్రపతిగా (Vice president) జగ్‌దీప్ ధన్‌కఢ్ (Jagdeep Dhankar) ఘనవిజయం సాధించారు. ఆయన గెలుపును లోక్‌సభ జనరల్ సెక్రటరీ ఉత్పల్  కె.సింగ్ అధికారికంగా ప్రకటించారు. 346 ఓట్ల ఆధిక్యంతో ధన్‌కఢ్ గెలుపొందారు. మొత్తం పోలైన 725 ఓట్లలో 528 ఓట్లను ఆయన సొంతం చేసుకున్నారు. 15 ఓట్లు చెల్లలేదు. ధన్‌కఢ్‌పై విపక్షాల అభ్యర్థిగా పోటీ చేసిన మార్గరెట్ ఆల్వాకు 182 ఓట్లు వచ్చాయి. మొత్తం 725 మంది ఎంపీలు ఓటు హక్కు వినియోగించుకోగా, 92.94 శాతం పోలింగ్ నమోదైనట్టు ఉత్పల్ కె సింగ్ తెలిపారు.


దీనికి ముందు, శనివారం ఉదయం 10 గంటలకు పార్లమెంటు హాలులో ఓటింగ్ మొదలై సాయంత్రం ముగిసింది. ఆ వెంటనే సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కౌంటింగ్ ప్రారంభమై ముగియడంతో ధన్‌కఢ్ ఎన్నికను అధికారికంగా ప్రకటించారు. మార్గెరెట్ ఆల్వా ఎంపిక విషయంలో తమను సంప్రదించలేదంటూ కినుక వహించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఓటింగ్‌కు దూరంగా ఉంది. అయితే సువేందు అధికారి తండ్రి శిశిర్ అధికారి, దిబ్యేందు అధికారి ఓటు వేశారు. 34 మంది టీఎంసీ ఎంపీలు ఓటింగ్‌కు దూరంగా ఉండిపోయారు. లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సహా పలువురు ప్రముఖులు ఉదయమే ఓటు వేశారు. మంత్రులు అమిత్ షా, కిరణ్ రిజిజు, నితిన్ గడ్కరి, ధర్మేంద్ర ప్రధాన్, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డా, గజేంద్ర సింగ్ షెఖావత్, అర్జున్ రాం మెఘ్వాల్, వి.మురళీధరన్, జ్యోతిరాదిత్య సింధియా,రాజీవ్ చంద్రశేఖర్,  బీజేపీ ఎంపీ హేమమాలిని, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ఆ పార్టీ ఎంపీలు శశిథరూర్, జైరాం రమేష్, అధీర్ రంజన్ చౌదరి, ఆప్ ఎంపీలు హర్బజన్ సింగ్, సంజయ్ సింగ్, డీఎంకే ఎంపీ కనిమొళి తదితరులు ఓటు హక్కును వినియోగించుకున్నారు.


Updated Date - 2022-08-07T01:42:12+05:30 IST